Sunday, September 29, 2024

ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్

 

ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్

ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ (IYM) 2023 జనవరి 1న ప్రారంభమైంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదనతో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 2021లో దీని ఆమోదించింది. మోదీ నేతృత్వంలో అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం 2023 ప్రతిపాదనను భారత ప్రభుత్వం స్పాన్సర్ చేస్తుంది.

ఇందులో భాగంగా ఈ ఏడాది పొడుగునా కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు మరియు భారత రాయబార కార్యాలయాలలో మిల్లెట్ల కోసం ప్రమోషన్ మరియు వాటి ప్రయోజనాల గురించి వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భారతదేశాన్ని 'గ్లోబల్ హబ్ ఫర్ మిల్లెట్స్'గా ప్రమోట్ చేసేందుకు ఈ కార్యక్రమాన్ని ఒక 'ప్రజా ఉద్యమం'గా మార్చాలనే ఆలోచనలో మోదీ ఉన్నారు.

సింధు లోయ నాగరికత కాలం నుండే 'మిల్లెట్లు' భారతదేశ ప్రధాన ఆహార పంటలుగా ఉన్నాయి. ప్రస్తుతం 130 కంటే ఎక్కువ దేశాలలో వీటిని పండిస్తున్నారు. మిల్లెట్‌లు ఆసియా మరియు ఆఫ్రికా దేశాల అంతటా సాంప్రదాయ ఆహారంగా దినుసులుగా పరిగణించబడుతున్నాయి. చిరుధాన్యాలు లేదా తృణధాన్యాలుగా పిలుచుకునే మిల్లెట్లను జంతువుల మేత మరియు మానవ ఆహారం కోసం సాగు చేస్తున్నారు.

మిల్లెట్‌లలో జొన్నలు, రాగి (ఫింగర్ మిల్లెట్), కొర్ర (ఫాక్స్‌టైల్ మిల్లెట్), ఆర్కే (కోడో మిల్లెట్), సామ (చిన్న మిల్లెట్), బజ్రా (పెర్ల్ మిల్లెట్), చేనా/బార్ (ప్రోసో మిల్లెట్) మరియు సాన్వా వంటివి ఉన్నాయి.

 కలసా-బండూరి ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం

కర్నాటక యొక్క కలసా - బండూరి ప్రాజెక్ట్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఉత్తర కర్ణాటకలోని బెలగావి, బాగల్‌కోట్, ధార్వాడ్ మరియు గడగ్ జిల్లాల పరిధిలో దాదాపు 14 కరువు పీడిత నగరాలకు తాగునీటిని అందించడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్ష్యం. దీనికి సంబంధించి మహాదాయి నది నుండి నీటిని మళ్లించడం కోసం ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు.

నిజానికి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి గోవా మరియు మహారాష్ట్ర ప్రభుత్వాల నుండి అభ్యంతరాలు ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాలలో దాదాపు కేంద్ర అధికార పార్టీయే ప్రభుత్వంలో ఉండటంతో ఈ ప్రాజెక్టు డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డిపిఆర్) కి ఆమోదం లభించింది. ఉత్తర కర్ణాటకలోని పై నాలుగు జిల్లాలు రాజస్థాన్ తర్వాత దేశంలో అత్యంత పొడి ప్రాంతాలుగా ఉన్నాయి.

 

విదేశాల వైద్య సహాయం కోసం ఆరోగ్య మైత్రి ప్రాజెక్టు

ప్రధాని నరేంద్ర మోదీ కొత్తగా ఆరోగ్య మైత్రి ప్రాజెక్టును ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రకృతి వైపరీత్యాలు లేదా మానవతా సంక్షోభం వల్ల ప్రభావితమయ్యే అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారతదేశం నుండి అవసరమైన వైద్య సామాగ్రిని అందిస్తారు.

వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ వర్చువల్ సమ్మిట్ ముగింపు సెషన్‌లో  ప్రసంగించిన మోదీ, భారతదేశం తన నైపుణ్యాన్ని ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పంచుకోవడానికి 'సైన్స్ అండ్ టెక్నాలజీ చొరవ'ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.

అలానే భారతదేశంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విదేశీ విద్యార్థుల కోసం 'గ్లోబల్-సౌత్ స్కాలర్‌షిప్‌లను' కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విదేశాంగ మంత్రిత్వ శాఖల పరిధిలోని యువ అధికారులను అనుసంధానం చేయడానికి 'గ్లోబల్-సౌత్ యంగ్ డిప్లొమాట్స్ ఫోరమ్'ని ప్రతిపాదిస్తున్నాట్లు వెల్లడించారు.