Monday, May 26, 2014

ఆన్‌లైన్‌ పిలుపులు..ఆహ్వాన శుభలేఖలు!


ఆన్‌లైన్‌ పిలుపులు..ఆహ్వాన శుభలేఖలు!మూడుముళ్ల ముచ్చట్లు ఆన్‌లైన్‌లో సందడి చేస్తున్నాయి... ఏడడుగల బంధం డాట్‌కామ్‌ సాక్షిగా దీవెనలందుకుంటోంది... బొట్టు పెట్టి పిలిచే వేడుకలకు అంతర్జాలం ఆహ్వానం పలుకుతోంది... ప్రేమ వూసులు.. పెళ్లి కబుర్లు.. మనసారా పలికే ఆశీర్వచనాలకు ఇప్పుడు కేరాఫ్‌ అడ్రస్‌ వెడ్‌సైట్‌... యమా జోరుతో కుర్రకారు మనసు చూరగొంటున్న ఈ ట్రెండ్‌ సంగతులు మనమూ పట్టేద్దాం! ఇది ఓ యువ జంట అంతర్జాల కల్యాణలేఖ. అన్ని అనుభూతులు గుదిగుచ్చి అల్లుకున్న వెడ్‌సైట్‌ మాల. ఇంతేనా... మచ్చటపడి తీయించుకున్న చిత్తరువులు, తొలి కలయిక, మధుర అనుభూతులు, పెళ్లి ముహుర్తం, కల్యాణ వేదిక, అతిథులకు దారి చూపే మ్యాప్‌.. అన్నీ ఆ వెబ్‌సైట్‌లోనే. పరిచయం నుంచి పరిణయం దాకా అనుభూతుల వెల్లువకు వేదికనే. ఈ ట్రెండ్‌ని ఒడిసిపడుతున్న యూత్‌ సంఖ్య తక్కువేం కాదు.పెళ్లికి రమ్మంటూ పిలవడం వరకు ఓకే. కానీ రెండు హృదయాల పరిచయం.. వ్యక్తిగత అభిరుచులు పంచుకోవడం.. ఇద్దరు మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలు.. ప్రతిదాన్నీ అంతర్జాలంలో పంచుకోవాలా? పెదవి దాటని విషయాలు పరుల ముందుంచాలా? రెండు మనసుల మధ్య ఒదిగిపోయే తీపి జ్ఞాపకాలు అందరికీ అవగతం కావాలా? ఇదే విషయం రవిని అడిగితే 'మా బంధం ఎంత దృఢమైందో చెప్పుకోవడానికి ఇంతకుమించి మంచి వేదిక ఏముంటుంది?' అంటాడతడు. తనూ శ్రీమతితో పరిచయం, ప్రేమ, పెళ్లి జ్ఞాపకాల్ని వెడ్‌సైట్‌గా మలుచుకున్న యువకుడే. వెడ్‌సైట్‌ కేవలం ఆన్‌లైన్‌ శుభలేఖే కాదు. ఇదో అనుభూతుల ఖజానా. ఎన్ని తీపి జ్ఞాపకాలనైనా పదిల పరుచుకోవచ్చు. అమ్మాయి తొలిసారి అబ్బాయిని కలిసింది.. అబ్బాయి ఆమెకిచ్చిన మొదటి బహుమతి.. ఎవరు ఎవరికి ప్రపోజ్‌ చేశారు.. బంధువుల వివరాలు.. పెళ్లికి పెద్దల్ని ఒప్పించిన తీరు.. అభిప్రాయాల కలబోత.. పెళ్లి జరిగే చోటు.. ఇలా ప్రతి సంఘటనని అక్షరబద్ధం చేయొచ్చు. అందమైన చిత్రాలుగా పేర్చొచ్చు. ఆపై వెడ్‌సైట్‌ లింక్‌ని ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, గూగుల్‌ప్లస్‌.. ఇలా ఏ సామాజిక అనుబంధాల వెబ్‌సైట్‌కైనా అనుసంధానం చేయాలి. ఇది వెడ్‌సైట్‌ సృష్టికర్తలకే కాదు.. బంధువులు, సన్నిహితులు, స్నేహితులకూ లాభదాయకమే. పెళ్లి కుదిరిన అమ్మాయి, అబ్బాయి ఫొటోలను నెట్‌లో చూడొచ్చు. పెళ్లి ముహుర్తం, వేదిక కళ్లముందే కనపడతాయి. వేరే ప్రాంతాల నుంచి వచ్చేవాళ్లకి చిరునామా వెతుక్కునే భారం తప్పుతుంది. గూగుల్‌ మ్యాప్‌తో అడ్రస్‌ కనుక్కోవడం తేలిక. పెళ్లికి రాలేనివాళ్లు అక్కడే కామెంట్లు పెట్టొచ్చు. శుభాకాంక్షలు, ఆశీర్వచనాలు పంపొచ్చు. చిన్న పట్టణాల్లోనూ..వెడ్‌సైట్‌ ట్రెండ్‌ ఐదారేళ్ల కిందటే మొదలైనా ఇప్పుడిప్పుడే వూపందుకుంటోంది. పర్సనల్‌ బ్లాగ్‌ నుంచి పుట్టుకొచ్చిన ట్రెండ్‌ ఇది. డొమైన్‌ స్పేస్‌ కోసం స్థానిక, అంతర్జాతీయ సంస్థలు ప్యాకేజీలతో రెడీగా ఉన్నాయి. వెబ్‌సైట్‌ రూపకల్పన పెద్ద ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాదు. వినియోగదారుని అవసరాలు, రిచ్‌నెస్‌ని బట్టి వెడ్‌సైట్‌ ఖరీదు ఉంటుంది. ముహుర్తం, పెళ్లి వేదిక, రిసెప్షన్‌, ఫొటోలు.. ఏ వివరాలైనా జోడించవచ్చు. ఫలానా సమయానికే అతిథులకు తెలియజేసేలా రిమైండర్‌ కూడా పెట్టొచ్చు. రెస్పాన్సివ్‌ వెబ్‌డిజైన్‌తో పీసీ, ల్యాప్‌టాప్‌, మొబైల్‌, ట్యాబ్‌లకు సరిపోయేలా ఒకేసారి వెడ్‌సైట్‌ డిజైన్‌ చేయొచ్చు. రాష్ట్రంలోని చిన్నచిన్న నగరాల్లోనూ యువత ఈ ట్రెండ్‌ని అందిపుచ్చుకుంటున్నారు. ముఖ్యంగా సాంకేతికపై పట్టున్నవాళ్లు ఈ వెడ్‌సైట్లని కోరుకుంటున్నారు. ఫొటోస్టూడియో నిర్వాహకులూ ఈ వెడ్‌సైట్ల రంగంలోకి దిగారు. ఇది ఖరీదైన వ్యవహారం అనుకునేవాళ్లు ఫేస్‌బుక్‌లోనే పెళ్లి పేజీ రూపొందించి పెళ్లి ఆహ్వానాలు పంపుతున్నారు.