Friday, October 2, 2015

ముల్కీ ఉద్యమం - తెలంగాణ చరిత్ర

ముల్కీ ఉద్యమం - తెలంగాణ చరిత్ర

నిజాం రాష్ట్రంలోని తెలంగాణా ప్రాంత ప్రజలు జమిందారీ వ్యవస్థ కింద నలుగుతూ,సరైన అవకాశాలు పొందలేని పరిస్థితులలో వారికి అవకాశాలను కల్పించడానికని ముల్కి ఉద్యమం 1918 మొదలైంది. 1930 నుండి ఊపందుకొని, స్వతంత్ర భారతంలో కలసినతరువాత కూడా వినిపించింది
హైదరాబాద్ సంస్థానంలోనూ, సమగ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ “ముల్కీ” సమస్యపై చాలాసార్లు ఆందోళనలు, ఉద్యమాలు చెలరేగాయి. “ముల్కీ” అంటే స్థానికులు. హైదరాబాద్ రాష్ట్ర అధికార భాష ఉర్దూ కావడంతో అసఫ్‌జాహీ పాలన కాలంలో ఇతర ప్రాంతాల్లో నివసించే ముస్లింలు, ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా, ఇతర వృత్తులు నిర్వహించుకోవడానికి అనుకూలంగా భావించి ఈ ప్రాంతానికి వలస వచ్చేవారు. ఇంకొకవైపు సంస్థానంలో జాగీర్‌దారీ వ్యవస్థ అమలులో ఉండటంతో, విద్యావకాశాలు అధికంగా లేకపోవడంతో స్థానిక ఉద్యోగాల్లో వారికి అవసరమైన అర్హతలు లేకుండాపోయాయి. దీంతో స్థానికులకు ఉద్యోగావకాశాలు సన్నగిల్లుతూ వచ్చాయి. ఈ పరిస్థితులలో అసంతృప్తికి లోనైన స్థానికులు, బయటివారి నియామకాలకు వ్యతిరేకంగా ఆనాటి నిజాం నవాబుకు విన్నవించుకున్నారు. ఇదే ముల్కీ ఉద్యమానికి నాంది.
1918 గెజిట్ లో ప్రథమంగా ఉద్యోగాల నియామకం విషయంలో ముల్కీ ప్రస్తావన వచ్చింది. సంస్థానంలోని ఉద్యోగాలన్నీ అర్హులైన స్థానికులకే ఇవ్వాలని, విదేశీయులు – అంటే సంస్థానం బయటి నుండి వచ్చేవారు ఉద్యోగం పొందాలంటే ప్రధానమంత్రి ప్రత్యేక అనుమతి అవసరమని ప్రకటించింది. 1918లో నైజాం ప్రభుత్వం “ముల్కీ” ఫర్మానాను జారీ చేసింది. దాని ప్రకారం నిజాం ప్రభుత్వం ప్రత్యేక అనుమతి లేకుండా ముల్కీలు (స్థానికులు) కానివారిని ఏ ఉద్యోగంలో కూడా నియమించగూడదని ఆ ఫర్మానా అర్ధం. ముల్కీ అర్హతలను నాలుగు విధాలుగా రూపొందించారు.
ముల్కీ పురుషునికి కలిగిన సంతానం ముల్కీ అవుతారు.
ఇతర ప్రాంతాల నుండి వచ్చి కనీసం 15 సంవత్సరాలు సంస్థానంలో స్థిర నివాసం ఏర్పరుచుకొని, తిరిగి తమ ప్రాంతానికి పోనని ప్రమాణ పత్రం సమర్పించిన వారు.
హైదరాబాద్ సంస్థానంలో 15 సంవత్సరాలు ఉద్యోగ చేసినవారి సంతానం.
ముల్కీ పురుషుని భార్య.
1930 ప్రాంతంలో ముల్కీ ఉద్యమం బాగా వ్యాప్తిలోకి వచ్చింది. ముల్కీ నిబంధనలు అమలులో వున్నా ప్రభుత్వ ఉద్యోగాలలో చాలామంది నాన్‌ముల్కీలు (స్థానికేతరులు) ఉండేవారు. స్థానికులలో ఉన్న నిరుద్యోగ సమస్య కారణంగా అసంతృప్తి చోటు చేసుకుంది. అదేసమయంలో పరిపాలనా సంస్కరణల సూచన కొరకు నిజాం ప్రభుత్వం అరముర్ అయ్యంగార్‌తో ఒక కమీషన్‌ను నియమించింది. నాన్‌ముల్కీలను ప్రభుత్వం ఉద్యోగాలలో నియమించటం నిలిపివేయాలని స్థానికులు ఈ సంఘానికి విన్నవించుకొన్నారు. స్థానికుల విజ్ఞప్తులను దృష్టిలో వుంచుకొని, ఆ తరువాత రూపొందించిన సివిల్ సర్వీసెస్ రెగ్యులేషన్లలో నాన్‌ముల్కీలను నిజాం నవాబు ప్రత్యేక అనుమతి లేనిదే ప్రభుత్వ ఉద్యోగాలలో నియమించరాదని నిర్దేశించారు. నైజాం సంస్థానంలో ఉద్యోగస్తులలో ముస్లిములే ఎక్కువ. కాబట్టి ముల్కీ, నాన్ ముల్కీ విభేదాలు వారి మధ్యనే ఎక్కువగా ఉండేవి.
హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన తరువాత ముస్లిం ఉద్యోగస్తులు చాలామంది పాకిస్తాన్ కు వలసపోయారు. సెప్టెంబర్ 1948కి ఒకటి రెండు సంవత్సరాల ముందు సంస్థానంలో నియమితులైన సంస్థానేతర ఉద్యోగస్తులు చాలామంది వారి ఉద్యోగాలను కోల్పోయారు.
హైదరాబాద్ రాష్ట్రప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత, ఎన్నో సామాజిక సంక్షేమ కార్యక్రమాలు, విద్యా సౌకర్యాల కల్పన కార్యక్రమాలను చేపట్టింది. ఈ కార్యక్రమాల నిర్వహణకు సుశిక్షితులైన ఉద్యోగస్తుల కొరత ఏర్పడింది. ఇంతేకాకుండా 1949 జూన్ విద్యా సంవత్సరం నుండి రాష్ట్రంలోని సెకండరీ పాఠశాలలన్నింటిలోనూ ప్రాంతీయ భాషలోనే విద్యాబోధన జరగాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధానం అమలు చేయడానికి కూడా తెలుగులో బోధించే, శిక్షణ పొందిన ఉపాధ్యాయుల కొరత కూడా ఏర్పడింది. ఈ కొరతను భర్తీ చేయడానికి ఇతర ప్రాంతాల నుండి (నాన్ ముల్కీలను) ప్రత్యేకంగా తెలుగు మాట్లాడే ప్రాంతాల నుండి అర్హులైన వారిని ఉద్యోగాలలో నియమించారు.
ఈ విధంగా పాత వ్యవస్థలో ఉద్యోగావకాశాలు లేక, కొత్త వ్యవస్థలో ఉద్యోగావకాశాలు పెరుగుతాయని ఆశించిన స్థానిక విద్యావంతులు నిరాశకు లోనయ్యారు. పెద్ద సంఖ్యలో స్థానికేతరులకు ఉద్యోగాలు కట్టబెట్టడం వల్ల స్థానికులలో ఏర్పడ్డ అసంతృప్తి, నిరాశలను గమనించి 1950 సంవత్సరంలోనే హైదరాబద్ కాంగ్రెస్ కమిటీ హైదరాబాద్ రాష్ట్రం నుండి నాన్ ముల్కీలను వెనక్కి పంపివేయాలని ప్రభుత్వాన్ని కోరింది. 1952లో హైదరాబాద్‌లోనూ, తెలంగాణా ప్రాంతంలోనూ నాన్-ముల్కీల పట్ల పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. “నాన్-ముల్కీ గో బ్యాక్”, “ఇడ్లీ – సాంబార్ గో బ్యాక్” అన్న నినాదాలు గోడలపైకి ఎక్కాయి. అక్కడక్కడా నాన్-ముల్ల్కీ ఉద్యోగులపై, వ్యాపార సంస్థలపై దాడులు కూడా జరిగాయి. హైదరాబాద్‌లో ఆందోళనకారులపై కాల్పులు కూడా జరిగాయి. ఆరుగురు విద్యార్థులు ప్రాణాలర్పించారు. అదే ఆతరువత విశాలాంధ్ర వ్యతిరేక ఉద్యమంగా రూపు దిద్దుకొంది.
