Sunday, November 30, 2014

గురజాడ వేంకట అప్పారావు - Gurazada Apparao


గురజాడ వేంకట అప్పారావు -  Gurazada Apparao



అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని సామాజిక రుగ్మతల మీద దాడిచేసిన మహాకవి, రచయిత, నాటకకర్త గురజాడ వేంకట అప్పారావు. ఆయన రచనలు ఆదర్శం. ఆయన జీవితం ఆదర్శం. ఆయన చేతిలో అక్షరం వ్యంగ్య బాణమైతే, మరెవరూ అందుకు సాటి కాలేకపోయారు. అందుకే ఆయన అసంపూర్ణంగా వదిలి వెళ్ళిపోయిన కొండు భట్టీయము, బిల్హణీయం నాటకాల్ని ఎందరో పూర్తి చేయాలని ప్రయత్నించారు. కానీ సఫలులు కాలేకపోయారు. 'కన్యాశుల్కం' నాటకం నాటి తీవ్ర సమస్యలకి అద్దం పట్టింది. నాటి పాత్రల్ని సజీవంగా మనముందుంచింది. 'నేనూ వాళ్ళలో ఉన్నానా?' అని ఎవరికి వారు భుజాలు తడుముకునేట్టు చేసింది. ఆషాఢ భూతులన్ని చోట్లా ఉంటారు జాగ్రత్తని హెచ్చరించింది. వేశ్యలు ఆ కాలంలో ఎక్కువగా ఉండేవారు కాబట్టి వాళ్ళకి సరైన దారి చూపించింది. నాటకంలో ఒక నాయకుని, వితంతువైన ఒక నాయికనీ, ప్రవేశపెట్టి వాళ్ళిద్దరికీ పెళ్ళి చేయలేదు. గురజాడకి అరకొర పరిష్కారాన్ని చూపించడం ఇష్టం ఉండదు. సంస్కరణ జరిగితే అది పరిపూర్ణంగా ఉండాలని విశ్వసిస్తారు, అందుకే బుచ్చమ్మకి పునర్వివాహం చేసి సంస్కరించాలనుకున్నా నీతిలేని గిరీశం లాంటి వాళ్ళకిచ్చి చేయడం సంస్కారం కాదు, గొంతుకోయడమవుతుందన్నది ఆయన అభిప్రాయం. అందుకే నాటకంలో ఆయన ఇద్దరికీ పెళ్ళిచేయలేదు. పైగా కుసంస్కారిని నాటకం చివరలో బయటకు నెట్టేసాడు. కన్యాశుల్కం అసంపూర్ణమని చాలామంది అభిప్రాయం కానేకాదు? ఆ ప్రాంతం నుంచి తెలివిగా అతడిని బయటకు నెట్టేసారు. డామిట్‌ కథ అడ్డం తిరిగిందని బాధపడ్డాడు. కుక్క దాని గుంటలాగా యాంటినాచ్‌ నంటూ మరికొందరు విధవలకు వలలు వేయడానికి వేరే ప్రదేశాలకి వెళ్తాడు. తస్మాత్‌ జాగ్రత్తని, హెచ్చరిక చిన్నపిల్లల్ని కొనుక్కుని తీసుకువెళ్ళి పెళ్ళి చేసుకోవాలనుకునే ముసలివాళ్ళకు హెచ్చరిక. ఇలాంటి పెళ్ళిళ్ళవల్లనే ప్రతి ఇంట్లోనూ విధవలెక్కువై, వివాహేతర సంబంధాలూ పెచ్చుపెరుగుతాయని ఘాటుగా చెప్పారు. చిన్న పిల్లల్ని వివాహం పేరుతో ఎలా గొంతుకోస్తున్నారో కన్నీళ్ళుబుకి వచ్చేట్టు చెప్పారు. పూర్ణమ్మ కథని, యువతులపై అధికార మదంతో కొందరు ఎలా నలిపివేయాలని చూస్తారో కన్యకలో చెప్పారు. ఆయన కథానికలలో కూడా చదువుకున్న భార్య తెలివిగా వేశ్యాలోలుడైన భర్తని ఎలా మార్చుకుందో దిద్దుబాటులో చెప్పారు. ఇది మొదటి కథానికే కాదు, లక్షణాలివని చెప్పకుండానే కథానికా లక్షణాలు చెబుతుంది ఈ కథానిక. ముసలి మొగుడు పడుచుపెళ్ళాన్ని ఎలా చిత్రహింసలు పెడతాడో మెటిల్డాలో చెప్పారు. మనిషి మతాన్ని ఎలా వాడుకోగలడో మతము విప్పుతము కథానికలో చెప్పారు. ఒకే మతంలోని చీలికలతో, రకరకాల దేవుళ్ళ పేరుతో ప్రజలు కొట్టుకునే విధానానికి చాలా