పూర్తి స్వదేశీపరిజ్ఞానంతో తయారీ -ప్రారంభించిన రక్షణమంత్రి అరుణ్‌జైట్లీ విశాఖపట్నం, ఆగస్టు 23: రక్షణ రంగంలో స్వదేశీ పరిజ్ఞానానికి పెద్దపీట వేసి దేశీయ సంస్థలతోనే యుద్ధనౌకలు, ఆయుధవ్యవస్థలు తయారు చేయిస్తామని కేంద్ర రక్షణశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన యాంటీ సబ్‌మెరైన్ స్టెల్త్ యుద్ధనౌక ఐఎన్‌ఎస్ కమోర్తను శనివారం విశాఖపట్నంలోని నేవల్ డాక్‌యార్డులో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ దేశరక్షణకు అవసరమైన అన్ని పరికరాలు పూర్తిగా స్వదేశీపరిజ్ఞానంతోనే తయారుచేయాలన్నది భారత్ సంకల్పం. ఆ క్రమంలోనే రూపొందిన ఐఎన్‌ఎస్ కమోర్తా దేశానికి సుదీర్ఘకాలంపాటు సేవలందిస్తుందన్న నమ్మకం నాకుంది. భౌగోళికంగా భారత్ చాలా కీలకప్రదేశంలో ఉంది. దేశానికి తీరప్రాంతం కూడా చాలా ఎక్కువ. ఇరుగుపొరుగు దేశాలతో సంబంధాలు దెబ్బతిన్న చరిత్ర కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో శాంతి నెలకొనాలంటే.. భారత్ సైనికపరంగా సర్వసన్నద్ధంగా ఉండ డం తప్పనిసరి అని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు రక్షణ ఉత్పత్తుల విషయంలో అతిపెద్ద కొనుగోలుదారుగా ఉన్న భారత్.. ఇకపై అతిపెద్ద ఉత్పత్తిదారుగా మారాల్సిన సమయం వచ్చిందన్నారు. ప్రస్తుతం అత్యాధునిక యుద్ధనౌకల తయారీలో ప్రభుత్వ రంగంలోని షిప్‌యార్డులకు, ప్రైవేటు రంగంలోని షిప్‌యార్డులు గట్టిపోటీ ఇస్తున్నాయని, ఇది ఆహ్వానించదగ్గ పరిణామమని అరుణ్‌జైట్లీ చెప్పారు. డైరెక్టరేట్ ఆఫ్ నేవల్ డిజైన్ (డీఎన్‌డీ) ఈ నౌకను డిజైన్ చేయగా, కోల్‌కతాలోని ప్రభుత్వరంగసంస్థ గార్డెన్‌రీచ్ షిప్‌బిల్డర్స్‌లో నిర్మించారు. ఇందులోని ఆయుధ వ్యవస్థలతోపాటు, కీలకమైన సెన్సర్లు అన్నీ పూర్తి స్వదేశీపరిజ్ఞానంతోనే తయారయ్యాయి. ఇందులో ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించగలిగిన స్వల్పశ్రేణి క్షిపణులు (సామ్), రేవతి రాడార్, యాక్టివ్ టోవ్‌డ్ అరే డెకాయ్ సిస్టమ్( ఏటీడీఎస్)తో పాటు ఒక హెలికాప్టర్ కూడా ఉంటుంది.