Tuesday, January 9, 2024

బస్సుల్లో ఉచిత ప్రయాణానికి కొత్త గైడ్‌లైన్స్ జారీ: పాటించకపోతే రూ.500 ఫైన్

 

 


TSRTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలపై టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ స్పష్టత ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవాలంటే ఒరిజినల్‌ గుర్తింపు కార్డు తప్పనిసరి అని తేల్చి చెప్పారు.

గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫొటో, అడ్రస్ స్పష్టంగా కనిపించాల్సి ఉంటుందని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఏ ఒరిజినల్‌ గుర్తింపు కార్డయినా సరే.. దాన్ని చూపించి నిబంధనల మేరకు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. పాన్‌ కార్డులో అడ్రస్ ఉండదు కాబట్టి.. అది ఉచిత ప్రయాణానికి చెల్లుబాటు కాదు అని సజ్జనార్ పేర్కొన్నారు.

ఒరిజినల్‌ గుర్తింపు కార్డులు చూపించాలంటూ తాము పదే పదే చెబుతున్నామని.. ఎప్పటికప్పుడు సూచనలను జారీ చేస్తోన్నామని, అయినప్పటికీ.. కొంతమంది దీన్ని అనుసరించట్లేదని సజ్జనార్ వ్యాఖ్యానించారు. స్మార్ట్‌ ఫోన్లల్లో ఉండే ఫొటోలను గుర్తింపు కార్డుగా చూపించడం చెల్లుబాటు కాదని అన్నారు.

ప్రయాణ సమయంలో తమ గుర్తింపుకార్డు ఫొటో కాపీలు, కలర్‌ జిరాక్స్‌ను చూపిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అవి చెల్లవని ఆయన తేల్చి చెప్పారు. దీని వల్ల సిబ్బంది ఇబ్బందులకు గురి కావడంతో పాటు ప్రయాణ సమయం కూడా పెరుగుతోందని పేర్కొన్నారు. ఇది ఇతర ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని సజ్జనార్ అన్నారు.

మహిళా ప్రయాణికులందరూ ఒరిజినల్‌ గుర్తింపు కార్డును చూపించి జీరో టికెట్‌‌ను తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఒరిజినల్‌ గుర్తింపు కార్డు లేకుంటే కచ్చితంగా డబ్బు చెల్లించి టికెట్‌ తీసుకోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. మహాలక్ష్మి పథకం తెలంగాణ ప్రాంత మహిళలకే వర్తిస్తుందని, ఇతర రాష్ట్రాల మహిళలు విధిగా ఛార్జీని చెల్లించి టికెట్‌ తీసుకోవాలని సూచించారు.

ఫ్రీ ట్రావెల్ ఉన్నప్పుడు జీరో టికెట్‌ తీసుకోవడానికి కొందరు మహిళ ప్రయాణికులు నిరాకరిస్తోన్నారని, సిబ్బందితో వాదనకు దిగుతున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని సజ్జనార్ అన్నారు. ఇది సరి కాదని చెప్పారు. జీరో టికెట్ల జారీ ఆధారంగానే ఆ డబ్బును టీఎస్ఆర్టీసీకి ప్రభుత్వం రీయింబర్స్‌ చేస్తుందని వివరించారు.

జీరో టికెట్‌ లేకుండా ప్రయాణిస్తే.. సంస్థకు నష్టం చేసిన వాళ్లవుతారని సజ్జనార్ స్పష్టం చేశారు. ప్రతి మహిళా కూడా జీరో టికెట్‌ను తీసుకోవాలని, ఒక వేళ టికెట్‌ తీసుకోకుండా ప్రయాణిస్తే.. అది చెకింగ్‌లో గుర్తిస్తే సిబ్బంది ఉద్యోగం ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. అలాగే సదరు ప్రయాణికురాలికి 500 రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంటుందని అన్నారు.