ఘాటుగా స్పందించారు. .. మీ పేరేమిటి? కథానికలో సంస్కర్త హృదయం కథానికలో ఒక వేశ్యని సంస్కరిస్తానని వేశ్యాలోలుడైన ఓ ప్రొఫెసర్‌ వికృత రూపాన్ని చూపిస్తారు. రాచమల్లు రామచంద్రారెడ్డి గారన్నట్లు వితంతు వివాహాలకు తాను అనుకూలుడై ఉండి కూడా ఆ సమస్యను అల్లరిపాలు చేసాడు. వేశ్యా ఉద్దరణకి అనుకూలుడై ఉండకుండా, ఆ సమస్యనీ నవ్వులపాలు ఎందుకు చేసాడు గురజాడ? అని ఆలోచిస్తే ఆయనకు సమకాలీన సమాజంలో సాగుతూ ఉండిన సంస్కరణోద్యమాల పట్ల గురజాడకు తృప్తిలేదు. సానుభూతి లేదు. ఆయన పర్‌ఫెక్షనిస్ట్‌. ఏది జరిగినా పద్ధతి ప్రకారం పరిపూర్ణంగా జరగాలనే ఆయన అభిలాష. నిజాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పగల గుండెధైర్యముంది. పీల మనిషైనా! మంచి వ్యక్తిత్వమున్న రచయిత కాబట్టే గొప్ప రచయిత కాగలిగాడు. మరణించి వందేళ్ళయినా మన మనసుల్లో పెరుగుతున్నాడే గాని, మసకబారిపోవడం లేదు. గొప్ప ప్రయోక్త, సంస్కర్త! ఆధునిక తెలుగు సాహిత్య నిర్మాతల్లో గురజాడ అప్పారావు ప్రముఖ రచయితగా నాటకకర్తగా తన రచనల్లో వ్యవహారిక భాషను ప్రవేశపెట్టిన దృష్టి. కన్యాశుల్కం నాటకంలో పాత్రోచిత భాషగా విజయనగరం భాష, యాసలను అందులోనూ కులయాసలను ప్రయోగించిన గొప్ప ప్రయోక్త.ఇకపోతే ఆయన వ్రాసిన ఐదు కథల్లో వ్యవహారిక భాషను ప్రయోగించాడు. అది 'యాస' కాక ప్రామాణికమైన వ్యవహారిక భాష. కందుకూరి వీరేశలింగం పంతులు సామాజిక పరివర్తనం కోసం సాహిత్యాన్ని పరికరంగా వాడుకున్నాడు. సాహిత్యం ప్రయోజనం సమాజాన్ని ప్రక్షాళనం చేయటం అని వీరేశలింగం గుర్తించాడు. సాహిత్యం రూపురేఖలనే ఆయన మార్చేసాడు. అదేమార్గంలో నడిచిన గురజాడ సాహిత్యం ప్రజాజీవితాన్ని మలుపు తిప్పే ఆయుధం అనే దృష్టితో రచనలుచేసాడు. అప్పటికే అచ్చుయంత్రాలు వచ్చాయి. పత్రికా ప్రచురణ పుస్తకాలు అచ్చువేయటం, మధ్య తరగతివాళ్ళు అక్షరాస్యులు వాటిని చదవటం ప్రభావితం కావటం ఆరంభమైంది. కాబట్టి గురజాడ సాహిత్యం అక్షరాస్యులకు అందింది. అతని కన్యాశుల్కం నాటకం ప్రదర్శింపబడి జనరంజకమైంది. వెంటనే గురజాడ సాహిత్యం సమాజ పరివర్తనకు మూలకారకం కాకపోయినా క్ర మంగా అతని సాహిత్యం సమాజప్రక్షాళన ప్రయోజనం బాధ్యతను నిర్వహించింది. వినూతన భావ సంచారానికి కారణమైంది. గురజాడ ఎక్కువ కథలు వ్రాయకపోయినా, వ్రాసిన ఐదు కథల్లోనూ సంఘ సంస్కరణ భావాలను చిత్రించాడు. మూఢనమ్మకాలను విమర్శించాడు. హిందూ ముస్లింల సఖ్యాన్ని ప్రబోధించాడు. అభ్యుదయ రచయితగా మన ముందుకువచ్చారు. గురజాడ తన మొదట కథ ''దిద్దుబాటు'' ను సరళ గ్రాంథికంలో రచించి తర్వాత వ్యవహారిక భాషలోకి మార్చి తిరగ రచించాడు.