1952లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణా జిల్లాలలో, అటు మద్రాసు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే జిల్లాలలో కమ్యూనిష్టులు మంచి విజయాలు సాధించారు. విశాలాంధ్ర ఏర్పడితే అధికారాన్ని చేపట్టగల అవకాశాలు ఎక్కువగా ఉంటాయని భావించిన కమ్యూనిష్టులు విశాలాంధ్ర ఏర్పాటుకు ప్రచారం తీవ్రతరం చేశారు.
దేశంలోని మిగిలిన ప్రాంతాల కోరికలను పరిశీలించడానికి భారత ప్రభుత్వం 1953 ఫిబ్రవరిలో ఫజల్ ఆలీ ఆధ్వర్యంలో ఒక కమీషన్‌ను నియమించింది. ఈ కమీషన్‌లో హ్రిదయనాథ్ కుంజ్రూ, సర్దార్ కె.యం. ఫణిక్కర్‌లు ఇతర సభ్యులు. రాష్ట్రాల పునర్విభజన సంఘం (state reorganisation commission) నియమింపబడిన తరువాత విశాలాంధ్ర ఉద్యమం ఊపందుకొంది. తెలంగాణా కాంగ్రెస్ నాయకులలో మాత్రం రెండు వర్గాలు ఏర్పడి ఒక వర్గం ప్రత్యేక తెలంగాణాను కోరగా, ఇంకొక వర్గం విశాలాంధ్ర రాష్ట్రాన్ని సమర్థించింది.
బ్రిటిష్ ఇండియాలో జరిగిన 1946 ఎన్నికలకు ముందు విడుదల చేసిన ఎన్నికల ప్రణాలికలో కాంగ్రెస్ భాషా ప్రయుక్త రాష్ట్రాల నిర్మాణం జరగాలని అభిప్రాయ పడింది. స్వాతంత్ర్యం రాబోయే తరుణంలో ఆంధ్ర నాయకులు, నెహ్రూ, సర్దార్ పటేల్లను కలిసి కొత్త రాజ్యాంగం అమలులోకి రాకముందే ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని విన్నవించుకొన్నారు. వివిధ కారణాలవల్ల ఆంధ్ర నాయకుల కోరిక ఫలించలేదు. 1948 జూన్ 17న భారత రాజ్యాంగ సభ అధ్యక్షులు, భాషా రాష్ట్రాల కమిటీని నియమించారు. ఈ కమిటీకీ అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ధార్ అధ్యక్షుడిగా, డా|| పన్నాలాల్, జగత్ నారాయణ్ లాల్ సభ్యులుగా నియమితులైనారు.
ధార్ కమీషన్ మద్రాసు సందర్శించినప్పుడు నీలం సంజీవ రెడ్డి 20మంది శాసన సభ్యులతో సహా కమీషన్‌ను కలసి, భాషా రాష్ట్రాల ఏర్పాటు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే, ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే పక్షంలో రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేక రాజ్యాంగ రక్షణలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యాంనాయంగా, మద్రాసు రాజధానిగా ప్రత్యేక రాయలసీమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించారు.
ధార్ కమీషన్ 1948 చివరిలో తన నివేదికను సమర్పించింది. ప్రస్తుత పరిస్థితులలో భాషా రాష్ట్రాల ఏర్పాటు దేశ ప్రయోజనాలకు వ్యతిరేకమని భావించి, ఆ ప్రతిపాదనను వాయిదా వేయాలని సూచించింది.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.