Thursday, September 26, 2024

ఇజ్రాయెల్ రక్షణ కవచం! 10సెకన్లలో 20క్షిపణుల ప్రయోగం- 'ఐరన్ డోమ్' సక్సెస్‌ రేటు 90%!! - Israel Iron Dome Technology

 


 ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా పరస్పర దాడులతో మరోసారి వినిపిస్తున్న పేరు ఐరన్ డోమ్‌. ఇజ్రయెల్ రూపొందించిన ఈ రక్షణ వ్యవస్థ ఈ నెల 23న హెజ్‌బొల్లా ప్రయోగించిన వందలాది రాకెట్లను గాలిలోనే పేల్చివేసింది. రాత్రివేళ ఆకాశంలో బాణసంచాలా కనిపించినప్పటికీ అది ఇజ్రాయెల్ ప్రజలకు జీవన్మరణ సమస్య. దూసుకొస్తున్న రాకెట్లు, క్షిపణులను ఐరన్ డోమ్‌ అడ్డుకోకపోతే భారీగా మరణాలు సంభవిస్తాయి. 2005లో హెజ్‌బొల్లా దాడులతో అప్రమత్తమైన ఇజ్రాయెల్‌ కసితో ఈ వ్యవస్థను రూపొందించింది. అదే మరోసారి ఆ దేశానికి రక్షణ కవచంగా మారింది.

 ఇజ్రాయెల్‌ పేరు చెబితే తొలుత గుర్తుకొచ్చేది దుర్భేద్యమైన ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ. ప్రత్యర్థులు వందలాది రాకెట్లు ప్రయోగిస్తున్నా ఉక్కు కవచంలా ఆ దాడులను అది అడ్డుకొంటోంది. ఇజ్రాయెల్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ మూడు దశల్లో పనిచేస్తుంది. అవుటర్‌ లేయర్‌లో యారో-2, యారో-3 క్షిపణి వ్యవస్థలు ఉంటాయి. ఇవి వేలాది కిలోమీటర్ల దూరం నుంచి దూసుకొచ్చే క్షిపణులను అడ్డుకుంటాయి. అంతేకాకుండా వాటి నుంచి వెలువడే శకలాల ముప్పును నివారిస్తాయి. మధ్యశ్రేణి రక్షణ వ్యవస్థగా డేవిడ్‌ స్లింగ్‌ పనిచేస్తుంది. ఇది 100 నుంచి 200 కిలోమీటర్ల స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లు, ఎయిర్‌క్రాఫ్ట్‌లను కూల్చివేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇజ్రాయెల్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలో ఐరన్ డోమ్ వ్యవస్థ చివరిది. ఇది ఇప్పటివరకు హెజ్‌బొల్లా, హమాస్ ప్రయోగించిన వేలాది రాకెట్లను, క్షిపణులను సమర్థంగా అడ్డుకుని రక్షణ కల్పించింది.

10 సెకన్లలో 20 క్షిపణుల ప్రయోగం
ఐరన్‌ డోమ్‌ను ఇజ్రాయెల్‌లో కిప్పాట్‌ బార్జెల్‌గా కూడా పిలుస్తారు. ఇది స్వల్పశ్రేణి ఆయుధాలను అడ్డుకొంటుంది. అన్ని వాతావరణ పరిస్థితులలో పని చేస్తుంది. ఇందులో మూడు భాగాలు ఉంటాయి. రాడార్‌ ట్రాకింగ్ స్టేషన్‌, కంట్రోల్‌ సెంటర్‌, మిసైల్‌ బ్యాటరీ సిస్టమ్‌. రాడార్‌ తొలుత దూసుకొస్తున్న ముప్పును పసిగడుతుంది. అది ఎక్కడ నేలను తాకుతుందో అంచనావేస్తుంది. అక్కడ ఎలాంటి నిర్మాణాలు లేకపోతే వదిలేస్తుంది. అదే జనావాసాలు ఉంటే రాకెట్‌ను ప్రయోగించి దానిని కూల్చేస్తుంది. ఈ వ్యవస్థ తయారీలో ఇజ్రాయెల్‌కు చెందిన ఎల్టా, ఎంప్రెస్ట్‌ సిస్టమ్‌ సంస్థలు పనిచేశాయి. చివరిదైన మిసైల్ బ్యాటరీ సిస్టమ్‌లో 3 యాంటీ మిసైల్ బ్యాటరీలుంటాయి. ప్రతి ఐరన్‌ డోమ్‌ బ్యాటరీలో నాలుగు లాంచర్లు ఉంటాయి. ఒక్కోటి 10 సెకన్లలో 20 క్షిపణులను ప్రయోగించగలవు. అత్యధిక ముప్పులను ఏకకాలంలో ఎదుర్కొనేలా దీనిని రూపొందించారు.

ఐరన్‌ డోమ్‌ సక్సెస్‌ రేటు 90శాతం
2006లో హెజ్‌బొల్లా-ఇజ్రాయెల్‌ మధ్య భీకర ఘర్షణ జరిగింది. ఆ సమయంలో వేల రాకెట్లను ఇ‌జ్రాయెల్‌పై హెజ్‌బొల్లా ప్రయోగించింది. దీంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది. ఈ ఘటనతో అప్రమత్తమైన ఇజ్రాయెల్ ఐరన్‌ డోమ్‌ను తయారీ చేసేందుకు సిద్ధమైంది. ఇందుకు అమెరికా సాయం అందించింది. 2008 నాటికి తమిర్‌ క్షిపణులను పరీక్షించింది. 2009లో ప్రాథమిక ప్రయోగాలు పూర్తి చేసింది. 2011లో ఐరన్ డోమ్‌ అందుబాటులోకి వచ్చింది. ఆ సమయంలో గాజా నుంచి హమాస్ మిలిటెంట్లు ప్రయోగించిన మిసైల్‌ను ఐరన్ డోమ్‌ సమర్థంగా అడ్డుకుంది. ఐరన్‌ డోమ్‌ సక్సెస్‌ రేటు 90శాతంగా ఉంది.

50 వేల డాలర్ల వరకు ఖర్చు
గతేడాది అక్టోబర్‌లో హమాస్ ప్రయోగించిన వేలాది రాకెట్లను ఈ ఎయిర్‌ డిఫెన్స్ వ్యవస్థ కూల్చివేసింది. అయితే వాటిలో కొన్ని తప్పించుకుని జనావాసాలపై పడటంతో పలువురు ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దూసుకొస్తున్న ప్రమాదాన్ని అడ్డుకునేందుకు లక్ష్యంపై రెండు క్షిపణులను ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ ప్రయోగిస్తుంది. అందులో ఒక్కో క్షిపణికి 50 వేల డాలర్ల వరకు ఖర్చవుతుంది. ప్రస్తుతం ఇజ్రాయెల్‌ వద్ద 10 ఐరన్‌ డోమ్‌ బ్యాటరీలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిని వేగంగా ఒక చోటు నుంచి మరో చోటుకు మార్చుకునే వీలుంటుంది. 2020లో అమెరికాకు రెండు ఐరన్ డోమ్ బ్యాటరీలను ఇజ్రాయెల్ ఎగుమతి చేసింది.