Sunday, November 30, 2014

కలెక్టర్ పదవిని ఎప్పుడు ప్రవేశపెట్టారు ?


స్థానిక స్వపరిపాలనా సంస్థలు స్థానిక పలనా వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు తోడ్పడే సంస్థలను స్థానిక ప్రభుత్వాలు అంటారు. గ్రామ స్వరాజ్యమే రామరాజ్యం అనే గాంధీ కలలను సాకారం చేయడానికి భారత రాజ్యాంగంలోని ప్రకరణ 40 పంచాయతీరాజ్ సంస్థలను ఏర్పాటు చేయాలని పేర్కొంది. అయితే IVవ భాగంలో పేర్కొన్న వీటికి రాజ్యాంగ బద్ధత లేకపోవడంతో ఆచరణలో సత్ఫలితాలు పొందలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఎల్‌ఎం సింఘ్వీ కమిటీ సూచనల మేరకు పంచాయతీరాజ్, నగర పాలక సంస్థలకు 73, 74 రాజ్యాంగ సవరణల(1992) ద్వారా రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు. చారిత్రక నేపథ్యం - రుగ్వేదంలో సభ, సమితి అనే రెండు స్థానిక స్వపరిపాలనా సంస్థల ప్రస్తావన ఉంది. -కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో గ్రామిక, గ్రామకూట అనే గ్రామాధికారుల గురించి ప్రస్తావించారు. గ్రామాధికారిని గ్రామణి అని, 10 గ్రామాల అధిపతిని దశగ్రామణి అని పిలిచే వారు. - మెగస్తనీస్ కూడా తన ఇండికా గ్రంథంలో పాటలీపుత్ర నగరంలో మున్సిపల్ ప్రభుత్వాల గురించి వివరించాడు. - మధ్యయుగంలో దక్షిణ భారతదేశంలో చోళుల స్థానిక స్వపరిపాలన ప్రసిద్ధిగాంచింది. మొదటి పరాంతకుని ఉత్తర మెరూర్ శాసనం ప్రకారం చోళులు తాటి ఆకులను బ్యాలెట్ పత్రాలుగా, కుండలను బ్యాలట్ బాక్సులుగా ఉపయోగించి స్థానిక సంస్థలకు పాలకులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. - మొగలుల కాలంలో పట్టణ పాలనను కొత్వాల్ అనే అధికారి చూసుకునేవాడు. కొత్వాల్‌కు సహాయంగా మున్సబ్ అనే అధికారి ఉండేవాడు. బ్రిటీష్ కాలంలో.... - మద్రాసు నగరపాలక కార్పొరేషన్ స్థాపనతో భారతదేశంలో ఆధునిక స్థానిక ప్రభుత్వ చరిత్ర ప్రారంభమైందని చెప్పవచ్చు. రెండో జేమ్స్ చక్రవర్తి జారీచేసిన చార్టర్(1687 ) ద్వారా పన్నుల వసూలు కోసం మద్రాసు మున్సిపల్ కార్పొరేషన్‌ను ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించింది. - బ్రిటీషువారు జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకొని 1772లో కలెక్టర్ అనే పదవిని ప్రవేశపెట్టారు. - చార్టర్ చట్టం(1813) ద్వారా స్థానిక సంస్థలకు పన్ను విధించడానికి, అవి చెల్లించని వారిపై చర్యలు తీసుకునే అధికారాన్ని కల్పించారు. - భారతదేశానికి గవర్నర్ జనరల్(1835-36)గా పనిచేసిన మెట్‌కాఫ్ భారతదేశ గ్రామీణ సమాజాలను లిటిల్ రిపబ్లిక్స్‌గా అభివర్ణించారు. నేడు అవే స్థానిక ప్రభుత్వాలుగా మార్పు చెందాయి. - భారత కౌన్సిళ్ల చట్టం(1861) ద్వారా స్థానిక అవసరాలను తీర్చే బాధ్యతను రాష్ర్టాలకు అప్పగించారు. - ఆర్థిక వికేంద్రీకరణ తీర్మానం (1870) ద్వారా భారతదేశంలో మొదటిసారిగా వైస్రాయ్ లార్డ్ మేయో స్థానిక ప్రభుత్వాలను ప్రవేశపెట్టాడు. - వైస్రాయ్ లార్డ్ రిప్పన్ స్థానిక ప్రభుత్వాలను ఆర్థిక, పాలనాపరమైన అధికారాలను బదలాయిస్తూ 18మే 1882లో ఒక తీర్మానాన్ని ప్రతిపాదించాడు. అతని తీర్మానాన్ని భారతదేశంలో స్థానిక ప్రభుత్వాల ఏర్పాటు, వికాసాలకు మాగ్నాకార్టాగా వర్ణించారు. అందుకే లార్డ్ రిప్పన్ స్థానిక సంస్థల పితామహుడుగా ప్రఖ్యాతి పొందాడు. 