Thursday, September 2, 2021

TRAI బ్రాడ్‌బ్యాండ్ కొత్త రూల్స్: వినియోగదారులు ఇప్పుడు 2Mbps కనీస స్పీడ్‌తో డేటాను పొందవచ్చు

 

కరోనా వైరస్ వ్యాప్తి తరువాత చాలా మంది ఇప్పటికి ఇంటి నుండి పనిచేస్తున్నారు. ఇటువంటి సమయంలో బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు కూడా అధికమయ్యాయి. అయితే స్టాండర్డ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌తో విశ్వసనీయమైన మరియు స్థిరమైన డేటా వేగంతో ఇంటి వద్ద నుండి పని చేయడం మరియు ఇంటి నుండి నేర్చుకోవడం వంటివి సర్వసాధారణంగా మారడం మరింత పెరిగింది. టెలికాం సెక్టార్ రెగ్యులేటర్ ఈ అవసరాన్ని చాలా బాగా అర్థం చేసుకుంది. ఇందులో భాగంగా బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ భారతదేశంలోని వినియోగదారులకు అందించే కనీస స్పీడ్ ను మరొకసారి అప్ గ్రేడ్ చేసింది. వినియోగదారులకు అందించే కనీస డేటా స్పీడ్ ను పెంచడానికి భారతదేశంలో బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్లకు ప్రోత్సాహకాలు లభిస్తాయని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) తెలిపింది.  


 

 బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు 2 Mbps కనీస డేటా స్పీడ్‌

TRAI వైర్డు బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ను బేసిక్, ఫాస్ట్ మరియు సూపర్ ఫాస్ట్ వంటి 3 విభిన్న కేటగిరీలుగా వర్గీకరించింది. అయితే వీటిలో బేసిక్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ వినియోగదారులకు కనీసం 2 Mbps నుంచి 50 Mbps వరకు డేటా స్పీడ్ ను అందిస్తుంది. అలాగే 'ఫాస్ట్' కనెక్షన్ 50 Mbps మరియు 300 Mbps మధ్య స్పీడ్ తో డేటాను అందిస్తుంది. చివరిగా 'సూపర్ ఫాస్ట్' కనెక్షన్ 300 Mbps మరియు అంతకంటే ఎక్కువ వేగంతో డేటాను అందిస్తుంది.

 

 లైసెన్స్ ఫీజు (LF) లో మినహాయింపు వాగ్దానం ద్వారా అధిక మొత్తంలో డేటా స్పీడ్ లను అందించడానికి ఆపరేటర్లను TRAI ప్రోత్సహించింది. ప్రస్తుతం ఫిక్స్‌డ్-లైన్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ISP లు) వారి ఆదాయాలపై 8% LF వసూలు చేస్తున్నారు. వినియోగదారులకు మరింత స్పీడ్ ను అందించడానికి కంపెనీలను ప్రోత్సహించడానికి ఇది త్వరలో తగ్గించబడుతుంది. బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌తో వినియోగదారులకు అందించే కనీస వేగం 512 Kbps. కానీ ఇప్పుడు TRAI బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ని పునర్నిర్వచించింది మరియు ఏ కనెక్షన్ తో అయిన వచ్చే కనీస వేగం 2 Mbps.

 భారతదేశంలో బ్రాడ్‌బ్యాండ్ వ్యాప్తి సాధ్యమైనంత వేగంగా పెంచాలని TRAI తెలిపింది. ప్రస్తుతం భారతదేశంలో ఫిక్స్‌డ్-లైన్ బ్రాడ్‌బ్యాండ్ వ్యాప్తి 55% వద్ద ఉంది. దీనిని పరిష్కరించడానికి గ్రామీణ వినియోగదారుల కోసం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ప్రోగ్రామ్‌ను పైలట్ చేయాలని సెక్టార్ రెగ్యులేటర్ సూచించింది. భారతదేశం మొత్తం డిజిటల్ దేశంగా మారడానికి దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో కూడా విశ్వసనీయ ఇంటర్నెట్ వేగంతో లభించే స్టాండర్డ్ లైన్ బ్రాడ్‌బ్యాండ్ అవసరం చాలా వరకు ఉంది.