పరీక్షకు వెళ్లేటప్పుకు ఏయే డాక్యుమెంట్లు తీసుకెళ్లాలి?
పాస్‌పోర్టు, పాన్‌కార్డు, ఓటర్ ఐడీ కార్డు, అధార్ కార్డుతోపాటు ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
హాల్ టికెట్‌లో ఫొటో కనిపించకపోతే ఏం చేయాలి?
హాల్ టికెట్‌లో ఫొటో కనిపించకపోయినా, సరిగా ముద్రణ కాకపోయినా, గెజిటెడ్ ఆఫీసర్‌తో ధ్రువీకరణ తీసుకోవాలి. దీనితోపాటు మూడు పాస్‌పోర్టు సైజు ఫొటోలపై సంతకం చేయించుకుని పరీక్ష కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్‌ను సంప్రదించాలి.
మెహందీ, టాటూలతో పరీక్షకు వెళ్లొచ్చా?
మెహందీ, టాటూలతో పరీక్షకు వెళ్లొద్దు. చేతులపై అవి ఉంటే బయోమెట్రిక్ సమయంలో ఇబ్బంది కావొచ్చు. థంబ్ తీసుకునేటప్పుడు ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నది.
బూట్లు వేసుకొని వెళ్లొచ్చా?
పరీక్షకు బూట్లు అనుమతించరు. సాక్సులు కూడా వేసుకోకూడదు. చెప్పులు మాత్రమే వేసుకుని వెళ్లాలి.
హాల్ టికెట్ బ్లాక్ అండ్ వైట్/ కలర్స్ జిరాక్సు ఏది తీసుకెళ్లాలి?
అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. అదికూడా ఏ4 సైజులో ఉండాలి. అవకాశం ఉంటే కలర్ జిరాక్సు తీసుకెళితే మంచిది.
ఎన్ని గంటల తర్వాత అనుమతించరు?
ఉదయం 9:30 గంటల వరకు మాత్రమే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. ఆ తర్వాత ప్రధాన ద్వారం మూసేస్తారు. 9:30 am తర్వాత వచ్చిన అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
మధ్యాహ్నం పరీక్షకు 2:30 pm గంటల వరకు మాత్రమే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. ఆ తర్వాత
ప్రధాన ద్వారం మూసేస్తారు. 2:30 pm తర్వాత వచ్చిన అభ్యర్థులను పరీక్ష
కేంద్రంలోకి అనుమతించరు.
నాకు 2 చేతులు లేవు.. ఎలా రాయాలి ?
సహాయకుడు కావాలని ముందుగా దరఖాస్తు చేసిన వారికి మాత్రమే స్ర్కైబ్‌ను కేటాయిస్తారు. పరీక్ష నిర్వహణ అధికారులే స్ర్కైబ్‌ను ఇస్తారు. అనుమతి లేకుండా అభ్యర్థులు ఎవరినైనా తీసుకొస్తే అనుమతించరు.
బంగారు అభరణాలు పెట్టుకుని వెళ్లొచ్చా?
బంగారు అభరణాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. మంగళసూత్రం వరకూ మాత్రం అనుమతి ఉంటుంది. మిగిలిన అలంకరణ వస్తువులు, చేతి రింగులు, బ్రేస్‌లెట్లు వంటి వాటికి అనుమతి లేదు. అలాంటివి పెట్టుకొని వెళితే పరీక్ష కేంద్రం వద్ద ఇబ్బందులు తప్పవు.
బయోమెట్రిక్ సరిపోకపోతే ఏం చేయాలి?
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1లో తొలిసారిగా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నది. ప్రిలిమినరీ పరీక్ష సమయంలో బయోమెట్రిక్ తీసుకుంటారు. మెయిన్స్ పరీక్షకు వచ్చినప్పుడు థంబ్ పెట్టగానే అభ్యర్థి పూర్తి వివరాలు వస్తాయి. ఈ రెండు సందర్భాల్లో థంబ్ సరిపోకపోతే మెయిన్స్ పరీక్షకు అభ్యర్థిని అనుమతించరు.
జంబ్లింగ్ విధానం అంటే ఏమిటి?
టీఎస్‌పీఎస్సీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు చేసిన కొత్త సవరణల్లో జంబ్లింగ్ విధానం కూడా ఒకటి. ఇప్పటి వరకూ ఏ, బీ, సీ, డీ సిరీస్‌ల పేరుతో నాలుగు ప్రశ్నపత్రాలు అభ్యర్థులకు వరుస క్రమంలో ఇచ్చేవారు. కానీ ఇకపై ఎక్కువ సిరీస్‌లలో వచ్చేలా ప్రశ్నపత్రాలను సిద్ధం చేశారు. ఆ ప్రశ్నలను కంప్యూటర్‌లో జంబ్లింగ్ చేశారు. పక్కపక్కనే ఉన్న ఇద్దరికి ఒకటో నంబర్‌లో వేర్వేరు క్వశ్చన్స్ ఉంటాయి. ఒకే ప్రశ్నలో ఇద్దరికీ 4 చాయిస్‌లు వేర్వేరుగా ఇస్తారు. ఫలితంగా మాస్ కాపీయింగ్‌కు అవకాశమే లేదు.
