Saturday, January 24, 2015

వాటర్‌గ్రిడ్‌కు నిధులివ్వండి

రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా రక్షిత తాగునీటిని సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్ట తలపెట్టిన ప్రతి ష్టాత్మక వాటర్‌గ్రిడ్‌ ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో సగాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాలని తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్‌, ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు విజ్ఞప్తి చేశారు. మంగళవారంనాడిక్కడ టీఆర్‌ఎస్‌ పార్ల మెంట్‌ సభ్యుడు బి.వినోద్‌కుమార్‌, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి తేజావత్‌ రామచంద్రు నాయక్‌తో కలిసి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్‌తో సమావేశమైన ఆయన జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటించిన ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు నిర్మాణ వ్యయంలో తొంభై శాతాన్ని, సత్వర సాగునీటి ప్రయోజన పథకం (ఏఐబీపీ) కింద రాష్ట్రాల సేద్యపు నీటిపారు దల ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్థిక సహాయాన్ని అందజే స్తున్నట్లుగానే తెలంగాణ ప్రభుత్వం అమలు చేయ నున్న వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుకు కూడా కేంద్రం నిధులు విడుదల చేసి సహకరించాలని కోరారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా, అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలనే తపనతో తమ రాష్ట్ర ప్రభుత్వం ఈ బృహత్‌ కార్యక్రమాన్ని చేపడుతున్నందున నిర్మాణ వ్యయంలో కనీసం యాభై శాతాన్ని భరించాలని విజ్ఞప్తి చేసినట్లు ఆ తర్వాత విలేఖ రులతో మాట్లాడిన మంత్రి తారక రామారావు తెలియజేశారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రితో పాటు జౌళి శాఖ మంత్రి సంతోష్‌ గంగ్వార్‌, కార్మిక మంత్రి బండారు దత్తాత్త్రేయ, శాస్త్ర, సాంకేతిక శాఖల మంత్రి వై.సుజనా చౌదరిలతో కూడా విడివిడిగా సమావేశమైన తెలంగాణ మంత్రి రాష్ట్ర పురోభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం రూపొందించిన వివిధ అభివృద్ధి ప్రణాళికలకు కేంద్రం నుంచి ఆర్థిక సహాయాన్ని అర్థించినట్లు తెలిపారు. తమ ప్రతిపాదనలన్నింటికీ కేంద్ర మంత్రులు సానుకూలంగా ప్రతిస్పందించారని చెప్పారు. వచ్చే కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి ఒక మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌, మరో మెగా హాండ్లూమ్‌ క్లస్టర్‌లను ఆర్థిక మంత్రి ప్రకటించే అవకాశముందన్నారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన స్థలాన్ని అందజేస్తే కరీంనగర్‌ జిల్లా బీడీ కార్మికుల కోసం రెండు వందల పడకల ఇఎస్‌ఐ ఆసుపత్రిని నెలకొల్పేందుకు కార్మిక మంత్రి అంగీకరించారని వెల్లడించారు. కరీంనగర్‌ జిల్లా, సిరిసిల్లలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక ఐటీఐని స్థాపిం చాలని కోరడంతో పాటు కరీంనగర్‌ జిల్లాలో గతంలో నెలకొల్ప తలపెట్టిన యాభై పడకల ఇఎస్‌ఐ ఆసుపత్రి స్థాయిని రెండు వందల పడకలకు పెంచాలని బండారు దత్తాత్త్రేయను కోరినట్లు ఆయన చెప్పారు. జౌళి శాఖ మంత్రి సంతోష్‌ గాంగ్వార్‌కు కరీంనగర్‌ జిల్లాలోని సిరిసిల్లలో మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌, నల్గొండ జిల్లా పోచం పల్లి లేదా మెదక్‌ జిల్లా దుబ్బాక లేదా మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఒక చోట మెగా హాండ్లూమ్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు సంబంధించిన పూర్తిస్థాయి నివేదికను సమర్పించి నట్లు తెలిపారు. ఈ రెండు ప్రతిపాదనలను కేంద్ర మంత్రి ఇప్పటికే ఆర్థిక శాఖకు పంపినందున వీటిని వచ్చే కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించే అవకాశముందని విశ్వసిస్తు న్నట్లు చెప్పారు. వీటితో పాటు వరంగల్‌ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం లక్ష మగ్గాలతో ఏర్పాటు చేయతలపెట్టిన టెక్స్‌టైల్‌ పార్క్‌కు కేంద్ర ప్రభుత్వ మద్దతును, ఎన్‌టిసి సహకారాన్ని కోరామని, తెలంగాణలో ఒక జౌళి పరిశోధనా సంస్థను, మూడు నాలుగు చోట్ల టెక్స్‌టైల్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్లను నెలకొల్పాలని కోరినట్లు చెప్పారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిని కలిసి వాటర్‌గ్రిడ్‌కు ఆర్థిక సహాయాన్ని కోరడంతో పాటు పూర్వపు అవిభక్త రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలుగా గుర్తించిన 13 జిల్లాలలో తొమ్మిది తెలంగాణలోనే ఉన్నప్పటికీ ఈ ఏడాది కేవలం మూడు జిల్లాలకు మాత్రమే రూ. 66 కోట్ల నిధులను విడుదల చేయడాన్ని ఆయన దృష్టికి తెచ్చి మిగిలిన జిల్లాలకు కూడా నిధుల విడుదలను కోరానని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తెలంగాణలో 78 మండలాలకే కుదించబోతున్నట్లు వస్తున్న వార్తలను ప్రస్తావించి ఉపాధి హామీ పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కుదించరాదని డిమాండ్‌ చేశామని కేటీఆర్‌ వెల్లడించారు. తెలంగాణలోని 150 మండలాలలో మహిళా స్వయం సహాయక బృందాల లింకేజి కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ. 235 కోట్ల నిధుల్లో రూ. 56 కోట్లు మాత్రమే విడుదలైనందున మిగిలిన మొత్తాన్ని సత్వరమే మంజూరు చేయాలని కోరినట్లు చెప్పారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి మూడు మాసాలకు కేంద్రం నుంచి రావాల్సిన రూ. 223 కోట్లను మంత్రి ఈరోజే విడుదల చేసినట్లు తెలంగాణ మంత్రి వివరించారు. వాటర్‌ గ్రిడ్‌, చెరువుల పునరుద్ధరణ ప్రాజెక్టులను స్వయంగా చూసేందుకు కేంద్ర మంత్రిని రాష్ట్రంలో పర్యటించాలని కోరినట్లు కూడా ఆయన తెలియజేశారు. కేంద్ర సైన్స్‌, టక్నాలజీ శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరితో కూడా సమావేశమైన తెలంగాణ మంత్రి రాష్ట్ర విభజనకు ముందు గత ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా బుద్వేలు వద్ద నెలకొల్పాలని ప్రతిపాదిం చిన సైన్స్‌ సిటీ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడంతో పాటు ఐటీ రంగంలో తీహాబ్‌ పేరుతో ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద ఇంక్యుబేషన్‌ సెంటర్‌కు మౌలిక వసతులను కల్పించడంలో కేంద్రం సహకరించాలని అభ్యర్థించినట్లు చెప్పారు. తెలంగాణలో పరిశోధనలకు ఊతమిచ్చేలా ప్రతి జిల్లాలో ఇంక్యుబేషన్‌ సెంటర్లను కేంద్రం ఏర్పాటు చేయాలని కూడా ఆయన కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు.