Thursday, March 17, 2022

Instagram Users In Russia: 8 కోట్ల మంది యూజర్లకు షాక్‌.

 


Instagram Users In Russia: 8 కోట్ల మంది యూజర్లకు షాక్‌.. రష్యాలో ఇన్‌స్టాగ్రామ్‌పై నిషేధం..!

ఉక్రెయిన్ పై సైనిక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్న‌ రష్యా సోషల్ మీడియా దిగ్గజాలపై కూడా క‌ఠిన‌ ఆంక్షలు విధిస్తోంది. ఇప్ప‌టికే ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌పై నిషేధం విధించినా ర‌ష్యా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌పై కూడా ఆంక్ష‌లు విధించింది. 

ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్‌పై దాడులకు తెగబడుతున్న రష్యా సోషల్ మీడియా దిగ్గజాలపై కూడా ఆంక్షలు విధిస్తోంది. ఇప్పటికే రష్యా ఫేస్‌బుక్‌, ట్విటర్‌లపై నిషేధం విధించింది. తాజాగా ఫేస్ బుక్ సొంత యాప్ అయిన ఫొటో షేరింగ్‌ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌పైనా కూడా రష్యా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. రష్యా, ఉక్రెయిన్‌, పొలాండ్‌ దేశాల్లో పుతిన్‌ మరణానికి పిలుపునిచ్చేందుకు ఫేస్‌బుక్‌ అనుమతి ఇచ్చిందన్న వార్తల నేపథ్యంలో ఇన్‌స్టా యాప్‌పై నిషేధం విధిస్తున్నట్లు రష్యా వెల్లడించింది. దాంతో ఈ సోమవారం (మార్చి 14) నుంచి రష్యాలో ఇన్‌స్టాగ్రామ్‌పై ఆంక్షలు అమలులోకి వస్తాయి. రష్యా ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 8 కోట్ల (80మిలియన్ల) మంది ఇన్‌స్టా యూజర్లు ఈ యాప్‌కు దూరం కానున్నారు. ఈ మేరకు సంస్థ ప్రతినిధి వెల్లడించారు.

గతకొన్నివారాలుగా రష్యా ఉక్రెయిన్ పై ఏకధాటిగా బాంబులతో దాడులకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో రష్యాపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ దేశాల ఆంక్షలను, హెచ్చరికలను పట్టించుకోని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఇతర దేశాలు కూడా రష్యాపై ఆంక్షలు విధించే విధంగా చర్యలు తీసుకుంటున్నాయి.

రష్యాను ఇరుకున పెట్టేందుకు పలు అంతర్జాతీయ సంస్థలు కూడా ఆంక్షల దిశగా నిర్ణయం తీసుకునే వీలుంది. ద్వేషపూరిత ప్రసంగాలపై నిబంధనలను సడలిస్తూ ఇటీవలే ఫేస్‌బుక్‌ నిర్ణయం తీసుకుంది. రష్యా ఆక్రమణదారులకు మరణం తప్పదు’ అనే పదాలను ఫేస్ బుక్ అనుమతించినట్టు అయింది. ఇదే విషయంలో మెటా అధికార ప్రతినిధులు కూడా ఒక క్లారిటీ ఇచ్చేశారు. ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ద్వారా హింసను అనుమతించినట్టే అవుతుందని స్పష్టం చేసింది.

ఫేస్ బుక్ సొంత యాప్ ఇన్‌స్టాగ్రామ్‌పై రష్యా నిషేధం విధించినందుకు ఆ సంస్థ చీఫ్‌ అడమ్‌ మొస్సెరీ స్పందించారు. రష్యాలో సోమవారం నుంచి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లపై నిషేధం కొనసాగించనున్నట్టు వెల్లడించారు. రష్యా నిర్ణయంతో 8 కోట్ల మంది రష్యన్‌లకు ప్రపంచ ఇన్‌స్టాగ్రామ్‌ వినియోగదారులతో దూరం కానున్నారని అడమ్‌ మొస్సెరీ పేర్కొన్నారు. అయితే.. దీనిపై రష్యాలోని మీడియా నియంత్రణ విభాగం స్పందించింది. దేశంలో హింసాత్మక చర్యలకు పిలుపునిచ్చేలా పోస్టులకు అనుమతి ఇచ్చినందుకు ఇన్‌స్టాగ్రామ్‌ను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ఫేస్‌బుక్‌, ట్విటర్‌లను నిషేధాన్ని రష్యా అమలు చేస్తోంది. కానీ, వాట్సాప్‌పై మాత్రం రష్యా ఎలాంటి ఆంక్షలు విధించలేదు.