Thursday, October 1, 2015

తెలంగాణ చరిత్ర



తెలంగాణ చరిత్ర

1956లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు భౌగోళిక విభాగాలలో తెలంగాణా ఒకటి. ఈ ప్రాంతం 1948 సెప్టెంబరు 17న నిజాం పాలన నుంచి విముక్తి చెంది హైదరాబాదు రాష్ట్రంగా ఏర్పడి, 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా కన్నడ, మరాఠి మాట్లాడే ప్రాంతాలు కర్ణాటక, మహారాష్ట్రలకు వెళ్ళిపోగా, తెలుగు భాష మాట్లాడే జిల్లాలు ఆంధ్రరాష్ట్రంతో కలిసి ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడింది. ప్రస్తుతము తెలంగాణ ప్రాంతములో 10 జిల్లాలు కలవు. భౌగోళికంగా ఇది దక్కను పీఠభూమిలో భాగము. దేశంలోనే పొడవైన 7వ (కొత్త పేరు 44వ) నెంబరు జాతీయ రహదారి మరియి 9వ నెంబరు (పూనె-విజయవాడ) జాతీయ రహదారి, హైదరాబాదు-భూపాలపట్నం జాతీయ రహదారి,  తెలంగాణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తరాన మహారాష్ట్ర సరిహద్దు నుంచి దక్షిణాన రాయలసీమ ప్రాంతం వరకు, పశ్చిమాన కర్ణాటక సరిహద్దు నుంచి తూర్పున ఆంధ్ర ప్రాంతం వరకు విస్తరించియుంది. తెలుగులో తొలి తెలుగు రామాయణ కర్త గోన బుద్దారెడ్డి, సహజకవి బమ్మెరపోతన, దక్షిణా భారతదేశంలో తొలిమహిళా పాలకురాలు రుద్రమదేవి,  ప్రధానమంత్రిగా పనిచేసిన పివి.నరసింహారావు తెలంగాణకు చెందినవారు. చకాకతీయుల కాలంలో వైభవంగా వెలుగొందిన భూభాగమిది. రామాయణ-మహాభారతం కాలానికి చెందిన చారిత్రక ఆనవాళ్ళున్న ప్రదేశమిది. తెలంగాణ మొత్తం వైశాల్యం 114,840 చకిమీ, కాగా 2011 లెక్కలప్రకారం జనాభా 35,286,757 (రాష్ట్ర జనాభాలో 41.6%)గా ఉంది. 17లోకసభ స్థానాలు, 119 శాసనసభ స్థానాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ లో 5వ శక్తిపీఠం, భద్రాచలంలో ప్రముఖమైన రామాలయం, బాసరలో సరస్వతీ దేవాలయం ఉన్నాయి.

 భౌగోళిక స్వరూపము - నదులు


తెలంగాణ ప్రాంతము దక్కను పీఠభూమిలో  భాగంగా, తూర్పు కనుమలకు పశ్చిమంగా ఉన్నది. ఈ ప్రాంతము సరాసరిన సముద్రమట్టం నుంచి 1500 అడుగుల ఎత్తును కలిగియుండి తూర్పు వైపునకు వాలి ఉంది. తెలంగాణాలో దక్షిణ భాగంలో ప్రధానముగా కృష్ణా, తుంగభద్ర నదులు ప్రవహిస్తుండగా, ఉత్తర భాగంలో గోదావరి నది ప్రవహిస్తున్నది. కృష్ణా, తుంగభద్ర నదులు దక్షిణమున ఈ ప్రాంతాన్ని రాయలసీమ నుంచి వేరుచేస్తున్నవి. ఈ ప్రాంతం విస్తీర్ణం 1,14,840 చదరపు కిలోమీటర్లు. భౌగోళికంగా మహబూబ్ నగర్ జిల్లా పెద్దది కాగా, హైదరాబాదు చిన్నది. ఈ ప్రాంతానికి సముద్రతీరం లేదు. రాష్ట్రం మొత్తంగా చూస్తే కృష్ణానది పరీవాహకప్రాంతంలో 69%, గోదావరి నది పరీవాహకప్రాంతంలో 79% ఈ ప్రాంతంలోనే ఉంది.

