Friday, March 9, 2018

మహిళా శాస్త్రవేత్తలు


మహిళా శాస్త్రవేత్తలు


🙎🏻‍♀బీబీసీ 100 మంది మహిళలు: సైన్స్‌లో చరిత్ర సృష్టించిన ఏడుగురు మహిళా శాస్త్రవేత్తలు

🙎🏻‍♀యునైటెడ్ కింగ్డమ్‌లో సగానికి పైగా ప్రజలు మహిళా శాస్త్రవేత్త పేరుని చెప్పలేకపోయారని ఒక సర్వే పేర్కొంది. బీబీసీ 100 మంది మహిళలు శీర్షిక ఈ సంఖ్యను మార్చాలని చూస్తోంది.

🙎🏻‍♀2014లో యూగో సంస్థ యూకే గ్రాస్రూట్స్ గ్రూప్ సైన్స్ జిఆర్ఎల్ఎల్ తరపున 3000 మందితో నిర్వహించిన ఒక సర్వేలో కేవలం 47 శాతం మంది మాత్రమే మహిళా శాస్త్రవేత్తల పేరు చెప్పగలిగారు.

🙎🏻‍♀చాలా మంది మేరీ క్యూరీ పేరుని గుర్తు చేసుకున్నారు. కొంత మంది పురుష శాస్త్రవేత్తల పేర్లు చెప్పారు.

🙎🏻‍♀నవంబర్ 7కి మేరీ క్యూరీ జన్మించి 150 సంవత్సరాలు. 100 సంవత్సరాలకు పైగా ఒక మహిళా శాస్త్రవేత్తగా ప్రజల మనసులలో మేరీ నిలిచింది. చరిత్ర సృష్టించిన మరి కొంత మంది మహిళా శాస్త్రవేత్తల వివరాలు బీబీసీ 100 మంది మహిళల శీర్షికతో అందిస్తోంది.

🙎🏻‍♀మేరీ క్యూరీ: రెండు నోబెల్ బహుమతులు అందుకున్న తొలి మహిళా శాస్త్రవేత్త
రేడియో ధార్మికతపై పరిశోధన చేసిన మేరి క్యూరీ రెండు నోబెల్ బహుమతులు కైవసం చేసుకున్న తొలి మహిళ.

🙎🏻‍♀1898 జూలైలో తన భర్త పియరీ క్యూరీతో కలిసి కెమికల్ పొలోనియంని కనిపెట్టి దానికి తన సొంత దేశం పేరు పెట్టారు.

అదే సంవత్సరం లో వీరు రేడియంని కనుగొన్నారు.

🙎🏻‍♀1903లో భౌతిక శాస్త్రంలో తన భర్త పియరీ క్యూరీ, హెన్రీ బెక్కెరేల్‌తో కలిసి నోబెల్ బహుమతి అందుకున్నారు. 8 సంవత్సరాల తర్వాత రసాయన శాస్త్రంలో నోబెల్ అందుకున్నారు.

🙎🏻‍♀క్యూరీ పోలాండ్‌లో 1867లో జన్మించారు. చిన్నప్పటి నుంచే ఆమె పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ చదువుకు కావాల్సిన డబ్బు సమకూర్చుకునేది. భౌతిక, గణిత శాస్త్రాలలో మాస్టర్స్ సంపాదించారు.

🙎🏻‍♀భర్త మరణం తర్వాత తొలి మహిళా ప్రొఫెసర్‌గా సోర్బోన్ విశ్వ విద్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు.

🙎🏻‍♀సుదీర్ఘకాలం పాటు రేడియో ధార్మిక కిరణాలపై పనిచేయటం వల్ల క్యూరీ లుకేమియాతో 1934 జూలై 4వ తేదీన మరణించారు

🙎🏻‍♀Image copyright NASA పెగ్గీ విట్సన్
పెగ్గీ విట్సన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో తొలి సైన్స్ ఆఫీసర్

🙎🏻‍♀పెగ్గీ హైస్కూల్‌లో ఉండగానే నాసా తన తొలి మహిళా వ్యోమగాములను ఎంపిక చేసింది. చంద్రునిపై కాలు పెట్టాలనే పెగ్గీ కల నిజమయ్యేందుకు ఇది తోడ్పడింది.

🙎🏻‍♀అమెరికాలోని అయోవా రాష్ట్రానికి చెందిన పెగ్గీ గ్రామీణ వ్యవసాయ కుటుంబంలో పెరిగింది. కానీ.. బయోలజీ, కెమిస్ట్రీ చదివి పీహెచ్‌డీ కూడా సంపాదించింది.

🙎🏻‍♀మహిళలు అతి తక్కువగా ఉండే అంతరిక్ష రంగంలోకి అడుగుపెట్టిన పెగ్గీ.. 1996లో అంతరిక్షయానానికి ఎంపికైంది. 2002లో తన తొలి అంతర్జాతీయ అంతరిక్ష ప్రయాణంలో.. మొదటి సైన్స్ ఆఫీసర్‌గా గుర్తింపు సంపాదించింది. ఈ గుర్తింపుని స్టార్ ట్రెక్‌కి చెందిన స్పోక్‌తో కలిసి పంచుకుంది.

🙎🏻‍♀మరెక్కడా దొరకని విభిన్నమైన పరిశోధనా వాతావరణం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో లభించడంతో.. పంటల ఉత్పత్తికి, కాన్సర్ నివారణకు, ఫ్లూయిడ్ డైనమిక్స్‌కి పెగ్గీ పరిశోధనలు చేసింది.

🙎🏻‍♀"అంతరిక్షంలో జరుగుతున్న పరిశోధనలు చాలా భిన్నంగా ఉంటాయి. మనుషులు సౌర వ్యవస్థను దాటి సుదూర ప్రాంతాలకు వెళ్లాలనుకున్నప్పుడు ఇవి చాలా ఉపయోగపడతాయి’’అని పెగ్గీ చెప్పారు.

🙎🏻‍♀మేరీ థార్ప్ : సముద్రపు ఉపరితలం మ్యాప్ ‌ లను రూపొందిస్తున్న మహిళ

🙎🏻‍♀1953లో అట్లాంటిక్ సముద్రపు ఉపరితలపు మ్యాప్ రూపొందించిన మేరీ థార్ప్ భూగర్భ శాస్త్రవేత్త, సముద్ర పటాల రూపకర్త. సముద్ర అంతర్భాగంలో దాగి ఉన్న రిఫ్ట్ లోయని కనుగొని వివాదాస్పదమైన ప్లేట్ టెక్టోనిక్స్ సిద్ధాంత నిరూపించంచటంలో ప్రముఖ పాత్ర పోషించారు. తొలుత అందరూ ఈమె పరిశోధనను ‘ఆడోళ్ల మాటలు’ అంటూ కొట్టిపారేశారు.

🙎🏻‍♀పరిశోధనా నౌకల్లోకి మహిళలను అనుమతించకపోవడం కారణంగా తన సహ పరిశోధన కారుడు బ్రూస్ హెజీన్ యాత్రల నుంచి తెచ్చిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని, మ్యాప్‌లను తయారు చేయడం మొదలు పెట్టారు.

🙎🏻‍♀మేరీ థార్ప్ కష్టపడినప్పటికీ ఆమె పేరు మాత్రం వెలుగులోకి రాలేదు. ఇద్దరూ కలిసి పనిచేసినప్పటికీ హెజీన్‌కే ఎక్కువ గుర్తింపు లభించింది. మిడ్ అట్లాంటిక్ రేంజ్‌ను గుర్తించడంలో తన పాత్ర పట్ల ఆమెకు సంతృప్తి ఉంది.

🙎🏻‍♀"ఇలాంటివి ఒక్కసారే చేయగలం. ఈ భూమిపై అంతకంటే పెద్ద పని మరేమీ కనిపించదు" అని ఆమె అన్నారు.

🙎🏻‍♀వాన్ద డియాజ్- మెర్సెడ్: ఖగోళ శాస్త్రంని అందుబాటులోకి తెచ్చిన మహిళ
ప్యుర్టొ రికోలో కాలేజీ విద్య అభ్యసిస్తున్న కాలంలో వాన్ద డియాజ్- మెర్సెడ్ తనని కబళిస్తున్న డియాబెటిక్ రెటినోపతిని గ్రహిచింది. కానీ లక్ష్యాన్ని చేధించడానికి తన దృష్టి ఆటంకం కాకూడదని తీర్మానించుకుంది.

🙎🏻‍♀వాన్ద నాసాలో ఇంటర్న్ష్‌షిప్ చేస్తున్నపుడు శబ్ద తరంగాల ద్వారా సమాచారాన్ని (డేటా సోనిఫికేషన్) అర్ధం చేసుకునే విభాగంలో పని చేసే అవకాశం లభించింది. శాటిలైట్‌ల నుంచి వచ్చే నక్షత్రాలకు సంబంధించిన సమాచారాన్ని శబ్ద తరంగాల ద్వారా అర్ధం చేసుకోవడం ప్రారంభించింది. ఈ పనికి ఖగోళ శాస్త్రజ్ఞులు సాధారణంగా గ్రాఫ్‌లను వాడుతుంటారు.

