Showing posts with label రాజ్యాంగ పద్ధతులు. Show all posts
Showing posts with label రాజ్యాంగ పద్ధతులు. Show all posts

Wednesday, February 19, 2014

బిల్లులు, సభలు- రాజ్యాంగ పద్ధతులు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును లోక్‌సభలో కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ బిల్లును ఏ సభలో ప్రవేశపెట్టాలన్న అంశంపై అంతకు ముందే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. విభిన్న రకాల అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఒక బిల్లు చట్టంగా మారాలంటే, లోక్‌సభలో మూడు దశలు, రాజ్యసభలో మూడు దశలు దాటాల్సి ఉంటుంది. తాజాగా పునర్వ్యవస్థీకరణ బిల్లును తొలుత రాజ్యసభలో ప్రవేశపెట్టాలని భావించారు. అయితే ఇది ద్రవ్యబిల్లు అన్న అంశం తెరపైకి రావడంతో లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఎందుకంటే ద్రవ్యబిల్లు, లేదా ఆర్థిక బిల్లులను కేవలం లోక్‌సభలోనే ప్రవేశపెట్టాలని రాజ్యాంగం నిర్దేశించింది. ద్రవ్య లేదా మనీ బిల్లుకు సంబంధించిన నిర్వచనం అధికరణం 110లో పేర్కొన్నారు. ఒక బిల్లు, ద్రవ్య బిల్లా కాదా అన్న అంశాన్ని నిర్ణయించే అధికారం, లోకసభ స్పీకర్‌దే. ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి పూర్వానుమతి అవసరం. అయితే ద్రవ్య బిల్లులకు సంబంధించి రాష్ర్టపతికి పాకెట్ వీటో అధికారం లేదు (అధికరణం 111) ద్రవ్యబిల్లు, ఆర్థిక బిల్లుకు కూడా తేడా ఉంది. ద్రవ్య బిల్లులో ముఖ్యంగా ఆరు అంశాలు ఉంటాయి. పన్ను విధింపు లేక చెల్లింపునకు సంబంధించింది ప్రభుత్వం తీసుకునే రుణాలు సంఘటిత నిధికి సంబంధించి ప్రభుత్వ గణాంకాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల తనిఖీకి సంబంధించిన అంశాలు ద్రవ్యబిల్లులో ఉంటాయి. ఈ పరిధిలోకి రాని, ఇతర ఆర్థిక అంశాలను కలిగి ఉన్న బిల్లులను ఆర్థిక బిల్లులు అంటారు. ఆర్థిక బిల్లులకు సంబంధించి స్పీకర్ నిర్ణయం ఉండదు. అలాగే ద్రవ్య, ఆర్థిక బిల్లుల మధ్య కొన్ని సారూప్యాలు కూడా ఉంటాయి. ఈ రెండింటిని మొదట రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి వీలులేదు. రెండింటిని లోక్‌సభలో ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి పూర్వానుమతి తప్పనిసరి. ఆర్థిక బిల్లుల ఆమోదం సాధారణ బిల్లుల ఆమోదం తరహాలోనే ఉంటుంది. సాధారణ బిల్లులను ఏ సభలో అయిన ప్రవేశపెట్టొచ్చు. అధికరణం 123 ప్రకారం, రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డినెన్స్‌లు కూడా పార్లమెంట్ అనుమతి పొందాల్సి ఉంటుంది. లేదా అవి రద్దు అవుతాయి. ఇటీవలి కాలంలో, ఆహార భద్రత చట్టం, నిర్భయ చట్టం కూడా మొదట ఆర్డినెన్స్‌ల రూపంలో వచ్చి, తర్వాత చట్టసభల్లోకి ప్రవేశించి చట్టాలుగా మారాయి. లోక్‌సభలో కేంద్రం ప్రవేశపెట్టిన రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులోని ప్రధాన అంశాలు ప్రస్తుత రాజధాని హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడిగా ఒకే గవర్నర్ ఉంటారు. ఉమ్మడి రాజధానిగా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి మొత్తం ఉంటుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని ఏర్పాటుకు నిపుణుల కమిటీని కేంద్రం ఏర్పాటు చేస్తుంది. 