Tuesday, June 23, 2015

జగమంత యోగా.. గిన్నిస్‌లో జాగా


jagamanta  yoga.. ginnislo  jaaga

యోగా.. ప్రపంచమంతా పఠిస్తున్న జపం. 5 వేల ఏండ్లకింద భారత్‌లో ఆవిర్భవించిన ఈ శక్తి.. అంతర్జాయతీయ యోగా దినోత్సవంతో విశ్వమంతా వ్యాపించింది. ఏకంగా 177 దేశాలు యోగా ఔన్నత్యానికి వినమ్రంగా తలవంచాయి. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి నుంచి ఈఫిల్ టవర్ వరకు, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, సియాచిన్ నుంచి దక్షిణ చైనా సముద్రం వరకు యోగా జయకేతనం ఎగురువేసింది. ఆదివారం ఈ చరిత్రాత్మక ఘట్టానికి భారత్ నాయకత్వం వహిస్తూ.. దేశంలో కనీవిని ఎరుగని రీతిలో యోగా కార్యక్రమాలు నిర్వహించింది. ప్రధాని నరేంద్రమోదీ సహా 35వేలమంది ఒకేసారి యోగాభ్యాసం చేయడంతో దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌పథ్ యోగాపథ్‌గా మారింది. ఇంత పెద్దఎత్తున ప్రజలు ఒకేసారి యోగా చేయడం, అందులోనూ 84 దేశాలకు చెందిన జాతీయులు పాల్గొనడంతో రెండు గిన్నిస్ రికార్డులు సొంతమయ్యాయి. -రెండు రికార్డులు సొంతం -చరిత్రాత్మక ఘట్టానికి భారత్ నాయకత్వం -ఢిల్లీలో యోగాపథ్‌గా మారిన రాజ్‌పథ్ -దేశవిదేశాల్లో ఉత్సాహంతో యోగాభ్యాసం -ప్రపంచశాంతికి ఇది నాంది: ప్రధాని నరేంద్రమోదీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రం సియాచిన్‌లో మైనస్ 4 డిగ్రీల చలిలో కూడా భారత సైనికులు యోగా దినోత్సవాన్ని జరుపుకొన్నారు. యోగా డేను పురస్కరించుకుని ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ ప్రపంచ శాంతి, సమైక్యతను నెలకొల్పడానికి కొత్త శకం ఆరంభమైందన్నారు. ఈ రోజు యోగా దినోత్సవంతో మానవ మేధస్సుకు శిక్షణ అందించే కార్యక్రమానికి నాంది పలికామని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా 200కోట్ల మంది యోగా దినోత్సవాన్ని జరుపుకొనడం గొప్ప విషయమని.. ఇదంతా భారత్ గొప్పతనమేనని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ కొనియాడారు. న్యూఢిల్లీ, జూన్ 21: కుల, మత, వర్ణ, దేశాలు, ప్రాంతీయాల కతీతంగా యోగా ఔత్సాహికులంతా చారిత్రక ఘట్టానికి సాక్ష్యంగా నిలిచారు. అంతర్జాతీయ తొలి యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచమంతా యోగా కేంద్రంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో వర్షాన్ని, వాతావారణ ప్రతికూల పరిస్థితులను, పలు ప్రాంతాల్లో వెల్లువెత్తిన నిరసనల్ని పక్కనబెట్టి ఆదివారం ఉదయమే ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది యోగా ఔత్సాహికులు చాపలు, ఇతర సామాగ్రిని చేతబట్టుకొని ఉత్సాహంతో తమ తమ ప్రాంతాలకు చేరుకున్నారు. పార్కులు, చర్చిలు, నివాసాలు, మిలటరీ స్థావరాలు, గగన తలాలతోపాటు విశ్వవ్యాప్తంగా 44 ఇస్లామిక్ దేశాలతోపాటు 177 దేశాల్లో జరిగిన అంతర్జాతీయ యోగా ఉత్సవాలకు భారత్ నాయకత్వం వహించింది. ప్రాచీన సంప్రదాయ యోగాసనాలు, విన్యాసాలతో ఆకట్టుకున్నారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి కార్యాలయం నుంచి ఈఫిల్ టవర్ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు.., సియాచిన్ నుంచి దక్షిణ చైనా సముద్రం వరకు.. ప్రపంచశాంతిని, సమగ్రత, ఐక్యతను చాటిచెప్పారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు, రాజకీయవేత్తలు, అధికారులు, త్రివిధ దళాలు, రైల్వే, కార్పొరేట్ సంస్థలు, వ్యాపార వర్గాలు మెగా ఈవెంట్‌లో పాలుపంచుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ యోగా డే వేడుకల్ని ప్రారంభించారు. ఆధునిక జీవిన విధానంలో తలెత్తే శారీరక వైకల్యాన్ని అధిగమించే అద్భుతమైన శక్తి యోగాకు ఉందని ప్రణబ్ పేర్కొన్నారు. ఎన్నో శతాబ్దాల నుంచి యోగా సాధనకు భారత్ ప్రధాన కేంద్రమని అన్నారు. దేశరాజధాని ఢిల్లీలో రాజపథ్‌లో 37 వేల మందితో నిర్వహించిన మెగా యోగా ఈవెంట్‌ను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన అతిపెద్ద యోగా శిబిరం రెండు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులను సొంతం చేసుకున్నది. భారీ సైజులో ఏర్పాటు చేసిన డిజిటల్ స్కీన్లపై హిందీ, ఆంగ్ల భాషల్లో యోగాసనాలకు సంబంధించిన సూచనల్ని ఇచ్చారు. ఈ కార్యక్రమం సందర్భంగా రిపబ్లిక్ పరేడ్ వేడుకల మాదిరిగానే రాజ్‌పథ్ చుట్టుపక్కల దాదాపు ఐదువేల మంది భద్రతాసిబ్బందితో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఆంక్షల్ని విధించారు. రాజ్‌పథ్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ముస్లింలు పాల్గొన్నారు. రంజాన్ ఉపవాసాలు పాటిస్తున్నా.. ఈ వేడుకకు హాజరుకావడం విశేషం. యోగా దినోత్సవం సందర్భంగా ఆయుష్‌శాఖ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో తపాల బిళ్లలను, రూ.10, రూ.100 నాణేలను ప్రధాని మోదీ విడుదల చేశారు. పలురాష్ర్టాల్లో కేంద్ర మంత్రులు: తెలంగాణ, ఏపీ మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్, కేరళ, తమిళనాడు, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, పలు రాష్ర్టాల్లో నిర్వహించిన వేడుకల్లో భారీసంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. రాష్ర్టాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో కేంద్రమంత్రులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. హైదరాబాద్‌లో సంజీవయ్యపార్కులో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్రమంత్రులు జేపీ నడ్డా, దత్తాత్రేయ, లక్నోలో హోంమంత్రి రాజ్‌నాథ్, కోచీలో రైల్వేమంత్రి సురేశ్ ప్రభు, కోల్‌కతాలో హర్షవర్థన్, రవిశంకర్ ప్రసాద్, చెన్నైలో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ప్రధాని మోదీ వేసిన ఆసనాలు ఇవే... ఉదయమే చాపతో రాజ్‌పథ్‌కు వచ్చిన ప్రధాని మోదీ మొత్తం 21 అసనాలు వేశారు. పాదహస్త ఆసనం, అర్థచక్ర ఆసనం, త్రికోణాసనం, దండాసనం, అర్థ ఉష్ట్రాసనం, వజ్రాసనం, శశాంకాసనం, విక్రాసనాలను వేశారు. సెల్ఫీలకు ప్రధాని నో...: ఏ కార్యక్రమం జరిగినా.. సందర్శకులతో ఎప్పుడూ మొబైల్ ఫోన్లలో సెల్ఫీ ఫోటోలకు ఫోజిచ్చే ప్రధాని మోదీ ఈసారి అలాంటి కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. తన ప్రసంగం తర్వాత యోగా కోసం ముందు వరుసలో ఏర్పాటు చేసిన తన స్థానానికి చేరుకున్న మోదీ.. ఓ మహిళా వాలంటీర్ సెల్ఫీ దిగడానికి రాగా.. ముకులిత హస్తాలతో ఆమె విజ్ఞప్తిని నిరాకరించారు. సియాచిన్‌లో సైనికుల యోగా విన్యాసాలు ఏడాది పొడుగునా మంచు దుప్పటి పరుచుకున్నట్లు కనిపించే సియాచిన్ యుద్ధ స్థావరంలో త్రివిధ దళాలకు చెందిన భారత సైనికులు యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. సముద్ర మట్టానికి 18800 అడుగుల ఎత్తైన ప్రదేశంలో.. మైనస్ 4 డిగ్రీల వాతావారణాన్ని తట్టుకునేలా ప్రత్యేక దుస్తులు ధరించి సైనికులు యెగా కార్యక్రమాల్ని నిర్వహించారు. లడఖ్, కార్గిల్‌తోపాటు దక్షిణ చైనా సముద్ర ప్రాంతమంతా విస్తరించిన సైనిక దళాలకు చెందిన సిబ్బంది యోగాసనాలు వేశారు. మెగా ఈవెంట్‌కు రెండు గిన్నిస్ రికార్డులు రాజ్‌పథ్‌లో నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమానికి గిన్నిస్‌బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు లభించింది. ఒకే ప్రదేశంలో 84 దేశాలకు చెందిన జాతీయులతోపాటు 35,985 మంది పాల్గొన్న ఈ కార్యక్రమం రెండు రికార్డు సొంతం చేసుకున్నది. ఈ రికార్డులను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్సు వెరిఫికేషన్ గ్లోబల్ హెడ్ మార్కో ఫ్రిగట్టి ధ్రువీకరించారు. ఒకే రోజు రెండు రికార్డులను సొంతం చేసుకోవడం దేశానికి గర్వ కారణమని కేంద్ర ఆయుష్‌శాఖ మంత్రి శ్రీపాదనాయక్ మీడియాతో అన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ప్రతి ఒక్కరిని మోదీ అభినందించారు. 2005 నవంబర్ 19న గ్వాలియర్‌లోని జీవాజి వర్సిటీలో వివేకానంద కేంద్రం పర్యవేక్షణలో 362 పాఠశాలలకు చెందిన 29,973 మంది విద్యార్థులు 18 నిమిషాలపాటు యోగాసనాల కార్యక్రమం గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కింది.