వాట్సాప్‌ను వేదికగా చేసుకుని ఇటీవల స్కామ్ మెసేజ్‌లు ఎక్కువగా వస్తున్నాయి. మీకు 'పింక్ వాట్సాప్' కావాలా? అంటూ ఈ మధ్య ఒక లింక్ హల్‌చల్ చేసింది. చాలామంది ఈ లింక్ క్లిక్ చేసి వ్యక్తిగత సమాచారాన్ని పోగొట్టుకున్నారు. ఈ స్పామ్ స్కామ్ ఇంకా సద్దుమణగక ముందే మరోసారి మాల్వేర్.. బయటికొచ్చింది. అయితే ఈసారి మెసేజ్‌ల రూపంలో వస్తున్నాయి. ఈ మాల్‌వేర్ పేరు 'ప్లూ బాట్'. అసలేంటీ ఫ్లూబాట్, ఎలా వస్తుంది, వస్తే ఏం చేయాలో చూద్దాం!
పైన ఫొటో చూశారా.. ఏదో కొరియర్ సంస్థ నుంచి వచ్చిన మెసేజ్‌లా ఉంది కదా. ఇలాంటి మెసేజ్‌లతోనే ఫ్లూబాట్ మొబైల్స్‌పైకి దాడి చేస్తోంది. చూడటానికి కొరియర్ సంస్థ ట్రాకింగ్ మెసేజ్‌లా కనిపిస్తోంది. ఈ మెసేజ్ నిజమే అనుకొని ట్రాకింగ్ చేద్దామని క్లిక్ చేస్తే మీ మొబైల్‌లోకి ఓ ఏపీకే డౌన్‌లోడ్ చేయాలా అని అడుగుతుంది. పొరపాటునో, ఏమరపాటునో ఆ ఏపీకేను మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకుంటే ఇక మీ సమాచారం హ్యాకర్ల ఇంటి ముందు పెట్టినట్లే. స్పెయిన్, బ్రిటన్, జర్మనీ, పోలెండ్ దేశాల్లో ప్రస్తుతం ఈ సమస్య గుర్తించారు.
యాప్ డౌన్‌లోడ్ అయ్యాక మీ మొబైల్‌లో కాంటాక్ట్‌లు, మెసేజెస్, కాల్ హిస్టరీ అన్నింటి యాక్సెస్ అడుగుతుంది. అవన్నీ ఇస్తే కానీ ఆ యాప్ పని చేయదు కాబట్టి.. కొంతమంది యాక్సెస్ ఇచ్చేస్తున్నారు. దీంతో మొబైల్‌లోని కీలక సమాచారం హ్యాకర్ల చేతికి చేరిపోతోంది. ఈ ఫ్లూబాట్ ముఖ్య ఉద్దేశం మీ మొబైల్‌లో నెట్‌బ్యాంకింగ్ యాప్స్ వివరాలు కొట్టేయడమే. మీరు వివరాలు ఇచ్చి యాప్ ఓపెన్ అవ్వగానే అది తన పని మొదలెట్టి మీ వివరాలు హ్యాకర్లకు ఇచ్చేస్తుందట.
ఫ్లూబాట్ నుంచి రక్షణ ఇలా..
ఇంతటి ఇబ్బందికరమైన ఫ్లూబాట్ నుంచి రక్షణ ఎలా.. అంటే పాత సమాధానమే వస్తుంది. అదే యాప్‌లు డౌన్‌లోడ్ అనేది కేవలం ప్లేస్టోర్/యాప్ స్టోర్ నుంచి మాత్రమే చేయాలి. ఏ ఇతర లింక్స్ ద్వారా వచ్చే యాప్‌లు సురక్షితం కావు. తెలిసిన వ్యక్తే కదా పంపించాడు అనుకుని ఎప్పుడూ యాప్‌లు డౌన్‌లోడ్ చేయకూడదని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ పొరపాటున డౌన్‌లోడ్ చేసి ఉంటే వెంటనే మొబైల్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేయాల్సి ఉంటుంది.
ముందు చెప్పినట్లు ప్రస్తుతం ఈ సమస్య ప్రస్తుతం స్పెయిన్, బ్రిటన్, జర్మనీ, పోలెండ్ దేశాల్లో ఉంది. సమస్య అక్కడిది కదా అని మనం తేలిగ్గా తీసుకోకుండా ఇలాంటి లింక్‌లు వస్తే క్లిక్ చేయకుండా ఉండటం మంచిది. అన్నట్లు ఇప్పటికే మన దేశంలో ఇలాంటి మెసేజ్‌లు చాలా బయటకు వచ్చాయి. కాబట్టి ఈ కొరియర్ మెసేజ్‌ల మాల్‌వేర్ కూడా రాకూడదని లేదు.