Tuesday, September 24, 2024

UNO : న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి 79వ సర్వసభ్య సమావేశం

 

 


సెప్టెంబ‌ర్ 23వ తేదీ న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి 79వ సర్వసభ్య సమావేశంలో భాగంగా ‘ప్రపంచ భవితపై శిఖరాగ్ర సదస్సు’ జ‌రిగింది. 

ఈ స‌ద‌స్సులో మానవాళి విజయం సమష్టి శక్తిలోనే దాగుంది తప్ప యుద్ధక్షేత్రంలో కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. యుద్ధం ఎన్నటికీ సమస్యల పరిష్కార వేదిక కాబోదని కుండబద్దలు కొట్టారు. 

ఉక్రెయిన్, గాజా యుద్ధాలు, దేశాల నడుమ ఉద్రిక్తతలు, గ్లోబల్‌ వార్మింగ్, పర్యావరణ మార్పుల వంటి పెను సమస్యల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రపంచ శాంతికి, ప్రగతికి ఐరాసతో పాటు పలు అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అత్యవసరమని మోదీ అభిప్రాయపడ్డారు. ‘మెరుగైన ప్రపంచ భవిష్యత్తు కోసం చేపట్టే ఏ చర్యలకైనా మనిషి సంక్షేమమే అంతిమ లక్ష్యం కావాలి. అప్పుడే అవి ఫలిస్తాయి’ అని మోదీ సూచించారు. 

ఉగ్రవాదం పెనుముప్పు 
ఉగ్రవాదం ప్రపంచ శాంతికి, భద్రతకు పెను ముప్పుగా పరిణమించిందని మోదీ అన్నారు. మరోవైపు సైబర్, స్పేస్, మారిటైమ్‌ క్రైమ్‌ పెను సవాళ్లు విసురుతున్నాయని అభిప్రాయపడ్డారు. ‘మానవాళి సంక్షేమానికి ఆహార, ఆరోగ్య భద్రతకు దేశాలు ప్రాధాన్యమివ్వాలి. సంక్షేమ, సుస్థిరాభివృద్ధి పథకాల ద్వారా 25 కోట్ల మంది భారతీయులను పేదరికం నుంచి విముక్తం చేశాం. వాటిని మిగతా దేశాలతో పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నాం’ అన్నారు.

 ఐరాస భద్రతా మండలి.. కాలం చెల్లిన వ్యవస్థ..
ప్రారంభోపన్యాసం చేసిన ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్‌ అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలపై మోదీ అభిప్రాయాలతో ఏకీభవించారు. వాటిని బాధ్యతాయుతంగా, నిష్పాక్షికంగా, ప్రభావశీలంగా తీర్చిదిద్దాల్సిన అవసరముందన్నారు. ఐరాస భద్రతా మండలిని కాలం చెల్లిన వ్యవస్థగా అభివర్ణించారు. సరైన సంస్కరణలతో పనితీరును సరి చేసుకోకుంటే దాని విశ్వసనీయత అడుగంటడం ఖాయమని హెచ్చరించారు. ఘర్షణలకు ముగింపు కనుచూపు మేరలో కనిపించడం లేదంటూ ఆవేదన వెలిబుచ్చారు. ‘పట్టాలు తప్పుతున్న ప్రపంచాన్ని దారిన పెట్టేందుకు కఠిన నిర్ణయాలను, చర్యలను సూచించడమే లక్ష్యంగా సదస్సు జరిగింది’ అన్నారు. 

మెరుగైన ప్రపంచ భవిష్యత్తు కోసం చేపట్టాల్సిన చర్యలతో కూడిన ఒప్పందాన్ని సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది. సమగ్రాభివృద్ధి, అంతర్జాతీయ శాంతిభద్రతలు, శాస్త్ర సాంకేతికత, యువత, భావి తరాలు, అంతర్జాతీయంగా పాలన తీరుతెన్నుల్లో మెరుగైన మార్పులపై ఒప్పందం దృష్టి సారించింది.

పాలస్తీనా అధ్యక్షునితో భేటీ 
పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్‌ అబ్బాస్‌తో మోదీ భేటీ అయ్యారు. గాజాలో మానవతా సంక్షోభం పట్ల తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. పాలస్తీనా ప్రజలకు భారత్‌ అండగా నిలుస్తుందని పునరుద్ఘాటించారు. కువైట్‌ రాకుమారుడు షేక్‌ సబా ఖలీద్‌ అల్‌ సబా, నేపాల్‌ ప్రధాని కె.పి.శర్మ ఓలి తదితరులతో మోదీ సమావేశమయ్యారు.