దేశంలో రోజు రోజుకి యుపీఐ చెల్లింపుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ పోతుంది. ప్రస్తుతం ఉన్న ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎమ్ వంటి యుపీఐ థర్డ్ పార్టీ సంస్థలు తమ వినియోగదారుల సంఖ్యను పెంచుకునేందుకు కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. దీంతో దేశంలో డీజిటల్ యుపీఐ లావాదేవీల సంఖ్య భారీగా పెరిగింది. అయితే, ఈ యుపీఐ లావాదేవీలు చేయడానికి యూజర్లు మొదట తమ డెబిట్ కార్డు వివరాలను నమోదుజేయాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకు ఖాతాదారులకు డెబిట్ కార్డు లేకపోవడం, ఉన్న పని చేయక పోవడం కారణాల వల్ల ఈ సేవలు అందడం లేదు.
అయితే, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) డెబిట్ కార్డు లేని బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. డెబిట్ కార్డు లేకున్నా యుపీఐ సేవలను పొందవచ్చు అని తెలిపింది. ఇందుకు సంబంధించి ఎన్‌పీసీఐ బ్యాంకులకు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఎన్‌పీసీఐ ఆదేశాల ప్రకారం.. దేశంలో డిజిటల్ లావాదేవిలను ప్రోత్సహించేందుకు ఎన్‌పీసీఐ ఆధార్ నెంబర్, ఓటీపీ ద్వారా డెబిట్ కార్డు లేని బ్యాంకు ఖాతాదారులకు యుపీఐ సేవలను అందించాలని బ్యాంకులను కోరింది. ఇప్పుడు, ఆధార్ నెంబర్, ఓటీపీ ద్వారా డెబిట్ కార్డు లేని/ డెబిట్ కార్డు పనిచేయని వినియోగదారులకు యుపీఐ సేవలను అందజేయవచ్చు అని తెలిపింది.
ఎన్‌పీసీఐ గత ఏడాది సెప్టెంబర్ నెలలో ఈ సర్క్యులర్ జారీ చేసింది. గత ఏడాది డిసెంబర్ 15 నాటి నుంచి సర్క్యులర్ నిబంధనలను పాటించాలని బ్యాంకులను కోరింది. ఆ తర్వాత గడువు తేదీని 2022, మార్చి 15 వరకు పొడగించింది. "ఈ సేవలను డెబిట్ కార్డు లేని వారికి ఎన్‌పీసీఐ పేర్కొన్న విధంగా అందజేయడానికి బ్యాంకులు, చెల్లింపు సేవా సంస్థలకు తొమ్మిది నుంచి పన్నెండు నెలలు పట్టవచ్చు" నిపుణులు తెలిపారు. అయితే, ఈ సేవలు పూర్తిగా అందాలంటే, వినియోగారుడు బ్యాంకులో ఇచ్చిన మొబైల్ నెంబర్, ఆధార్ కార్డుకి లింకు చేసిన మొబైల్ నెంబర్ ఒకటే కావాల్సి ఉంటుంది. అప్పుడే ఈ సేవలు మీకు అందనున్నాయి.