సదరం సర్టిఫికెట్ అవసరమా?
గ్రూప్-II కు పీహెచ్ కోటా కింద దరఖాస్తు చేసిన ప్రతిఒక్కరూ తెలంగాణ ప్రభుత్వం అందించిన సదరం సర్టిఫికెట్ తీసుకొని రావాలి. అప్పుడు మాత్రమే వాళ్లను ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ కోటా కింద పరిగణిస్తారు.
వినికిడి యంత్రాలు తీసుకెళ్లవచ్చా?
వినికిడి యంత్రాలు తీసుకుళ్లే వాళ్లు తప్పనిసరిగా అందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రం వెంట తీసుకెళ్లాలి. అప్పుడు మాత్రమే వినికిడి యంత్రాలను అనుమతిస్తారు.
కళ్లజోళ్లు అనుమతిస్తారా?
కంటి చూపు సమస్య ఉంటే కళ్లజోళ్లు అనుమతిస్తారు. కానీ కూలింగ్ గ్లాసులను మాత్రం అనుమతించరు.
వాటర్‌బాటిల్ తీసుకెళ్లవచ్చా ?
ప్రభుత్వం పరీక్ష కేంద్రాల్లో తాగునీటి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కాబట్టి.. పరీక్ష కేంద్రాల్లోకి వాటర్ బాటిళ్లు అనుమతించరు.
ఎగ్జామ్ హాల్‌లోకి చేతిగడియారం, కాలిక్యులేటర్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లవచ్చా?
పరీక్షకు చేతి గడియారాలు పెట్టుకుని వెళ్లకూడదు. కాలిక్యులేటర్, మ్యాథమెటికల్ టేబుల్స్, లాగ్ బుక్స్, సెల్‌ఫోన్లు, పెన్‌డ్రైవ్‌లు, బ్లూటూత్ డివైజెస్, పర్సు, హ్యాండ్‌బాగ్స్, రైటింగ్‌పాడ్స్, చార్ట్స్, తెల్ల కాగితాలు వంటివి పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
క్రిమినల్ కేసులు ఉంటే పరీక్ష రాయొచ్చా?
క్రిమినల్ కేసులు ఉంటే పరీక్ష రాయకపోవడమే ఉత్తమం. చివరి దశలో వెరిఫికేషన్ సమయంలో తెలిసిపోతుంది. అప్పుడు ఆ అభ్యర్థిని డిస్‌క్వాలిఫై కింద ప్రకటిస్తారు.
150 ప్రశ్నలు లేకపోతే ఏం చేయాలి?
పరీక్ష పత్రం ఇచ్చిన వెంటనే అందులో 150 ప్రశ్నలు ఉన్నాయో? లేదో? సరిచూసుకోవాలి. లేనిచో వెంటనే ఇన్విజిలేటర్‌తో మాట్లాడి మరో ప్రశ్నపత్రం తీసుకోవాలి. తక్కువ ప్రశ్నలు వచ్చినా అలాగే పరీక్ష రాస్తే అభ్యర్థి నష్టపోయే ప్రమాదమున్నది.
ఏ పెన్ను ఉపయోగించాలి? పెన్సిల్ ఉపయోగించవచ్చా?
పరీక్షలో పెన్సిల్ ఉపయోగించరాదు. ఎటువంటి స్కెచ్ పెన్లు, కలర్ పెన్సిళ్లకు అనుమతి లేదు. బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్నుతో మాత్రమే బబ్లింగ్ చేయాలి.
సగం పరీక్ష రాసిన తర్వాత పెన్ రాయకపోతే ఏం చేయాలి?
పరీక్ష హాల్‌లోకి వెళ్లిన తర్వాత పక్క వాళ్లతో మాట్లాడటం కుదరదు. అందుకే.. ప్రతిఒక్కరూ పరీక్షకు వెళ్లేటప్పుడే అడిషనల్ పెన్నులు వెంట తీసుకెళ్లాలి.
పరీక్ష కేంద్రాల్లో గోడ గడియారాలు ఉంటాయా?
గ్రూప్-II పరీక్ష కేంద్రాల్లో గోడ గడియారాలు నిషేధం. అందుకే.. ఎక్కడా గోడ గడియారాలు ఉండవు.
పరీక్ష రాసేటప్పుడు సమయం ఎలా తెలుస్తుంది?
