టిక్‌టాక్ ప్రస్తుతం ఈ పేరు తెలియని వారు ఉండరు, ఇందులో వచ్చే షార్ట్
వీడియోలు చూడని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో. ప్రపంచ వ్యాప్తంగా
టిక్‌టాక్ మంచి గుర్తింపును తెచ్చుకుంది. టిక్‌టాక్ కారణంగా ఎంతో మంది
సెలబ్రెటీలుగా మారిపోతున్నారు. వారిలో ఉన్న నటనకు, సృజనాత్మకతకు పదును
పెడుతూ విభిన్నమైన వీడియోలు చేస్తూ దూసుకుపోతున్నారు. చిన్న వారి నుంచి
పెద్దవారి వరకు అందరూ టిక్‌టాక్‌ను వదలడం లేదు. అయితే టిక్‌టాక్‌కి పోటీగా
ఇన్‌స్టాగ్రామ్ బుమ్‌రాంగ్ వీడియోస్, రీల్స్ లాంటివి తీసుకొచ్చిన
టిక్‌టాక్ ప్రభంజనాన్ని తగ్గించలేకపోయింది.
ఇదిలా ఉండగా ఇప్పుడు టిక్‌టాక్‌కి పోటీగా అలాంటిదే
మరొకటి రాబోతుంది. యూట్యూబ్ ‘షార్ట్స్’ పేరుతో షార్ట్‌వీడియోస్ పోస్ట్
చేసే ఒక ఫీచర్‌ని తీసుకురాబోతుంది. అయితే దీని కోసం ప్రత్యేకమైన యాప్‌ని
కాకుండా యూట్యూబ్‌లోనే యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకురానుంది. దీని కోసం
ఇప్పటికే యూట్యూబ్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. సిలికాన్ వ్యాలి టెక్
కంపెనీలు టిక్‌టాక్ దూకుడుకి అడ్డుకట్టవేయడానికి అన్ని ప్రయత్నాలు
చేస్తున్నాయి. ఈ విషయంలో లైసెన్డ్స్ మ్యూజిక్ కలిగి ఉండటమనేది
యూట్యూబ్‌కి ఎక్కువ ప్రయోజనంగా ఉంటుంది. కొద్దిగా ఆలస్యమైన ఈ విషయంలో
యూట్యూబ్ టిక్‌టాక్‌కి మంచి పోటీని ఇవ్వగలదని నిపుణులు
అభిప్రాయపడుతున్నారు.
యూట్యూబ్ విషయంలో ఆశ్చర్యపోయే మరో విషయం ఏంటంటే
యూట్యూబ్ గతంలో ఇతర ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుంచి కూడా
ఇలాంటివి తీసుకుంది. ఉదాహరణకు యూట్యూబ్ స్టోరీస్. ప్రారంభంలో యూట్యూబ్
స్టోరీస్ అనవసరం అని భావించినప్పటికీ, యూట్యూబ్ సృష్టికర్తలు దానిని
అప్‌డేట్స్, ప్రకటనల కోసం ఉపయోగించారు. యూట్యూబ్‌కి ఇప్పటికే ఉన్న
యూజర్లూ ‘షార్ట్స్’ను ఎక్కువగా ఆదరిస్తే.. ఇక టిక్‌టాక్, యూట్యూబ్
యుద్దం మొదలవుతుందని అందరి అంచనా.