Monday, February 27, 2023

పార్లమెంటులోని బిల్లుల రకాలు

 రాజ్యాంగంలో పేర్కొన్న నాలుగు రకాల బిల్లులు:

    1. సాధారణ బిల్లు
   2.  ద్రవ్య బిల్లు
   3.  ఆర్థిక బిల్లు
    4. రాజ్యాంగ సవరణ బిల్లు




    1.సాధారణ బిల్లు
డబ్బు, ఆర్థిక లేదా రాజ్యాంగ సవరణ బిల్లు కాకుండా వేరే ఏదైనా బిల్లును సాధారణ బిల్లు అంటారు. దీనిని పార్లమెంటు ఉభయ సభల్లో ప్రవేశపెట్టవచ్చు. దీనిని పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి సిఫారసు అవసరం లేదు (ఆర్టికల్ 3 ప్రకారం బిల్లు మినహా). ఇది ఉభయ సభల ద్వారా సాధారణ మెజారిటీతో ఆమోదించబడుతుంది. వారు సాధారణ బిల్లు ఆమోదంపై సమాన శాసన అధికారాలను పొందుతారు. బిల్లుపై ప్రతిష్టంభన ఉంటే పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశంలో పరిష్కరించవచ్చు.

సాధారణ బిల్లులో వివిధ దశలు ఉంటాయి. అవి..

ప్రవేశ దశ : ఒక బిల్లును సభలో ప్రవేశపెడుతున్న సభ్యుడు, ఆ బిల్లు పేరును, ఆవశ్యకతను, ప్రాధాన్యతను వివరిస్తాడు. ఈ దశలో బిల్లుపైన ఎలాంటి చర్చ జరగదు.

పరిశీలన దశ : ఈ దశలో ముద్రించిన బిల్లుల పత్రాలను సభ్యులకు పంపిస్తారు. అనంతరం బిల్లుపైన సమగ్రమైన, విస్తృతమైన చర్చ జరుగుతుంది. ఈ దశలో

-బిల్లును చర్చించి, వెంటనే ఆమోదించమని అడగవచ్చు.

-బిల్లును సెలెక్ట్ కమిటీకి లేదా రెండో సభ అంగీకారంతో జాయింట్ సెలక్ట్ కమిటీకి నివేదించవచ్చు

-బిల్లుపై ప్రజాభిప్రాయసేరకరణ జరపమని అడగవచ్చు.

కమిటీ దశ : బిల్లులను సెలెక్ట్ కమిటీ అభిప్రాయానికి పంపిస్తారు. సెలెక్ట్ కమిటీ సంఖ్యను ఆయా సభాధ్యక్షులు నిర్ణయిస్తారు. సాధారణంగా వీరి సంఖ్య 20 నుంచి 30 వరకు ఉంటుంది. ఉభయసభల సభ్యులతో కలిపి ఏర్పాటు చేస్తే దానిని జాయింట్ సెలెక్ట్ కమిటీ అంటారు. ఈ కమిటీ సూచించిన సవరణను, ప్రతిపాదనలను సభ ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు.

ఆమోద దశ – ఈ దశలో బిల్లుపై పరిమితంగా చర్చించడాని సభ్యులకు అనుమతి లభిస్తుంది. బిల్లులను అంగీకరించడానికి, నిరాకరించడానికి మాత్రమే చర్చ పరిమితమవుతుంది. హాజరై ఓటు వేసిన సభ్యులలో మెజారిటీ సభ్యులు అంగీకరిస్తే ఆ బిల్లును సభ ఆమోదించినట్లు సభాపతి ప్రకటిస్తారు. దీంతో సభలో ప్రవేశపెట్టిన బిల్లు ప్రక్రియ పూర్తవుతుంది.

a)రెండో సభలోకి బిల్లు వెళ్లడం: బిల్లు శాసనంగా మారడానికి ఉభయసభలు ఆమోందించాల్సి ఉంటుంది. బిల్లును ఏ సభలో ప్రవేశపెడుతారో అక్కడ అది ఆమోదంపొందిన తర్వాత దానిని రెండో సభ ఆమోదం కోసం పంపిస్తారు. ఇలా పంపిన బిల్లును  -సభ పూర్తిగా తిరస్కరించవచ్చు

-బిల్లులో కొన్ని సవరణలు ప్రతిపాదించి, ప్రవేశపెట్టిన సభకు పునఃపరిశీలనకు పంపవచ్చు. రెండో సభ చేసిన సవరణను మొదటి సభ అంగీకరించకపోతే ఆ బిల్లు సవరణలకు అనుగుణంగా రెండు సభలు ఆమోదించినట్లుగా పరిగణిస్తారు. అలాకాకుండా రెండో సభ సూచించిన సవరణను మొదటి సభ వ్యతిరేకిస్తే బిల్లు విషయంలో ఉభయసభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడుతుంది.

-రెండోసభకు పంపిన బిల్లులపై ఆ సభ ఎలాంటి చర్య తీసుకోకుండా అలాగే ఉండవచ్చు. ఏ అభిప్రాయాన్ని వ్యక్తీకరించకుండా బిల్లును వాయిదావేయడం, ఆ బిల్లును 6 నెలల కంటే ఎక్కువ కాలం తన దగ్గరే ఉంచుకున్న సందర్భంలో కూడా ఉభయసభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉభయసభలను సంయుక్తంగా సమావేశ పరుస్తారు.

b)ఉభయ సభల సంయుక్త సమావేశం: ఒక బిల్లు ఆమోదం విషయంలో ఉభయ సభల మధ్య ప్రతిష్టంభన నెలకొంటే దానిని తొలగించడానికి ప్రకరణ 108 ప్రకారం, రాష్ట్రపతి ఉభయ సభల ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ సమావేశానికి లోక్‌సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. ఉభయసభల్లో మెజారిటీ సభ్యులు బిల్లును ఆమోదిస్తే అది పార్లమెంటు చేత అంగీకరించినట్లుగా భావిస్తారు.

c)రాష్ట్రపతి ఆమోదం: ఉభయసభలు వేర్వేరుగా గాని, సంయుక్తంగా గాని ఆమోదించిన తరువాత ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిస్తారు. బిల్లును రాష్ట్రపతి ఆమోదిస్తే అది చట్టంగా మారుతుంది. అయితే అది ప్రభుత్వం నిర్ణయించిన తేదీ నుంచి అమలులోకి వస్తుంది. రాష్ట్రపతి బిల్లును ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. అలాకాకుండా పార్లమెంటు పరిశీలనకు పంపించవచ్చు. దీనితర్వాత పంపించిన బిల్లును రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాల్సి ఉంటుంది



2. ద్రవ్య బిల్లు

ప్రకరణ 110 లో ద్రవ్యబిల్లు గురించి వివరించబడినది. దీని ప్రకారం పన్ను విధించడం, తగ్గించడం, క్రమబద్దీకరణ చేయడం, ప్రభుత్వ రుణాలను క్రమబద్దీకరించడం, భారత సంఘటిత నిధి, అగంతక నిధి నుంచి జమ చేయడం – తీసుకోవడం, ఆ నిధిని వినియోగించుకోవడం, ఏ వ్యయాన్నయినా భారత సంఘటిత నిధికి వ్యయంగా ప్రకటించడం, సంఘటిత నిధి లేదా ప్రభుత్వ ఖాతాలకు ద్రవ్యం స్వీకరించడం, ఖాతాల నుంచి విడుదల, తనిఖీ చేయడం వంటి అంశాలు ద్రవ్యబిల్లుల పరిధిలోకి వస్తాయి. కానీ, అవి ద్రవ్యబిల్లు కాదు. ఏదైనా బిల్లు ద్రవ్యబిల్లా కాదా అనే ప్రశ్నతలెత్తితే స్పీకర్ తుది నిర్ణయం తీసుకుంటారు. దానిని ఏ న్యాయస్థానం ప్రశ్నించడానికి వీల్లేదు.

ద్రవ్యబిల్లును రాష్ట్రపతి సిఫారుసుపై లోక్‌సభలోనే ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అక్కడ ఆమోదం పొందిన తర్వాత స్పీకర్ ధృవపత్రంతో దానిని రాజ్యసభకు పంపిస్తారు.

ద్రవ్యబిల్లుపై రాజ్యసభ అధికారాలు

ద్రవ్యబిల్లుపై రాజ్యసభకు అధికారాలు ఈ కింది విధంగా ఉంటాయి. అవి..

-బిల్లును ఆమోదించవచ్చు

-బిల్లుపై చర్చ జరపవచ్చు

-కొన్ని సిఫారసులు చేయవచ్చు.

ఈ అంశాలన్నింటిపైన రాజ్యసభ 14 రోజుల్లోపు తన నిర్ణయాన్ని తెలపాలి.

అయితే రాజ్యసభకు ద్రవ్యబిల్లును తిరస్కరించే అధికారంగానీ, సవరించే అధికారం గానీ లేదు. అందువల్ల ద్రవ్యబిల్లు ఆమోదం విషయంలో లోక్‌సభదే అంతిమ అధికారం అవుతుంది. ఉభయసభల మధ్య ఎలాంటి ప్రతిష్టంభన ఉండదు. ఇలాంటి బిల్లును రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలి. పునఃపరిశీలనకు గాని, నిలిపివేయడం వంటి అధికారాలు రాష్ట్రపతికి ఉండవు.


 3. ఆర్థిక బిల్లు .

ప్రభుత్వ ఆదాయ, వ్యయాలకు సంబంధించిన ప్రస్తావన ఉన్న బిల్లులను ఆర్థిక బిల్లులు అంటారు. అయితే ఆర్థిక బిల్లు అనే పదాన్ని కేవలం సాంకేతిక అర్థంతో ఉపయోగించారు. అందువల్ల ఆర్థిక బిల్లును ద్రవ్యబిల్లులు (ప్రకరణ 110) అంటారు.

ఆర్థిక బిల్లులను రెండు రకాలుగా వర్గీకరించారు. మొదటి రకం (ప్రకరణ 117(1), రెండోరకం (ప్రకరణ 118(3))

ద్రవ్య బిల్లులన్నీ ఆర్థిక బిల్లులో భాగమే. ద్రవ్య బిల్లులన్నీ ఆర్థిక బిల్లులే కానీ ఆర్థిక బిల్లులన్నీ ద్రవ్య బిల్లులు కాదు. స్పీకర్ ధృవీకరించిన ఆర్థిక బిల్లులన్నీ ద్రవ్య బిల్లులు అవుతాయి. అంటే ఆర్థిక, ద్రవ్య బిల్లులకు మధ్య తేడా స్పీకర్ ధృవీకరణ మాత్రమే. దీనిని సాంకేతికపరమైన తేడా అంటారు. ఈ విధమైన ఆర్థిక బిల్లులో ప్రకరణ 110లో పేర్కొన్న అంశాలే కాకుండా ఇతర సాధారణ విషయాలు కూడా ఉంటాయి. వీటిని కూడా రాష్ట్రపతి ఆమోదంతోనే లోక్‌సభలో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.

ఇక రెండో రకమైన ఆర్థిక బిల్లులో కేంద్ర సంఘటిత నిధి నుంచి ఖర్చు చేసే అంశాలు ఉంటాయి. ప్రకరణ 110లో పేర్కొన్న అంశాలు ఇక్కడ ఉండవు. కాబట్టి దీనిని సాధారణ బిల్లుగానే పరిగణిస్తారు. దీనిని ఉభయ సభలలో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. కానీ రాష్ట్రపతి ఆనుమతించాల్సిన అవసరముంటుంది. ఈ బిల్లులను రాజ్యసభ ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు. దీంతో ఉభయసభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడి సంయుక్త సమావేశానికి అవకాశం ఉండవచ్చు


4. రాజ్యాంగ సవరణ బిల్లు
 రాజ్యాంగంలోని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ నిబంధనలను సవరించడానికి ఆర్టికల్ 368 కింద ప్రవేశపెట్టిన బిల్లును రాజ్యాంగ సవరణ బిల్లు అంటారు. దీనిని పార్లమెంటులోని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. దీని ప్రవేశానికి రాష్ట్రపతి సిఫారసు అవసరం లేదు. ఇది పార్లమెంటు ఉభయ సభల ద్వారా విడివిడిగా ఆమోదం పొంది, మెజారిటీ సభ్యులలో 2/3 వంతు కంటే తక్కువ కాకుండా హాజరు మరియు ఓటింగ్ & సభ యొక్క మొత్తం బలం మెజారిటీతో ఆమోదించబడుతుంది. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదంపై ఉభయ సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడితే పార్లమెంటు ఉభయ సభల ఉమ్మడి సమావేశానికి రాజ్యాంగం ఆమోదించదు.