ఆంధ్రప్రదేశ్‌లోని లక్షలాది మంది డీఎస్సీ అభ్యర్థుల ఎదురుచూపులు ఫలించబోతున్నాయి. డీఎస్సీ-2014 ప్రకటనను ఏపీ ప్రభుత్వం గురువారం జారీచేయబోతుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు అధికారికంగా ప్రకటించనున్నట్లు ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు 'ఈనాడు'కు వెల్లడించారు. డీఎస్సీని ఇకపై...ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్-కమ్-టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ ( టెట్- కమ్- టీఆర్టీ)గా వ్యవహరించబోతున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం మేరకు, మంత్రి గంటా ఆదేశాలను అనుసరించి మాధ్యమిక విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి అధర్‌సిన్హా డీఎస్సీ-2014 అర్హతలపై బుధవారం రాత్రే మార్గదర్శకాలు విడుదల చేశారు. తొలుత నిర్ణయించిన ప్రకారం 10,500 వరకు ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేయాలని నిర్ణయించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం...9061 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ కాబోతోంది.ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ) పోస్టులు 6244, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 1849, ఇతర పోస్టులు ఉన్నాయి. కోతపడినవన్నీ ఎస్జీటీ పోస్టులే. ట్రైబల్, మున్సిపల్ శాఖకు చెందిన 1280 టీచర్ పోస్టుల భర్తీపై స్పష్టత రావాల్సి ఉంది. సెప్టెంబరు 5వ తేదీనే ఈ డీఎస్సీ జారీ చేయాల్సి ఉండగా...బీఎడ్ అభ్యర్థులకు ఎస్జీటీ పోస్టులకు అర్హత కల్పించే విషయమై కేంద్రంతో సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించడంతో మంత్రి గంటా కేంద్రంతో సంప్రదింపులు జరిపారు. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం నుంచి కూడా బీఎడ్ వారికి ఎస్జీటీ పోస్టులకు అవకాశాన్ని కల్పించాలని విజ్ఞప్తులు వచ్చినప్పటికీ... సుప్రీంకోర్టు ఆదేశాలు, కేంద్ర మార్గదర్శకాల దృష్ట్యా ఏమీ చేయలేకపోయినట్లు కేంద్ర మానవ వనరుల శాఖ ఏపీ ప్రభుత్వానికి సూచనప్రాయంగా తెలియజేసింది. నెలలు గడిచినా ప్రకటన రాక అభ్యర్థుల్లో ఆందోళన అలముకోవడంతో రాష్ట్రప్రభుత్వం ప్రకటన జారీకి సిద్ధమైంది.
ఆంధ్రప్రదేశ్‌లోని డీఎస్సీ ,Andhara Pradesh DSC 2014