Sunday, August 29, 2021

సొంత సూర్యుడ్ని సెట్‌ చేసేసుకున్నారు..... !

 అదో చిన్న ఊరు.. చుట్టూ పెద్ద పెద్ద కొండల మధ్య అందంగా ఉంటుంది.. కానీ ఆ ఊరిలో ఏడాదికి మూడు నెలలు అసలు ఎండ అనేదే పడదు. మధ్యాహ్నం రెండు, మూడు గంటల పాటు తప్పిస్తే.. మిగతా సమయంలో పగలూ, రాత్రీ తేడా తెలియదు. వందల ఏళ్లుగా ఇలాగే వెళ్లదీసిన స్థానికులు.. కొన్నేళ్ల కింద చిన్న ఆలోచనతో తమ ఊరికి మరో సూర్యుడ్ని తెచ్చేసుకున్నారు. ఇన్నిరోజులు పెద్దగా ఎవరికీ తెలియని ఈ విషయం.. ఓ టిక్‌టాకర్‌ చేసిన వీడియోతో వైరల్‌గా మారింది. మరి ఈ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా?
  

అద్దాల నుంచి ప్రతిఫలిస్తున్న వెలుగులో విగనెల్లా గ్రామం. (ఇన్‌సెట్‌లో) కొండపై ఏర్పాటు చేసిన అద్దాలు

 

 


ఏడాదికి మూడు నెలలు.. 
ఇటలీ ఉత్తర ప్రాంతంలోని అంట్రోనా లోయలో ఉన్న చిన్న ఊరే విగనెల్లా. రెండు, మూడు వందల మంది మాత్రమే ఉండే ఈ ఊరికి మూడు వైపులా పెద్ద కొండలు ఉంటాయి. అవి సూర్యరశ్మిని అడ్డుకోవడంతో.. ఏటా నవంబర్‌ 11వ తేదీ నుంచి ఫిబ్రవరి రెండో తేదీదాకా ఊరిలో ఎండ మొత్తానికే పడదు. కొండలపై పడ్డ ఎండ ప్రతిఫలించి (రిఫ్లెక్షన్‌) వచ్చే వెలుతురే వారికి దిక్కు. అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం.. 13వ శతాబ్దం నుంచీ అంటే ఎనిమిది వందల ఏళ్లుగా ఆ ఊరివాళ్లు ఇలాగే గడుపుతున్నారు. హా మూడు నెలల చీకటి తర్వాత ఎండపడటం మొదలయ్యే రోజున పండుగ చేసుకుంటారు.

చిన్న ఆలోచనే.. 
వరుసగా మూడు నెలల పాటు ఎండ పడకపోవడం, అదీ చలికాలం కావడంతో.. ఊరివాళ్లు శారీరకంగా, మానసికంగా ఇబ్బందిపడుతూనే వచ్చారు. ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి కొండలపై పడే ఎండను ఊరిపైకి రిఫ్లెక్ట్‌ చేయాలని 1999లో ఊరి మేయర్‌ మిడాలి ప్రతిపాదన చేశాడు. ఆర్కిటెక్ట్‌ బొంజాని, ఇంజనీర్‌ గియానీ ఫెరారీ కలిసి ఓ పెద్ద అద్దాన్ని కొండపై అమర్చి.. వెలుతురును ఊరిపై పడేలా ఓ డిజైన్‌ను సిద్ధం చేశారు. అయితే.. సూర్యోదయం నుంచి అస్తమయం దాకా సూర్యుడు కదులుతూనే ఉంటాడు. మరి అద్దం నుంచి వచ్చే వెలుగు ఊరిలో ఒకేచోట పడేదెలా అన్న సమస్య వచ్చింది. 

 


స్టీలు అద్దం.. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో.. 
మామూలు అద్దం అయితే పగిలిపోయే అవకాశం ఉంటుందని.. అత్యంత నున్నటి స్టీల్‌ అద్దాలను తెప్పించారు. ఎనిమిది మీటర్ల వెడల్పు, ఐదు మీటర్ల ఎత్తుతో వాటిని ఏర్పాటు చేసి.. ప్రత్యేకమైన కంప్యూటరైజ్డ్‌ మోటార్‌ వ్యవస్థకు అనుసంధానించారు. సూర్యుడి కదలికలకు అనుగుణంగా.. అద్దాల కోణాన్ని మార్చేలా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను వినియోగించారు. దీనితో స్టీలు అద్దాల నుంచి ప్రతిఫలించే ఎండ.. ఎప్పుడూ ఊరి మధ్యలో పడుతూ ఉంటుంది. 2006 డిసెంబర్‌ 17న ప్రారంభించిన ఈ వ్యవస్థకోసం.. అప్పుడే రూ.90 లక్షలు (లక్ష యూరోలు) ఖర్చయింది. నేరుగా ఎండ పడినట్టుగా కాకపోయినా.. తమ ‘కొత్త సూర్యుడి’తో చాలా ఇబ్బందులు తప్పాయని ఊరివాళ్లు చెప్తుంటారు. నాలుగు రోజుల కింద మనదేశానికి చెందిన కరన్‌ రాజన్‌ అనే వ్యక్తి ఈ ఊరి గురించి చేసిన టిక్‌టాక్‌ వీడియో వైరల్‌గా మారింది.

 

 మరో దేశానికీ స్ఫూర్తినిచ్చి.. 
భూమి ఉత్తర ధృవానికి దగ్గరగా ఉండే చాలా దేశాల్లో కూడా.. కొండలు, గుట్టల మధ్య ఉన్న గ్రామాల్లో ‘విగనెల్లా’ వంటి పరిస్థితే ఉంటుంది. నెలలకు నెలలు ఎండ పడదు. నార్వేలో అలా ఇబ్బందిపడుతున్న జుకాన్‌ అనే ఊరివాళ్లు.. విగనెల్లాను స్ఫూర్తిగా తీసుకుని 2013లో అద్దాల వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు.