Tuesday, August 8, 2023

ఎయిర్‌టెల్‌ 5జీ వైర్‌లెస్ వైఫై ప్రారంభం..

 

 


దేశంలో ప్రముఖ టెలికాం సంస్థ భారతి ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్‌ ఎయిర్‌ఫైబర్‌ (Xstream AirFiber) పేరిట ఫిక్స్‌డ్‌ వైర్‌లెస్‌ 5జీ సర్వీస్‌లను ప్రకటించింది. ఢిల్లీ,  ముంబై నగరాల్లో తొలి 5జీ టెక్నాలజీ ఆధారిత ఫిక్స్‌డ్‌ వైర్‌లెస్ యాక్సెస్ (FWA) సేవలను ప్రారంభించింది.

నెట్‌వర్క్‌ అందుబాటులోని మారుమూల గ్రామాలకు సైతం ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించే ఉద్దేశంతో ఈ టెక్నాలజీ 5జీ వైర్‌లెస్‌ సేవలు అందుబాటులోకి తీసువచ్చినట్లు ఎయిర్‌టెల్‌ తెలిపింది. ఈ ఎక్స్‌ట్రీమ్‌ ఎయిర్‌ ఫైబర్‌ వైర్‌లెస్‌గా 100 Mbps వేగంతో ఇంటర్నెట్‌ అందిస్తుంది.

ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ఎయిర్‌ఫైబర్‌ అనేది స్వతంత్రంగా పనిచేసే ఓ ప్లగ్ అండ్ ప్లే పరికరం. వైఫై 6 ప్రమాణాలతో అంతరాయం లేకుండా విస్తృత నెట్‌వర్క్ కవరేజీని అందిస్తుంది. దీని ద్వారా ఏకకాలంలో  64 ఫోన్లు లేదా ల్యాప్‌టాప్‌లకు హై స్పీడ్ ఇంటర్నెట్‌ను పొందవచ్చు. ఈ పరికరానికి సంబంధించిన హార్డ్‌వేర్ పరికరాలన్నీ భారత్‌లోనే తయారైనట్లు కంపెనీ పేర్కొంది.  గత మూడు నాలుగేళ్లుగా ఇళ్లలో ఉపయోగించే వైఫై సేవలకు డిమాండ్ విపరీతంగా పెరిగిందని,  ఎక్స్‌ట్రీమ్‌ ఎయిర్‌ఫైబర్‌తో ఫిజికల్ ఫైబర్ నెట్‌వర్క్ సదుపాయం లేని ప్రాంతాలకు కూడా వేగవంతమైన వైఫై ఇంటర్నెట్‌ సేవలు అందిస్తామని కంపెనీ పేర్కొంది. 

ప్రస్తుతం డిల్లీ, ముంబై నగరాల్లోనే ఈ సేవలు ప్రారంభించినప్పటికీ రాబోయే రోజుల్లో దేశమంతటా విస్తరించాలని యోచిస్తోంది. 5జీ ఆధారిత ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ సర్వీస్‌ను అధికారికంగా ప్రారంభించిన మొదటి కంపెనీ ఎయిర్‌టెల్. అయితే కొన్ని నెలల క్రితం జియో కూడా జియో ఎయిర్‌ఫైబర్ పేరుతో ఇటాంటి సర్వీసునే తీసుకురాన్నుట్లు ప్రకటించింది.  ప్రస్తుతానికి జియో ఎయిర్‌ఫైబర్‌ ధరలు ఎంత ఉంటాయి.. అధికారికంగా ఎప్పుడు ప్రారంభిస్తారు? అన్న వివరాలపై సమాచారం లేదు.

ఎయిర్‌టెల్‌ ఎయిర్‌ఫైబర్‌ ప్లాన్‌ వివరాలు
ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఎయిర్‌ఫైబర్ నెలకు రూ. 799. హార్డ్‌వేర్ కాంపోనెంట్ కోసం సెక్యూరిటీ డిపాజిట్‌గా అదనంగా రూ. 2,500 చెల్లించాలి. మొత్తం ఆరు నెలల ప్యాకేజ్‌ 7.5 శాతం తగ్గింపుతో రూ. 4,435లకే అందిస్తోంది. అయితే ఎయిర్‌టెల్ అపరిమిత డేటాను ఆఫర్ చేస్తుందా లేదా మిగిలిన  బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల మాదిరిగానే పరిమితి ఉంటుందా అనేది స్పష్టత లేదు.