Sunday, October 4, 2015

తెలంగాణ డాక్టర్లకు జీతాలివ్వం


Health-card



తెలంగాణలోని ఆంధ్ర ఉద్యోగుల మీద ఈగ వాలినా గగ్గోలు పెట్టే ఏపీ తన వద్ద పనిచేసే తెలంగాణ ఉద్యోగులకు మాత్రం దిక్కు దివాణం లేకుండా చేస్తున్నది. అన్ని నిబంధనలు కాలరాస్తున్నది. తాజాగా తమకు కేటాయించిన 120 మంది తెలంగాణ పీజీ డాక్టర్లకు జీతాలివ్వబోమని తేల్చి చెప్పింది. మీరు స్థానికేతరులు కాబట్టి జీతాలిచ్చేది లేదు అంటూ తేల్చి చెప్పింది. ఏపీ చర్యతో ఆ డాక్టర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వివరాలివి.. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు 2013 ఆగస్టులో 600 మంది వైద్య విద్యార్థులు పీజీ (ఇన్‌సర్వీస్)ల్లో చేరారు. ఇందులో డిప్లొమాకు 250 మంది, డిగ్రీ (ఎండీ) చదివేవారు 350 మంది ఉన్నారు.

వీరందరికీ స్టేట్ హెల్త్ ఎడ్యుకేషన్ బ్యూరో (షెబ్) ద్వారా జీతభత్యాలు అందించేవారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 58 : 42 నిష్పత్తిలో వీరిని కూడా జీవోఎంఎస్ నం.241, తేదీ 1.6.2014 ప్రకారం విభజించి ఇరు రాష్ర్టాలకు కేటాయించారు. మొత్తం 600 పీజీ వైద్యుల్లో పీజీ, డిప్లొమా కలిపి ఏపీకి 350 మంది, తెలంగాణకు 250 మంది వచ్చారు. వాస్తవానికి వీరందరూ మెరిట్ ప్రకారం పీజీ కోర్సుల్లో చేరారు. ఇలా 58ః42 నిష్పత్తిలో జరిగిన పంపకాల్లో ఏపీకి వెళ్ళిన 350 మంది పీజీ డాక్టర్లలో 120 మంది తెలంగాణవారున్నారు.

ఇదిలాఉంటే 2015 జులై 10న ఏపీ ప్రభుత్వం (వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ) జీవోఎంఎస్ నం. 67ను జారీ చేసింది. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య పేరిట ఈ ఉత్తర్వులు విడుదలయ్యాయి. దీని ప్రకారం ఏపీలో పీజీ డాక్టర్లుగా కోర్సు చేస్తున్న 120 మంది తెలంగాణ స్థానికులుగా గుర్తించామని, వారికి ఏపీ ప్రభుత్వం జీతాలు చెల్లించదని అందులో స్పష్టం చేశారు. ఇంతటితో ఆగకుండా పీజీ వైద్యుల పునర్విభజన జరగాలని ఏపీ కొర్రీ పెట్టింది. ఇపుడు ఏపీలో ఉన్న 120 మందిని తెలంగాణకే కేటాయించాలంది. ఈ ఆదేశంతో గడిచిన జులై నుంచి 120 మంది పీజీ డాక్టర్లకు జీతభత్యాలు అందటం లేదు.

కక్ష సాధింపు చర్యే..: రాష్ట్రం ఏర్పడి సంవత్సరం అయిన తరువాత ఇపుడు అకస్మాత్తుగా జీతాలివ్వడం ఆపివేయటం వెనుక కక్ష సాధింపు ధోరణి ఉందని పీజీ వైద్యులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ విద్యుత్‌శాఖలో ఏపీ స్థానికులను ఏపీకి కేటాయించిన విషయంలో ఎదురవుతున్న ఓటమికి ఇది ప్రతీకార చర్యగా వారు భావిస్తున్నారు.

అనేక సమస్యలు..: ఏపీ చర్యవల్ల జీతభత్యాలకే కాకుండా ఇతర సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. తెలంగాణ స్థానికులని గుర్తించిన 120 మందిలో 40 మంది డిప్లొమా చేస్తున్నవారు ఉన్నారు. వీరి కోర్సు అయిపోయింది. ఆగస్టులో తెలంగాణ ప్రభుత్వం వీరికి పోస్టింగులు ఇచ్చింది. నిబంధనల ప్రకారం పోస్టులో జాయిన్ అయి జీతభత్యాలు తీసుకోవాలంటే ఎల్‌పీసీ (లాస్ట్ పే సర్టిఫికెట్) దాఖలుపర్చాల్సి ఉంటుంది. జులై నుంచి వారికి జీతభత్యాలే ఇవ్వకపోవడంతో ఎల్‌పీసీ ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలో వారికి తెలియడం లేదు. అలాగే 120 మంది పీజీ కోర్సు చేస్తున్నవారికి ఇటు తెలంగాణ సర్కారు ప్రకటించిన తెలంగాణ ఇంక్రిమెంట్, పీఆర్సీ బకాయిలు అందడం లేదు. ఏపీలో పనిచేస్తున్నప్పుడు ఎమర్జెన్సీ అలవెన్సు కింద ఇచ్చే రూ. 3 వేలకు కోత వేశారు.

దీనికితోడు సమైక్య రాష్ట్రంలో దరఖాస్తు చేసుకున్న ఉద్యోగుల హెల్త్ కార్డులను అక్కడ పనిచేస్తున్న కాలంలో ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. జులైకి ముందు వారి జీతభత్యాల నుంచి ప్రీమియం కట్ చేసుకుంది. ఇప్పుడు ఆ కార్డులు తెలంగాణలో చెల్లవు. ఇంకా పీజీ కోర్సు చేస్తున్న సుమారు 80 మంది వైద్యులు (ఎండీ) వారి కోర్సు పూర్తిచేయడంపై ఈ ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ సమస్యను మొగ్గలోనే పరిష్కరించాలంటే ముఖ్యమంత్రి స్థాయిలో దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యార్థులు కోరుతున్నారు.