ఫిబ్రవరి నెలలో జరుపుకునే వివిధ జాతీయ దినోత్సవాలు మరియు అంతర్జాతీయ
దినోత్సవాల వివరాలు తెలుసుకోండి. ప్రముఖుల పుట్టిన రోజులు, మరణాల సమాచారం
కూడా పొందండి. వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఈ సమాచారం
ఉపయోగపడుతుంది.
ప్రపంచ ఆస్పెర్జిలోసిస్ దినోత్సవం | ఫిబ్రవరి 01
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీని ప్రపంచ ఆస్పెర్గజిలోసిస్
దినోత్సవంగా జరుపుకుంటారు. ఆస్పెర్జిల్లస్ ఫంగస్ వల్ల కలిగే తీవ్రమైన
పల్మనరీ ఇన్ఫెక్షన్ (ఆస్పెర్గజిలోసిస్) సంబంధించి అవగాహనా కల్పించేందుకు
దీనిని జరుపుకుంటారు.
"ఫంగస్ బాల్" గా పిలవబడే ఈ ఆస్పెర్జిల్లస్ ఇన్ఫెక్షన్, మానవుని
ఉపిరితితిత్తులలో దీర్ఘకాలిక అనారోగ్యానికి కారణమవుతుంది. ఇది తరువాత దశలో
శరీరంలోని ఇతర భాగాలకు, ముఖ్యంగా మెదడు, గుండె మరియు మూత్రపిండాలకు
వ్యాప్తి చెందుతుంది.
ఇండియన్ కోస్ట్ గార్డ్ డే | ఫిబ్రవరి 01
ఏటా ఫిబ్రవరి 01 వ తేదీని ఇండియన్ కోస్ట్ గార్డ్ దినోత్సవంగా
జరుపుకుంటారు. భారత కోస్ట్ గార్డ్ (ICG) దినోత్సవాన్ని 18 ఆగస్ట్ 1978న
భారత పార్లమెంటు ఆమోదించింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ తీరప్రాంత జలాలపై
గస్తీ నిర్వహిస్తుంది, అలానే సముద్ర అక్రమ రవాణా కార్యకలాపాలను
నిరోధిస్తుంది, అలానే సముద్ర జీవావరణ జీవవైవిధ్యాన్ని పరిరక్షిస్తుంది,
వేటగాళ్లను పట్టుకుంటుంది, మత్స్యకారులకు సహాయం చేస్తుంది.
రుమటాయిడ్ ఆర్థరైటిస్ అవేర్నెస్ డే | ఫిబ్రవరి 02
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2న రుమటాయిడ్ అవేర్నెస్ డే నిర్వహిస్తారు.
అలానే మే నేలను ఆర్థరైటిస్ అవగాహన నెలగా జరుపుకుంటారు. దీనిని ఇంటర్నేషనల్
ఫౌండేషన్ ఫర్ ఆటో ఇమ్యూన్ మరియు ఆటోఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ స్పాన్సర్
చేస్తుంది. ఏటా 1.5 మిలియన్ల అమెరికన్లను ప్రభావితం చేసే ఈ ఆటో ఇమ్యూన్
మరియు ఆటోఇన్ఫ్లమేటరీ వ్యాధి కోసం ఈ రోజున అవగాహనా కల్పిస్తారు.
వరల్డ్ వెట్ ల్యాండ్స్ డే | ఫిబ్రవరి 02
చిత్తడి నేలల గురించి అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2న
ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది 2 ఫిబ్రవరి 1971న
ఇరాన్‌లోని రామ్సర్లో అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలలపై
కన్వెన్షన్ (రామ్సర్ కన్వెన్షన్) సంతకం చేసిన వార్షికోత్సవాన్ని
సూచిస్తుంది.
ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం అనేది పర్యావరణ సంబంధిత వేడుక. గత 2021
ఆగస్టు 30న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఆమోదించిన తర్వాత ప్రపంచ
చిత్తడి నేలల దినోత్సవాన్ని ఏటా ఫిబ్రవరి 2వ తేదీన జరుపుకోనున్నారు.