ఆయనవస్తువు, కథనం, భాష, పాత్రల చిత్రణ పాత్రలకు పేర్లు పెట్టటంలో, వర్ణనల్లో ఆధునికతను చూపాడు. ఒక పాత్రకు 'మెటల్డా' అని ఇంగ్లీషు పేరు పెట్టాడు. సమకాలిక సమాజ స్వభావాన్ని చక్కగా కండ్లకు కట్టేటట్లుగా వాస్తవికంగా తన కథల్లో చిత్రించాడు. అటువంటి ఆధునికమైన సమకాలిక జీవిత చిత్రణలున్న కథల్లో ఒకటి రెండు చోట్ల వర్ణనల్లో నాకు కాళిదాసుని వర్ణల్లోని భావాలు కనపడటం ఆశ్చర్యం కలిగించింది. అయితే గురజాడ సంస్కృతం చదువుకున్నాడన్నమాట అని అనుకున్నాను. ఆయన జీవిత వివరాలు సంక్షిప్తంగా పరిశీలిస్తే బిఏ లో ఆయనకు ఫిలాసఫీ అభిమాన విషయం అయినా రెండో భాషగా సంస్కృతం చదువుకున్నాడు. ఆ కాలంలో ఆ సంస్కృతం సిలబస్‌ గట్టిగానేఉండి వుంటుంది. సంస్కృతాన్ని నేర్చుకునేవాళ్ళు కాళిదాసును కాళిదాసు రఘువంశం, మేఘసందేశాలను చదువుకోవటం సంప్రదాయంగా వున్నదే. వాటిల్లో మేఘ సందేశం శ్లోకాలు వాటిల్లోని వర్ణనలు అతని హృదయానికి హత్తుకున్నాయి. అతని భావనలో మమేకమై నిలిచిపోయాయి. అందుకే ఒకటి రెండు కథల్లో వర్ణనల్లో మేఘసందేశం లోని భావాలను ఉన్నదున్నట్లుగా చెప్పేసాడు. ''మీ పేరేమిటి'' కథలో శాస్త్రులుగారు తమ శిష్యులతో రామ్మూర్తి అనే శిష్యుడు వేసిన తోటకు విహారానికి వెళ్ళారు. పూలు పండ్లతో పచ్చని తోట బ్రహ్మాండంగా ఉంది. ఆ అందమైన తోటలో విహరించటం గురువుగారికి చాలా ఇష్టం. ఆనందం. అక్కడ గురువు శాస్త్రులుగారు తమ అభిమానులైన శిష్యులతో తరచు మీటింగులు పెడ్తుంటారు. గురువుగారు శిష్యులు అట్లా కలుసుకున్నప్పుడు ''స్వర్గఖండం ఒకటి అక్కడికి దిగినట్లు వుంటుంది.'' అంటాడు కథలో కథనం చేసే కథకుడైన శిష్యుడు. ఈ భావ కల్పన మనకు కాళిదాసు మేఘ సందేశంలో ఉజ్జయిని నగరాన్ని వర్ణించిన సందర్భంలో కన్పిస్తున్నది. కాళిదాసుకు ఉజ్జయినీ నగరం అంటేచాలా అభిమానం. కాస్త వంకరతోవ అయినా సరే ఉజ్జయినీ నగరాన్ని సందర్శించమని యక్షుడు మేఘంతో అంటాడు. ఏడెనిమిది శ్లోకాల్లో ఉజ్జయినీ నగర వైభవాన్ని వర్ణించాడు కాళిదాసు. ఆ నగరాన్ని శ్రీ విశాల, అవంతి అనికూడా పిలుస్తారు. ఆ అవంతీనగరం స్వర్గవాసులైన జనులు కొంత పుణ్యాన్ని మిగుల్చుకొని భూలోకానికి వెంట తీసుకొని తెచ్చుకొన్న స్వర్గఖండమో అనే విధంగా వుంది అంటాడు కాళిదాసు. ఉజ్జయినిని స్వర్గంగా వర్ణించాడు.కాళిదాసు చెప్పిన ''స్వర్గఖండం'' దిగినట్లుగా ఉంది అన్న భావం గురజాడ హృదయంలో ఉండిపోయింది. ఆ మేఘసందేశ పఠన కాలంలో అతని హృదయంలోని హత్తుకుపోయిన కల్పన ఈ విధంగా ''మీ పేరేమిటి'' కథలో తోట ఒక భూలోకంలో దిగివచ్చిన స్వర్గభంజంగా వుందన్న భావంగా వ్యక్తమైంది. మెటల్డా కథలో మెటిల్డా తలయెత్తి యిటు అటూ చూసిన కన్నుల తళుకూ.. అన్న గురజాడ వర్ణన విద్యుద్దామ స్ఫురిత చకితైర్యత్ర.. లోచనై:...'' అన్న కాళిదాసు ఉజ్జయినీ నగర స్త్రీల కళ్ళ వర్ణనను అనుకోకుండా గుర్తుకు తెస్తుంది. ''సంస్కర్త హృదయం'' కథలో సరళ సొదశను వర్ణనలు ప్రాచీన కవుల వర్ణనల వలె రమ్యంగా వున్నాయి. ఈవర్ణనలు గురజాడ కవి హృదయాన్ని బయటపెడ్తున్నాయి. అతని సౌందర్య దృష్టిని తెలుపుతున్నాయి.