చైనాలో ప్రతికూల పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో విదేశీ టెక్ దిగ్గజాలు ఒక్కొక్కటిగా అక్కడి నుంచి తప్పుకుంటున్నాయి. తాజాగా యాహూ కూడా చైనా మార్కెట్ నుంచి వైదొలిగింది. చైనాలో కార్యకలాపాలు కొనసాగించలేని విధంగా కఠినతరమైన పరిస్థితులు నెలకొనడమే ఇందుకు కారణమని పేర్కొంది. వాస్తవానికి ఇప్పటికే యాహూకి సంబంధించిన చాలా మటుకు సర్వీసులను చైనా నిలిపివేసింది.
దేశీ దిగ్గజాలు సహా టెక్నాలజీ కంపెనీలపై నియంత్రణను ప్రభుత్వం ఇటీవలి
కాలంలో మరింతగా పెంచుతోంది. ఈ పరిస్థితుల మధ్య చైనా నుంచి యాహూ
నిష్క్రమించడం కేవలం లాంఛనంగా మాత్రమే మిగిలింది. ‘చైనాలో వ్యాపార నిర్వహణ,
చట్టాల అమలుకు సంబంధించిన పరిస్థితులు కఠినతరంగా మారుతున్న నేపథ్యంలో
నవంబర్ 1 నుంచి మా సర్వీసులు అందుబాటులో ఉండవు‘ అని కంపెనీ ఒక ప్రకటనలో
తెలిపింది.
చైనా అతి పెద్ద మార్కెట్ అయినప్పటికీ కఠినతరమైన ప్రభుత్వ విధానాలకు లోబడి పనిచేయాల్సి రావడం టెక్ కంపెనీలకు సవాలుగా మారిన సంగతి తెలిసిందే. దీంతో అమెరికన్ టెక్ దిగ్గజం గూగుల్ చాన్నాళ్ల క్రితమే చైనా నుంచి తప్పుకుంది. మైక్రోసాఫ్ట్‌కి చెందిన ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫాం లింక్డ్‌ఇన్ సైతం తమ చైనా సైట్‌ను మూసివేస్తున్నట్లు గత నెలలోనే వెల్లడించింది.