🙎🏻‍♀ఖగోళ శాస్త్రజ్ఞులు మరింత సమర్ధవంతంగా అంతరిక్షం నుంచి వచ్చే సమాచారాన్ని అర్ధం చేసుకునేందుకు వాన్ద ఒక ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసేందుకు కృషి చేశారు.

🙎🏻‍♀డియాజ్- మెర్సెడ్ ప్రస్తుతం సౌత్ ఆఫ్రికన్ ఆఫీస్ అఫ్ ఆస్ట్రానమీలో పని చేస్తూ, ఖగోళ శాస్త్రాన్ని మరింత మంది అంధులకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు.

🙎🏻‍♀"నేను ప్రేమించే ఈ ఖగోళ శాస్త్రంలో ఎటువంటి విభజనలు ఉండకూడదు. అందరికి సమాన అవకాశాలు ఉండాలని నేను భావిస్తా" అని ఆమె చెప్పారు.


🙎🏻‍♀ఖుర్రయిషా అబ్దుల్ కరీం: ఎయిడ్స్ నిర్మూలన కు కృషి

🙎🏻‍♀ఖుర్రయిషా అబ్దుల్ కరీం ఒక రోగ విజ్ఞాన పరిశోధకురాలు. ఈమె దక్షిణాఫ్రికాలో హెచ్ఐవి, ఎయిడ్స్ వ్యాప్తి, మహిళలపై దాని ప్రభావం గురించి 25 సంవత్సరాలు పరిశోధన చేశారు.

🙎🏻‍♀ఈ రంగంలో పరిశోధనలకు గాను 2013లో దక్షిణాఫ్రికా ప్రభుత్వం అత్యున్నత బిరుదు ఆర్డర్ అఫ్ మపుంగుబ్వేను అందుకున్నారు.

🙎🏻‍♀హెచ్ఐవి నిర్మూలనకు ఆమె అనేక వర్గాల మహిళలతో కలిసి పని చేశారు.

🙎🏻‍♀ప్రస్తుతం కాప్‌రిసాలో అసోసియేట్ సైంటిఫిక్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఈమె ఐక్య రాజ్య సమితికి చెందిన వివిధ సంస్థల్లో గతంలో హెచ్ఐవి సలహాదారుగా పని చేశారు

🙎🏻‍♀సోయేన్ యి: తొలి దక్షిణ కొరియా వ్యోమగామి
36000 మందితో పోటీ పడి దక్షిణ కొరియా తొలి వ్యోమగామిగా సోయేన్ యి 2008లో చరిత్ర సృష్టించారు.

🙎🏻‍♀"మహిళల చరిత్రలో ప్రధమ స్థానంలో నిలవడం అనుకున్నంత సులభం కాదు. ఈ విజయం మరింత మంది మహిళలు శాస్త్ర ప్రపంచంలోకి రావడానికి స్ఫూర్తిగా నిలుస్తుంది" అని ఆమె అన్నారు

🙎🏻‍♀అంతరిక్షం నుంచి ఒకసారి భూమిని చూసినపుడు, మన గ్రహం ఒక బహుమతిలా అనిపించిందని తెలిపారు.

🙎🏻‍♀రజా చెర్కొయ్ ఎల్ మౌర్స్లీ: హిగ్స్ బొసన్ ఆవిష్కరణలో కీలక పాత్ర
న్యూక్లియర్ ఫిజిసిస్ట్ రజాకి మేరీ క్యూరీ జీవిత చరిత్ర స్ఫూర్తి.

🙎🏻‍♀మేరీ క్యూరీ విజయాలతో ప్రేరేపితమైన రజా సైన్స్ చదవడానికి జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కోవలసి వచ్చింది.

🙎🏻‍♀"సైన్స్ చదవడానికి ఫ్రాన్స్ వెళ్లేందుకు మా నాన్నగారిని ఒప్పించడమే నా తొలి సవాలు" అని ఆమె చెప్పారు. "మొరాకో చాలా పురాతన సాంప్రదాయాలతో కూడుకున్న దేశం. సాధారణంగా అమ్మాయిలు వివాహం అయితే కానీ బయటకి వెళ్లేందుకు అనుమతి లభించదు" అని తెలిపారు.

🙎🏻‍♀విశ్వంలో ఘన పదార్ధం తయారయ్యేందుకు కారణమైన హిగ్స్ బొసన్ పదార్ధం ఉనికిని కనిపెట్టడంలో ఆమె పాత్రకు గాను అనేక అవార్డులు లభించాయి.

🙎🏻‍♀మొరాకోలో విశ్వవిద్యాలయ స్థాయిలో మెడికల్ ఫిజిక్స్ అంశాన్ని ప్రవేశపెట్టిన ఘనత ఈమెదే.