నదులు


గోదావరి, కృష్ణా నదులతో సహా పలు నదులు తెలంగాణలో ప్రవహిస్తున్నాయి. గోదావరి నది ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దుల గుండా ప్రవహిస్తుంది. కృష్ణా నది మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల దక్షిణ భాగం నుంచి ప్రవహిస్తుంది. తుంగభద్రనది మహబూబ్‌నగర్ జిల్లా దక్షిణ సరిహద్దు గుండా ప్రవహిస్తూ కృష్ణానదిలో సంగమిస్తుంది. భీమా నది మహబూబ్‌నగర్ జిల్లాలో కొంత దూరం ప్రవహించి కృష్ణాలో సంగమిస్తుంది. దుందుభి నది మహబూబ్‌నగర్ మరియు నల్గొండ జిల్లాలలో ప్రవహించి కృష్ణానదిలో కలుస్తుంది. ప్రాణహిత నది ఆదిలాబాదు జిల్లా సరిహద్దు గుండా ప్రవహించి గోదావరిలో సంగమిస్తుంది. మూసీ నది రంగారెడ్డి, హైదరాబాదు మరియు నల్గొండ జిల్లాలలో ప్రవహించి కృష్ణానదిలో కలుస్తుంది. పాలేరు నది నల్గొండ, ఖమ్మం జిల్లాల సరిహద్దు గుండా ప్రవహించి కృష్ణాలో విలీనమౌతుంది. కాగ్నా నది  రంగారెడ్డి జిల్లాలో పశ్చిమం దిశగా ప్రవహించి కర్ణాటకలో కృష్ణాలో సంగమిస్తుంది. మంజీరా నది మెదక్, నిజామాబాదు జిల్లాలలో ప్రవహించి గోదావరిలో కలుస్తుంది.

తెలంగాణ చరిత్ర ఎలా చదవాలి?