1882లో స్థానిక ప్రభుత్వాల చట్టం ప్రకారం.. - రిప్పన్ తరువాత భారతదేశాన్ని పరిపాలించిన గవర్నరు జనరల్స్ స్థానిక ప్రభుత్వాలకు క్రమేణా అధికారాలను విస్తృతం చేయడానికి అనేక చర్యలు తీసుకున్నారు. వాటిలో ముఖ్యమైనవి... బెంగాల్ మున్సిపాలిటీ చట్టం (1884) బెంగాల్ స్థానిక ప్రభుత్వాల చట్టం (1885) బెంగాల్ స్థానిక గ్రామీణ స్వయం పాలనా చట్టం (1919) భారతదేశంలో స్థానిక ప్రభుత్వాల పనితీరును, అవి విజయవంతం కాకపోవడాన్ని సమీక్షించడానికి 1907 సంవత్సరంలో సర్ చార్లెస్ హబ్ అధ్యక్షతన రాయల్ వికేంద్రీకరణ సంఘం నియమించబడింది. అది 1909లో సమర్పించిన నివేదిక కింది అంశాలను పేర్కొంది. అవి.. - దేశంలో ప్రతి గ్రామానికి ఒక గ్రామ పంచాయతీ ఉండాలి. - 3 స్థాయిల్లో గల స్థానిక ప్రభుత్వాల సభ్యుల్లో ఎక్కువ మంది ప్రజలను ప్రత్యక్షంగా ఎన్నుకోవాలి. - ప్రాథమిక విద్య బాధ్యత మున్సిపాలిటీలకు ఉండాలి. - రాయల్ కమిషన్ సూచనల మేరకే మింటో మార్లే సంస్కరణలు (1909) చట్టంలో స్థానిక సంస్థల ప్రతినిధులను ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకొనే పద్ధతిని ప్రవేశపెట్టారు. - స్థానిక స్వయంపాలనను మాంటెగ్-ఛేమ్స్‌ఫర్డ్ సంస్కరణల(1919) ద్వారా రాష్ట్ర జాబితాలో చేర్చారు. అందువల్ల ఆయా రాష్ట్ర శాసనసభలు ప్రతి రాష్ట్రంలోనూ స్థానిక పరిపాలన కోరుతూ శాసనాలు చేశాయి. 1919 నాటికి జిల్లాల సంఖ్య 207, తాలూకా బోర్డుల సంఖ్య 584కు చేరింది. - భారత ప్రభుత్వ చట్టం (1935) ప్రకారం రాష్ర్టాలకు స్వపరిపాలనాధికారం లభించడంతో స్థానిక స్వపరిపాలన మరింత పటిష్టమైంది. అధికారులు నామినెట్ చేసే పద్ధతిని పూర్తిగా రద్దుచేశారు. స్థానిక ప్రభుత్వ పాలన పూర్తిగా మంత్రుల చేతిలోకి వచ్చింది. ఈ చట్టం జిల్లా బోర్డుల్లో రాష్ర్టాలకు పూర్తి స్వాతంత్య్రం కల్పించడం వల్ల స్థానిక సంస్థలకు ప్రజాస్వామ్య పద్ధతిలో సంస్కరించడానికి ప్రయత్నాలు జరిగాయి. అశోక్ మెహతా కమిటీ బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ సిఫారసుల ప్రకారం ఏర్పాటు చేసిన పంచాయతీ రాజ్ సంస్థలు అనుకున్న లక్ష్యాలను సాధించలేదు. దీంతో వాటి పనితీరును సమీక్షించడానికి, పంచాయతీరాజ్ వ్యవస్థను సమగ్రంగా పరిశీలించడానికి డిసెంబర్ 1977లో అప్పటి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా ప్రభుత్వం అశోక్ మెహతా అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ 132 సిఫారసులతో తన నివేదికను 1978 ఆగస్టులో సమర్పించింది. సిఫారసులు మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ స్థానంలో రెండంచెల వ్యవస్థను ప్రవేశపెట్టాలి. అది జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్, బ్లాక్ స్థాయిలో మండల పంచాయతీ ఏర్పాటుచేసి, గ్రామపంచాయతీలను రద్దుచేసి వాటిస్థాయిలో గ్రామ కమిటీలను ఏర్పాటు చేశాలి. -15వేల నుంచి 20వేల జనాభాతో కూడిన కొన్ని గ్రామాలను మండల పంచాయతీగా ఏర్పాటు చేయాలి. - అర్హుడైన న్యాయాధికారి అధ్యక్షతన న్యాయ పం చాయతీ సంస్థను ప్రత్యేక వ్యవస్థగా ఏర్పాటు చేయాలి. - పంచాయతీ రాజ్ సంస్థల వ్యవహారాల పర్యవేక్షణ కోసం పంచాయతీ రాజ్ మంత్రిని నియమించాలి. - పంచాయతీ రాజ్ వ్యవస్థ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా పోటీ చేయాలని సూచించింది. -షెడ్యూలు కులాలు, తెగల వారికి జ నాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి. - జిల్లా స్థాయి సంస్థల్లో పంచాయతీ రాజ్ అకౌంట్స్ ఆడిట్ జరపాలి. - పంచాయతీలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయరాదు. ఒకవేళ రద్దు చేస్తే 6 నెలల్లో ఎన్నికలను నిర్వహించాలి. - జిల్లా పరిషత్ అధ్యక్షున్ని పరోక్షంగా ఎన్నుకోవాలి. అయితే మండల పరిషత్ అధ్యక్షున్ని పత్యక్షంగా కానీ, పరోక్షంగా గానీ ఎన్నుకోవచ్చు. -పంచాయతీరాజ్ సంస్థలు ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా పన్నులు విధించి స్వతంత్రంగా నిధులు సమకూర్చుకోవాలి. - పంచాయతీరాజ్ సంస్థలో అన్ని పదవులకు కాల వ్యవధిని 4 ఏండ్లుగా నిర్ణయించాలి. జనతా ప్రభుత్వం రద్దు కావడంతో ఈ నివేదికను అమలు చేయలేదు. అయితే అశోక్ మెహతా కమిటీ సిఫారసులను 1979లో జరిగిన రాష్ర్టాల ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చించి కొన్ని మార్పులతో ఆమోదించారు. ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, కర్ణాటక వంటి కొన్ని రాష్ర్టాలు అశోక్ మెహతా కమిటీ సిఫారసుల్లోని కొన్ని అంశాలను తమ రాష్ర్టాలకు అనుగుణంగా మార్పు చేసుకొని అమలుచేశాయి. నోట్ : బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ సూచనల ద్వారా ఏర్పాటైన పంచాయతీ వ్యవస్థలను మొదటితరం పంచాయతీలని అంటారు. - ఆశోక్ మెహతా కమిటీ సిఫార్సులు ఆధారంగా ఏర్పాటైన(ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, కర్ణాటక)పంచాయతీ వ్యవస్థలను రెండోతరం పంచాయతీలని అంటారు. బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ - సిఫారసులు సమాజాభివృద్ధి పథకం, జాతీయ విస్తరణ సేవా పథకాల ద్వారా ఆశించిన ఫలితాల కలగకపోవడంతో గ్రామ స్వపరిపానలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించడానికి అవసరమ్యే సంస్థాగత ఏర్పాటును సూచించవలసిందిగా ప్రణాళికా సంఘంలోని ప్రణాళికా పథకాల కమిటీ(జాతీయాభివృద్ధి మండలి) 16 జనవరి 1957లో బల్వంత్‌రాయ్ గోపాల్ మెహతా అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రజస్వామ్య వికేంద్రీకరణ-ప్రజల భాగస్వామ్యం అనే అంశాలతో మూడంచెల పంచయతీ రాజ్ వ్యవస్థను సిఫార్సు చేస్తూ తన నివేదికను 24 నవంబర్ 1957లో సమర్పించింది. బల్వంత్‌రాయ్ కమిటీ సిఫార్సులను జాతీయాభివృద్ధి మండలి1958 జనవరిలో ఆమోదించింది. దీంతో వివిధ రాష్ర్టాలు పంచాయతీరాజ్ సంస్థల ఏర్పాటుకు తగిన చట్టాలు చేశాయి. -1959లో స్థానిక స్థానిక స్వపరిపాలనా సంస్థలను ఏర్పాటు చేసినప్పటికీ ఎన్నికలు మాత్రం 1964లో నిర్వహించారు. సిఫారసులు -దేశంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్, గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, బ్లాక్ స్థాయిలో పంచాయతీ సమితిని ఏర్పాటు చేశారు. - స్థానిక సంస్థలకు ప్రతీ ఐదేళ్లకొకసారి ఎన్నికలు నిర్వహించాలి. -ఎన్నికలు పార్టీ ప్రాతిపదికపై కాకుండా స్వతంత్రంగా జరగాలి. - గ్రామ పంచాయతీ వ్యవస్థకు ప్రత్యక్ష ప్రాతిపదికపై ఎన్నికలు నిర్వహించాలి. - జిల్లా పరిషత్, పంచాయతీ సమితుల అధ్యక్షులను పరోక్ష పద్ధతిలో ఎన్నుకోవాలి. -స్థానిక అంశాలకు చెందిన అధికారాలను ఈ సంస్థలకు బదలాయించాలి. - స్థానిక ప్రభుత్వాలకు చెందిన అభివృద్ధి కార్యక్రమాలను పంచాయతీరాజ్ సంస్థల ద్వారానే అమలు చేయాలి. - పంచాయతీ సమితి కార్యనిర్వాహక అధికారాలను, జిల్లాపరిషత్‌కు సలహా పర్యవేక్షణ అధికారాలను కల్పించాలి. -గ్రామ పంచాయతీ వ్యవస్థకు ప్రత్యక్ష ఎన్నికలను నిర్వహించాలి. నోట్ : దేశంలో పంచాయతీరాజ్ సంస్థలను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం రాజస్థాన్(నాగోర్ జిల్లా సికార్‌లో 2 అక్టోబర్ 1959), రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్(ప్రస్తుతం తెలంగాణలో)-మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో 11 అక్టోబర్ 1959, 1 నవబంర్ 1959 రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో జవహర్‌లాల్ నెహ్రూ ద్వారా ప్రవేశపెట్టారు.(అప్పుడు ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి)