Sunday, September 22, 2024

Megastar Chiranjeevi : మెగాస్టార్‌కి అరుదైన గౌర‌వం.. గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్ లో చిరంజీవి పేరు.

 


మెగాస్టార్ చిరంజీవి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. స్వ‌యం కృషితో ఉన్న‌త శిఖ‌రాల‌ను చేరి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. తాజాగా మెగాస్టార్‌కి మ‌రో గౌర‌వం ద‌క్కింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డుల్లో చిరంజీవి పేరు న‌మోదైంది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ హైద‌రాబాద్‌లోని ఓ హోట‌ల్‌లో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్‌ను చిరంజీవికి బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ సమక్షంలో గిన్నీస్ ప్రతినిధి రిచర్డ్ అంద‌జేశారు.

డాన్స్‌కి కేరాట్ అడ్ర‌స్‌గా నిలిచారు చిరంజీవి. ఆరు ప‌దుల వ‌య‌సులో కూడా అదే ఎనర్జీ, గ్రేస్‌తో డ్యాన్స్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో 156 మూవీల్లో 537 పాట‌ల్లో 24000 స్టెప్పులు వేసినందుకు గానూ మెగాస్టార్ గిన్నిస్ బుక్‌లోకి ఎక్కారు. చిరంజీవి పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్‌లో ఎక్క‌డంలో మెగా అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి.

ప‌ద్మ విభూషణ్‌..
ఇదిలా ఉంటే.. ఈ ఏడాదే దేశ రెండో అత్యున్న‌త పౌర పుర‌స్కారం ప‌ద్మ విభూష‌ణ్‌ను చిరంజీవి అందుకున్న సంగ‌తి తెలిసిందే. సినీ రంగంలో అత్యున్న‌త శిఖ‌రాల‌కు చేర‌డంతో పాటు అనేక సేవా కార్య‌క్ర‌మాల‌ను ఆయ‌న చేస్తున్నారు. వీటికి గుర్తింపుగా భార‌త ప్ర‌భుత్వం ప‌ద్మ విభూష‌ణ్ ఇచ్చింది.


 

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. చిరంజీవి ప్రస్తుతం డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ మూవీలో న‌టిస్తున్నారు. సోషియో ఫాంటసీగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.