మొదటి దశలో (1948-1970)
అసఫ్‌జాహీల కాలం నాటి సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక రాజకీయ పరిస్థితులు, భౌగోళిక అంశాలు కలవు. తెలంగాణ ప్రజలు, కులాలు, మతాలు, కళలు, పండుగలు, భాషలు 1948-52 కాలంలో పరిపాలనా విధానం నిజాం రాజుల ప్రధాని సాలార్‌జంగ్‌ సంస్కరణలు ముల్కీ (లోకల్‌), నాన్‌ ముల్కీ ఉద్యమాల గురించి చదవాలి.
పై అంశాలు ఒక మెట్టు అయితే 2వ మెట్టుగా భూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా వారి మంత్రివర్గం 1952లో ముల్కీ, నాన్‌ ముల్కీ ఉద్యమాలు, 1953లోనే తెలంగాణ, తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌పై చర్చ, రాష్ట్రాల పునర్విభజన కమిటీ, ఫజల్‌ అలీ కమిటీ, సూచనలు, 1956లో జరిగిన (ఫిబ్రవరి 20న) పెద్దమనుషుల ఒప్పందం, అందులో అంశాలు ఉల్లంఘనలు 1969లో జై తెలంగాణా ఉద్యమం, అష్టసూత్రాలు, అయిదు సూత్రాలు. వాటి ప్రభావం ఎలా ఉంది, మొదలైన అంశాలు చదవాలి. ఇంకా తెలంగాణ ప్రజా సమితి ఏర్పాటు అంశం, జిఒ నెం. 36, 8, 5 సూత్రాల పథకాలు తెలుసుకోవాలి.
II 1971-90 దశ
ఇది కొంచం కష్టమైన అంశం. అభ్యర్థులు దీని కోసం కష్టపడాల్సి ఉంటుంది. జై ఆంధ్ర ఉద్యమం 1973లో రాష్ట్రపతి పాలన, షట్‌(6)సూత్ర పథకం తెలంగాణకు వ్యతిరేకంగా జరిగిన చర్యలు. రాష్ట్రపతి ఆజ్ఞలు, 1973 రాష్ట్రపతి పాలన మొదలైన అంశాలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. భారత రాజ్యాంగం 312వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్‌ 371.డిలోని, జిఒ-610, ఉల్లంఘనలు పర్యవసానంగా నక్సలైట్ల ఉద్యమం, భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు, రైతుకూలీ ఉద్యమాలు, గిరిజనుల భూముల ఆక్రమణలు, ఆదివాసీల తిరుగుబాటు, నీరు, భూమి, అడవుల చరిత్రను తెలుసుకోవడం.
1980లో ఎన్‌టిఆర్‌ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు తెలంగాణలో వచ్చిన అనేక రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక మార్పులు-తెలంగాణ అనే భావాన్ని అణచివేయడానికి (ఆంధ్రుల విచక్షణతో కూడిన పాలన) భాషా సంస్కృతులపై దాడి తదితర అంశాలపై అవగాహన అవసరం.
1990లో ప్రపంచంలో అనేక మార్పులు వచ్చాయి. అవి గ్లోబలైజేషన్‌ (ప్రపంచీకరణ), లిబరలైజేషన్‌(సరళీకరణ), ప్రైవేటైజేషన్‌ (ప్రైవేటీకరణ) విధానాలతో తెలంగాణలో వచ్చిన మార్పులు. అనేక రంగాల్లో వచ్చిన ప్రాంతీయ అసమానతలు (ఉదాహరణ :- వ్యవసాయ రంగం, చేతివృత్తుల రంగం) వాటి ప్రభావం గురించి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది.
III. మూడో దశ (1991-2014)తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకూ:
ఈ దశ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో చాలా కీలకమైన దశ. గ్రూప్స్‌కు ప్రిపేరయ్యే అభ్యర్థులు 1991 నుండి 2014 వరకూ వరకు ఉన్న దశను క్షుణ్ణంగా, జాగ్రత్తగా చదవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు (1990-2014) గురించి అభ్యర్థులు బాగా లోతుగా చదవాలి. ఆ కాలంలో ఏర్పడిన సంస్థల గురించి, రాజకీయ పార్టీల గురించి తెలుసుకోవాలి.
టిఆర్‌ఎస్‌ :
ఉద్యమాలను తేదీల వారీగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అందుకు గ్రంథాలయాలకు వెళ్లి ఉద్యమ కాలం నాటి దినపత్రికలను తప్పకుండా తిప్పివేయాలి. ప్రజాశక్తి, నమస్తే తెలంగాణ, సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతిలను చదవాలి. తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమాల కోసం, ఆ ఉద్యమాల ప్రభావం ప్రజలపై ఎలా ఉంది, ఆంధ్రుల పక్షపాత పరిపాలన అంశాల అవగాహనకు తప్పనిసరిగా దినపత్రికలే శరణ్యం. తెలంగాణ ఐక్యవేదిక, భువనగిరి వేదిక, వరంగల్‌ సభ, తెలంగాణ మహాసభ, తెలంగాణ విద్యార్థుల ఐక్యవేదిక మొదలైన అంశాలు కూడా ఇందులోకి వస్తాయి. 2001 లో కెసిఆర్‌ టిఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పాటు చేయడానికి దారి తీసిన పరిస్థితులు, తెలంగాణకు వ్యతిరేక పవనాలు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో, కెసిఆర్‌ 2009లో ఆమరణ నిరాహార దీక్ష (నవంబర్‌-29), అప్పటి కేంద్ర హౌంమంత్రి చిదంబరం డిసెంబర్‌-9న చేసిన తెలంగాణ ప్రకటన వరకూ క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది.
తెలంగాణలో పునరుజ్జీవన సాహిత్యం, కళలు, కవులు, రచయితలు, మేధావులు,
ఉద్యోగులు, కళాకారులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, మహిళలు మొదలైనవారి పాత్రలను గురించి కూడా చదవాలి.
సకలజనుల సమ్మె, మిలియన్‌ మార్చ్‌, సాగరహారం, సడక్‌ బంద్‌, పల్లెపల్లెకు మార్చ్‌, కేంద్రం ప్రకటన, పార్లమెంట్‌, అఖిలపక్ష సమావేశం, (తెలంగాణ ప్రకటన సోనియాగాంధీ), ఏపి రాష్ట్ర పునర్విభజన బిల్లు 2014 ఆమోదం, అంతకుముందు లగడపాటి దుశ్చర్యలు (పెప్పర్‌ స్ప్రే), ఆ తదుపరి ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ పార్టీ ఘన విజయం వంటి అంశాలను అధ్యయనం చేయాలి.