అంతర్జాతీయ మానవ సౌభ్రాతృత్వ దినోత్సవం | ఫిబ్రవరి 04
2020లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఏటా ఫిబ్రవరి 4 వ తేదీని
అంతర్జాతీయ మానవ సౌభ్రాతృత్వ దినోత్సవంగా ప్రకటించింది. విభిన్న
సంస్కృతులు, మతాలు, నమ్మకాలు మరియు విశ్వాసాల వైవిధ్యంపై ప్రజలకు అవగాహన
కల్పించేందుకు ఈ వేడుకను నిర్వహిస్తారు. విభిన్న విశ్వాసాల మధ్య పరస్పర
గౌరవంతో మానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేలా ఈ వేడుకను జరుపుకుంటారు.
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం | ఫిబ్రవరి 04
ఏటా ఫిబ్రవరి 4వ తేదీని ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ
వేడుకను యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ (UICC) నేతృత్వంలో ఏటా
ఫిబ్రవరి 4న పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఈ వేడుక ప్రపంచ క్యాన్సర్
మహమ్మారికి వ్యతిరేకంగా, క్యాన్సర్ రహిత ప్రపంచం కోసం క్యాన్సర్ పై అవగాహన
పెంపొందించడం కోసం నిర్వహిస్తారు.
ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా 10 మిలియన్ల మంది క్యాన్సర్‌తో
మరణిస్తున్నారు. ఈ అవగహన దినోత్సవాన్ని 04 ఫిబ్రవరి 2000 సంవత్సరంలో పారిస్
యందు జరిగిన వరల్డ్ క్యాన్సర్ కాన్ఫరెన్స్ లో ప్రారంబించారు.
సేఫర్ ఇంటర్నెట్ డే | ఫిబ్రవరి 08
ఆన్లైన్ సాంకేతికత యందు మరియు మొబైల్ ఫోన్ల యొక్క సురక్షితమైన, మరింత
బాధ్యతాయుతమైన వినియోగాన్ని ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 8వ
తేదీని సురక్షితమైన ఇంటర్నెట్ డే గా జరుపుకుంటారు. మెరుగైన ఇంటర్నెట్ కోసం
అనే నినాదంతో 2005 లో మొదటిసారిగా సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవాన్ని
జరుపుకున్నారు. ఇంటర్నెట్ను అందరికీ సురక్షితమైన మరియు మెరుగైన ప్రదేశంగా
మార్చడానికి అందులో భాగస్వామ్యం అవుతారు.
ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవం | ఫిబ్రవరి 10
2019లో ఐక్యరాజ్యసమితి ప్రారంభించిన ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవాన్ని
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 10న జరుపుకుంటారు. స్థిరమైన ఆహార ఉత్పత్తిలో
భాగంగా పప్పు దినుసుల పోషక మరియు పర్యావరణ ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన
కల్పించేందుకు ఈ వేడుకను నిర్వహిస్తారు.
దీని మొదట 10 ఫిబ్రవరి 2019 లో ఐక్యరాజ్యసమితి ప్రారంభించింది. కానీ
అంతకముందు నుండే 2009 నుండి యూఎస్ వంటి దేశాలలో ఈ వేడుక జరుపుకునే వారు. ఈ
దినోత్సవాన్ని ప్రారంభించక ముందే ఐక్యరాజ్యసమితి 2023 ను ఇంటర్నేషనల్ 'ఇయర్
ఆఫ్ పల్సస్'గా ప్రకటించింది.
నేషనల్ డీవార్మింగ్ డే | ఫిబ్రవరి 10
1 నుండి 19 ఏళ్ళ మధ్య పిల్లలకు, అత్యంత హాని కలిగించే నులిపురుగుల
నిర్మూలన యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడానికి ఏటా ఫిబ్రవరి 10 న జాతీయ
నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. నులిపురుగుల వలన పిల్లలు
రక్తహీనతతో పాటుగా ప్రేగు ఇన్ఫెక్షన్, పోషకాహార లోపం వంటి అనారోగ్యాలకు
గురవుతారు. భారత ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ అవగాహనా
కార్యక్రమాలను దేశ వ్యాప్తంగా నిర్వహిస్తుంది.
ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ & గర్ల్స్ ఇన్ సైన్స్ | ఫిబ్రవరి 11
సైన్స్ మరియు టెక్నాలజీలో మహిళలు మరియు బాలికల భాగస్వామ్యాన్ని మరింతగా
పెంపొందించేందుకు ఏటా ఫిబ్రవరి 11 తేదీని సైన్స్‌లో మహిళలు మరియు బాలికల
అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ కార్యక్రమం 22 డిసెంబర్ 2015న
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ చేసిన తీర్మానం ద్వారా ప్రారంభించబడింది.
భారత జాతీయ మహిళా దినోత్సవం | ఫిబ్రవరి 13
ది నైటింగేల్ ఆఫ్ ఇండియా (భారత్ కోకిల) సరోజినీ నాయుడు పుట్టినరోజు
ఫిబ్రవరి 13ను, భారతదేశం ఏటా జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటుంది.
సరోజినీ నాయుడు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నికైన
మొట్టమొదటి మహిళగా నిలిచారు.
అలానే ఆమె భారతదేశపు మొదటి మహిళా గవర్నర్‌గా కూడా పనిచేసారు. మహాత్మా
గాంధీ ప్రేరణతో భారత స్వాతంత్ర ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. ఒక
రచయిత్రిగా అనేక పుస్తకాలు వ్రాసి ప్రసిద్ధి చెందారు.
ప్రపంచ రేడియో దినోత్సవం | ఫిబ్రవరి 13
ప్రపంచ రేడియో దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13 న జరుపుకునే
అంతర్జాతీయ దినోత్సవం. యూనెస్కో తన 36వ సదస్సు సందర్భంగా 3 నవంబర్ 2011న ఈ
దినోత్సవాన్ని నిర్ణయించింది. 2012లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ద్వారా
ఇది అంతర్జాతీయ దినోత్సవంగా ఆమోదించబడింది. రేడియో యొక్క ప్రాముఖ్యత మరియు
ఔచిత్యానికి తెలియదజేసేందుకు ఈ వేడుక నిర్వహిస్తారు.
ఇంటర్నేషనల్ ఎపిలెప్సీ డే | ఫిబ్రవరి రెండవ సోమవారం
అంతర్జాతీయ మూర్ఛ దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి రెండవ సోమవారం
రోజున జరుపుకుంటారు. మూర్ఛ వ్యాధి గురించి అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో
దీనిని ఏటా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంను ఇంటర్నేషనల్ బ్యూరో ఫర్
ఎపిలెప్సీ (IBE) మరియు ఇంటర్నేషనల్ లీగ్ ఎగైనెస్ట్ ఎపిలెప్సీ (ILAE)
ఉమ్మడిగా రూపొందించాయి. ఇకపోతే జాతీయ మూర్ఛ దినోత్సవంను భారత ప్రభుత్వం ఏటా
నవంబర్ 17వ తేదీన దేశ వ్యాప్తంగా నిర్వహిస్తుంది.
మూర్ఛ అనేది కేంద్ర నాడీ వ్యవస్థ (న్యూరోలాజికల్) రుగ్మత. ఇది గాయం లేదా
స్ట్రోక్ వంటి మెదడు గాయం కారణంగా సంభవించవచ్చు. మూర్ఛ సమయంలో రోగిలో
అసాధారణ ప్రవర్తన లేదా వింతైన అనుభూతులను అనుభవిస్తాడు, కొన్నిసార్లు స్పృహ
కోల్పోవడం కూడా జరుగుతుంది.
ఇంటర్నేషనల్ చైల్డ్ హుడ్ క్యాన్సర్ డే | ఫిబ్రవరి 15
ప్రతి ఏడాది ఫిబ్రవరి 15వ తేదీని అంతర్జాతీయ బాల్య క్యాన్సర్
దినోత్సవంగా (ICCD) జరుపుకుంటారు. బాల్యదశలో వచ్చే వివిధ క్యాన్సర్లపైన
అవగాహన పెంచడానికి మరియు మద్దతు తెలియజేయడానికి ఈ కార్యక్రమంను
నిర్వహిస్తారు. అంతర్జాతీయ బాల్య క్యాన్సర్ దినోత్సవాన్ని (ఫిబ్రవరి 15)
పురస్కరించుకుని, ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (IARC)
ఏటా కొన్ని పరిశోధనలను హైలైట్ చేస్తోంది.