ప్రతి అరగంటకు ఓ సారి అలర్ట్ చేసేలా గంట మోగిస్తారు. మొదటి అరగంటకు ఒకసారి, గంట తర్వాత రెండుసార్లు, గంటన్నరకు మూడుసార్లు, రెండు గంటలకు నాలుగుసార్లు, రెండున్నర గంటల తర్వాత ఐదుసార్లు.. ఇలా గంట మోగించడం ద్వారా అభ్యర్థులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుంటారు. పరీక్ష ప్రారంభంలో, ముగింపులో లాంగ్ బెల్ మోగిస్తారు.
వైట్‌నర్, ఎరైసర్ తీసుకెళ్లొచ్చా?
వైట్‌నర్, ఎరైజర్, చాక్ పౌడర్, బ్లేడ్.. ఇలాంటివి పరీక్షలో ఉపయోగించరాదు. ఒకవేళ ఎవరైనా ఓఎంఆర్ షీట్‌పై వీటిని ఉపయోగిస్తే ఆ పేపర్ మూల్యాంకనం చేయరు.
కర్చీఫ్‌లు, టవల్స్ తెచ్చుకోవచ్చా?
కర్చీఫ్‌లు తెచ్చుకోవచ్చు. టవల్స్ మాత్రం పరిస్థితిని బట్టి అనుమతిస్తారు.
బీపీ, షుగర్‌తో బాధపడుతున్నవారు మందులు తెచ్చుకోవచ్చా..?
బీపీ, షుగర్ ఉన్నవారు.. మందులు వెంట తెచ్చుకోవచ్చు. ఇన్సులిన్ వాడేవాళ్లు తెచ్చుకోవచ్చు. అయితే పరీక్షాకేంద్రాల్లో ఓఆర్‌ఎస్ ద్రావణం, మందులు వంటివి అందుబాటులో ఉంటాయి.
అస్సలు నడవలేను. ఊతకర్రలు.. వీల్‌చైర్‌తో పరీక్షకు రావొచ్చా ?
పరీక్ష కేంద్రంలో, కేటాయించిన సీటులో మాత్రమే పరీక్ష రాయాలి. హాల్లోకి ప్రవేశించేందుకు సహచర విద్యార్థుల సహకారం తీసుకోవచ్చు. వీల్‌చైర్లు అధికారులే సమకూరుస్తారు.
కార్, బైక్ కీలు అనుమతిస్తారా ?
తాళపు చెవి వరకు మాత్రమే అనుమతిస్తారు. కీ చైన్లు, ఇన్‌హేలర్లు ఉన్న కీలు, ఇతరత్రా డిజైన్లు గల కీలను, వస్తుసామగ్రిని అనుమతించరు. కార్లకు ఎలక్ట్రానిక్ కీలుంటాయి. వాటిని పరీక్షకేంద్రంలోని కౌంటర్‌లో జమచేయాలి.
పరీక్ష ముందే అయిపోతే బయటికి పంపుతారా?
ఒక సారి పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించిన తర్వాత బయటికెళ్లడం కుదరదు. పరీక్ష పూర్తయినా.. మూడు గంటల పాటు పరీక్షకేంద్రం బయటికి పంపించరు. ఎవరైనా మాస్ కాపీయింగ్ చేస్తూ దొరికినా సరే మూడు గంటలపాటు పోలీసుల సమక్షంలోనే ఉంచుతారు.
ప్రశ్నపత్రాలు ఎన్ని భాషల్లో ఉంటాయి?
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు మూడు భాషల్లో ప్రశ్నపత్రాలు ఇస్తారు. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియంలో ప్రశ్నలు ఇస్తారు. ఓఎంఆర్‌లో సమాధానాలు బబ్లింగ్ చేస్తే సరిపోతుంది.
బబ్లింగ్‌లో ఏమైనా మిస్ అయితే వాలిడేట్ చేస్తారా?
బబ్లింగ్ చేసేటప్పుడు ప్రతిఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎవరైనా మీకు కేటాయించిన నంబర్‌ను ఓఎంఆర్ షీటులో సరిగా బబ్లింగ్ చేయకపోయినా, లేదా అభ్యర్థి, ఇన్విజిలేటర్ సంతకాలు లేకపోయినా అతని పేపర్‌ను మూల్యాంకనం చేయరు. ఈ విషయంలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలు కూడా ఉన్నాయి. కాబట్టి.. అభ్యర్థులు ఎవరూ కోర్టును సైతం ఆశ్రయించలేరు. అందుకే బబ్లింగ్ చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి. వివరాలన్నీ నమోదు చేసి, గళ్లలో ఫిల్ చేయకున్నా ఆ పేపర్‌ను వాల్యూయేషన్ చేయరు.
నాకు చలిగా ఉన్నది.. స్వెట్టర్ వేసుకోవచ్చా?
స్వెట్టర్, మఫ్లర్ వంటి వేసుకుని రాకూడదు. అయితే అవసరమా లేదా.. అని అధికారులు నిర్ధారిస్తారు. అవసరమైతే అనుమతిస్తారు.