45 రోజుల్లో ఇది తన సిఫారసులను ఇస్తుంది. నీటి పంపకాలకు సంబంధించి కేంద్రం ఒక అత్యున్నత మండలిని ఏర్పాటు చేస్తుంది. కష్ణా, గోదావరి జలాల పంపకాలను ఇది పర్యవేక్షిస్తుంది తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలు, అవశేష ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్‌సభ స్థానాలు ఉంటాయి. అలాగే తెలంగాణలో 119 శాసనసభ స్థానాలు, అవశేష ఆంధ్రప్రదేశ్‌లో 175 శాసనసభ స్థానాలు ఉంటాయి. పోలవరం ప్రాజెక్ట్‌కు జాతీయ ప్రాజెక్ట్ హోదానిస్తారు. కొత్త రాష్ట్రంలో హైకోర్ట్ ఏర్పాటు చేసే వరకు ప్రస్తుతం రాష్ట్రంలోని సర్వోన్నత న్యాయస్థానమే, ఇరు రాష్ర్ర్టాలకు ఉమ్మడిగా కొనసాగుతుంది. సాధారణ బిల్లు- ఆమోదం పొందే తీరు సాధారణ బిల్లును లోక్‌సభ లేదా రాజ్యసభలో ప్రవేశపెట్టవచ్చు. ఆయా సభలో ఆమోదించిన వెంటనే రెండో సభకు పంపిస్తారు. రెండో సభ ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. లేదా సవరణ చేసి తిరిగి మొదటి సభకు పంపించవచ్చు. లేదా ఆరు నెలల పాటు పెండింగ్‌లో ఉంచవచ్చు. బిల్లు స్వభావాన్ని బట్టి ఆ అంశం ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందో ఆ మంత్రి ఆ బిల్లును ప్రవేశ పెట్టడం రివాజు. ఉభయసభల సమావేశం : ఉభయ సభల సమావేశానికి సంబంధించి అధికరణం 108లో పేర్కొన్నారు. ఉభయ సభల సమావేశ పరిచే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. అయితే దీనికి లోక్‌సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. ఏ అంశంపైనయినా సందిగ్ధత నెలకొంటే ఉభయ సభలు సమావేశమవుతాయి. ఈ తరహా సమావేశం తొలిసారిగా 1961లో వరకట్న నిషేధ బిల్లుకు సంబంధించిన అంశంపై నిర్వహించారు. 1978లో బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్‌కు సంబంధించి నిర్వహించిన ఉభయ సభల సమావేశం రెండోది. (పోటా) ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ యాక్ట్ బిల్లుకు సంబంధించి 2002లో మూడోసారి ఉభయ సభల సమావేశం జరిగింది. రాజ్యాంగ సవరణ బిల్లును రెండు సభలు విడివిడిగా ఆమోదించాలి. ఈ అంశంలో ఉమ్మడి సమావేశానికి ఆస్కారం లేదు. ఏదైనా బిల్లుకు సంబంధించి లోతైన అధ్యయనం అవసరం అని భావిస్తే స్టాండింగ్ కమిటీలకు ఆయా సభలు సిఫారసు చేస్తాయి. బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందాక రాష్ట్రపతి వద్దకు వెళ్తుంది. ద్రవ్య బిల్లును మాత్రం విధిగా రాష్ట్రపతి ఆమోదించవలసి ఉంటుంది. మిగతా బిల్లులను మాత్రం ఆమోదించవచ్చు లేదా తన దగ్గరే ఉంచుకోవచ్చు. రాష్ట్రపతి సంతకం చేసిన రోజే ఆయా బిల్లులు చట్టంగా మారుతాయి. రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించి కూడా రాష్ట్రపతి విధిగా ఆమోదించాల్సి ఉంటుంది.