జనవరి నెలలో జరుపుకునే వివిధ జాతీయ దినోత్సవాలు మరియు అంతర్జాతీయ దినోత్సవాల వివరాలు తెలుసుకోండి. ప్రముఖుల పుట్టిన రోజులు, మరణాల సమాచారం కూడా పొందండి. వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది.
గ్లోబల్ ఫ్యామిలీ డే | జనవరి 1
గ్లోబల్ ఫ్యామిలీ డే అనేది ఐక్యరాజ్యసమితి మిలీనియం వేడుక. ప్రజలలో శాంతి మరియు భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో భాగంగా నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు, ప్రతి సంవత్సరం మొదటి రోజున అన్ని కుటుంబాలు ఒకే సమాజంగా సమావేశమయ్యేలా చేయడం ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. గ్లోబల్ ఫ్యామిలీ' అనేది ప్రపంచంలోని వివిధ దేశాలను ఒకే సంఘంగా (వసుదైక కుటుంబం) చూసే గ్లోబల్ విలేజ్ భావనను సూచిస్తుంది.
లూయిస్ బ్రెయిలీ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జనవరి 4న ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ వేడుక ఇది అంధులను మరియు పాక్షిక దృష్టిగల వ్యక్తులను ఉత్సాహ పర్చేందుకు మరియు వారిలో ఆత్మవిశ్వసం నింపేందుకు నిర్వహిస్తారు. అలానే బ్రెయిలీ అక్షరాస్యత యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని జనవరి నెల అంతా జరుపుకుంటారు.
లూయిస్ బ్రెయిలీ ఫ్రెంచ్ విద్యావేత్తగా ప్రసిద్ధి. వ్యక్తిగతంగా అంధుడైన బ్రెయిలీ, తనలా దృష్టి లోపం ఉన్న వ్యక్తులు కోసం ప్రత్యేకంగా చదివే, వ్రాసే లిపిని సృష్టించాడు. ఈ లిపి ఆయన పేరుతో బ్రెయిలీ లిపిగా ప్రసిద్ధి చెందింది.
యుద్ధాల కారణంగా అనాథలుగా మారిన చిన్నారులకు ఆసరా కల్పించేందుకు ప్రతి సంవత్సరం జనవరి 6 న ప్రపంచ యుద్ధ అనాథల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచ యుద్ధ అనాథల దినోత్సవాన్ని ఫ్రెంచ్ సంస్థ SOS ఎన్‌ఫాంట్స్ ఎన్ డిట్రెస్సెస్ ప్రారంభించింది. ఇది సంఘర్షణతో బాధపడుతున్న పిల్లలకు సహాయం చేయడానికి ఉద్దేశించబడింది.
భారతదేశ అభివృద్ధికి విదేశీ భారతీయ సమాజం యొక్క సహకారానికి గుర్తుగా ఏటా జనవరి 9వ తేదీని ప్రవాసీ భారతీయ దివస్ గా జరుపుకుంటారు. మహాత్మా గాంధీ 9 జనవరి 1915న దక్షిణాఫ్రికా నుండి ముంబైకి తిరిగి వచ్చిన జ్ఞాపకార్థంగా ఆ తేదిన ఈ వేడుక నిర్వహిస్తారు.
ఈ వేడుక రోజున వివిధ రంగాలలో భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు సాధించిన విజయాలను స్మరించుకుంటారు. అదే సమయంలో వారి జ్ఞానాన్ని మరియు నైపుణ్యాన్ని వారి మాతృభూమికి తీసుకురావడానికి మరియు దాని అభివృద్ధికి దోహదపడేలా సహకరించడానికి వారిని ఒప్పిస్తారు.
ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ భాషగా హిందీ గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం జనవరి 10ని ప్రపంచ హిందీ దినోత్సవంగా (విశ్వ హిందీ దివస్) జరుపుకుంటారు. హిందీ భారత జాతీయ బాషా. ఇది ఉత్తర భారతదేశంలో ప్రధానంగా మాట్లాడే ఇండో-ఆర్యన్ భాష (దేవనాగరి లిపి). హిందీ అనేది హిందూస్థానీ భాష యొక్క ప్రామాణిక మరియు సంస్కృతీకరించబడిన రిజిస్టర్‌గా గుర్తించబడింది.
"ది మ్యాన్ ఆఫ్ పీస్" గా పిలుచుకునే భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి, 11 జనవరి1966 లో ప్రస్తుత ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్‌లో మరణించారు. ఆయన జ్ఞాపకార్థం ఏటా జనవరి 11 ను లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతిగా స్మరించుకుంటారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ముఖ్యమైన పోరాట యోధుడుగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి 1964 లో రిపబ్లిక్ భారతదేశానికి రెండవ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఆయన రూపొందించిన ‘జై జవాన్ జై కిసాన్’ అనే నినాదం భారతీయాల్లో ఈనాటికి గుర్తుండిపోయింది.
జాతీయ యువజన దినోత్సవాన్ని వివేకానంద జయంతి అని కూడా పిలుస్తారు. ఇది స్వామి వివేకానంద జన్మదినమైన జనవరి 12 న జరుపుకుంటారు. 1984లో భారత ప్రభుత్వం ఈ రోజును జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించింది, 1985 నుండి ప్రతి సంవత్సరం భారతదేశంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటారు.
2017 నుండి ప్రతి సంవత్సరం జనవరి 14న ఆర్మడ్ ఫోర్సెస్ వెటరన్స్ డేని జరుపుకుంటున్నారు. భారత సైన్యం యొక్క మొదటి కమాండర్-ఇన్-చీఫ్ ఒబీఈ, ఫీల్డ్ మార్షల్ కేఎం కరియప్ప అందించిన సేవలకు గౌరవసూచకంగా మరియు గుర్తింపుగా ప్రతి సంవత్సరం జనవరి 14న 'సాయుధ దళాల వెటరన్స్ డే' స్మారకంగా జరుపుకుంటారు. దేశం కోసం అనుభవజ్ఞుల నిస్వార్థ భక్తి మరియు త్యాగాన్ని గుర్తించి గౌరవించడం లక్ష్యంగా ఈ వేడుకను నిర్వహిస్తున్నారు.
1949లో చివరి బ్రిటీష్ కమాండర్-ఇన్-చీఫ్ జనరల్ సర్ ఎఫ్‌ఆర్‌ఆర్ బుచెర్ నుండి జనరల్ కెఎమ్ కరియప్ప భారత సైన్యానికి నాయకత్వం వహించిన సందర్భాన్ని గుర్తుచేసుకోవడానికి ప్రతి సంవత్సరం, జనవరి 15 ని "ఆర్మీ డే"గా జరుపుకుంటారు. ఎమ్ కరియప్ప స్వతంత్ర భారతదేశానికి మొదటి భారతీయ కమాండర్-ఇన్-చీఫ్ అయ్యాడు.