రష్యా దండయాత్రకు ఉక్రెయిన్ నుంచి ఇంతే కఠినమైన ప్రతిఘటన కొనసాగి సంప్రదాయ ఆయుధాలు, మానవ వనరులు హరించుకుపోతే అణ్వాయుధాలవైపు పుతిన్ మొగ్గుచూపుతారా? పశ్చిమ దేశాలకు బెదిరింపులు తప్పవా? అంటే అవునని అంటోందని అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ ఇంటెలిజెన్స్ నివేదిక. ఇప్పటికే యుద్ధం మొదలైన తర్వాత అణ్వాయుధ బలగాలను సంసిద్ధంగా ఉండాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అప్రమత్తం చేసిన విషయాన్ని ఈ నివేదిక ప్రస్తావించడం గమనార్హం.
‘‘ఉక్రెయిన్ భూభాగంలోని ప్రాంతాలను దీర్ఘకాలంగా ఆక్రమించడం వల్ల రష్యా సైనిక బలగం తగ్గిపోతుంది.. వారి ఆయుధగారంలోని ఆధునీకరించిన ఆయుధాలు తరిగిపోతాయి.. ఇదే సమయంలో ఆర్థిక ఆంక్షలు రష్యాను దీర్ఘకాలిక ఆర్థిక మాంద్యం, దౌత్యపరమైన ఒంటరితనంలోకి నెట్టివేస్తాయి’’ అని డిఫెన్స్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ లెఫ్టినెంట్ జనరల్ స్కాట్ బెరియర్ తన నివేదికలో పేర్కొన్నారు.
‘‘ఉక్రెయిన్ ధిక్కరణ, ఆర్థిక ఆంక్షలు వెరసి రష్యా ఆధునిక ఖచ్చితత్వ-గైడెడ్ ఆయుధాలను ఉత్పత్తి చేస్తే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది’’ అని కాంగ్రెస్ ఆర్మ్‌డ్ సర్వీసెస్ కమిటీకి గురువారం సమర్పించిన నివేదికలో తెలిపారు. ఈ యుద్దం, దాని పరిణామాలతో రష్యా సంప్రదాయ శక్తి మెల్లగా బలహీనపడుతుందని బెరియర్ అన్నారు.
‘పశ్చిమ దేశాలను బెదరించడానికి, తన అంతర్గత, బాహ్య బలాన్ని పెంచుకోడానికి అణు నిరోధకంపై ఎక్కువగా ఆధారపడుతుంది’’ అని అంచనా వేశారు. చైనా అధినేత జీ జిన్‌పింగ్‌తో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భేటీకి పిలుపునివ్వడంతో యుద్ధం ప్రభావాన్ని పెంటగాన్ అంచనా వేసింది. ఉక్రెయిన్ యుద్ధంలో చైనా వైఖరిని అమెరికా అధికారులు సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు. అయితే, యుద్ధం ముగించడానికి జిన్‌పింగ్ సాయం కోరాలని బైడెన్ భావిస్తున్నారు.
అణ్వాయుధ బలగాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పుతిన్ ఇప్పటికే ప్రకటించారు. కాగా, పెంటగాన్ ఇంటెలిజెన్స్ నివేదికపై వాషింగ్టన్‌లోని రష్యా రాయబార కార్యాలయం తక్షణమే స్పందించడానికి నిరాకరించింది.
రష్యా దండయాత్రపై గత వారం పలు గూఢచార సంస్థలు వెల్లడించిన హెచ్చరిక నివేదికల మాదిరిగా కాకుండా పెంటగాన్ నివేదిక తాజా పరిస్థితులను ప్రతిబింబిస్తుంది. పెంటగాన్ సీనియర్ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. దాడి చాలా వరకు నిలిచిపోయిందని, రష్యా ఇప్పటి వరకు ఉక్రెయిన్‌లోకి 1,000 కంటే ఎక్కువ సుదూర క్షిపణి దాడులపై ఆధారపడిందని చెప్పారు.
ఉక్రెయిన్‌లో తన లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో పశ్చిమ దేశాలను మరింత విస్తృతంగా ఎదుర్కోవడానికి దూకుడు చర్యలకు పూనుకోవచ్చని బెరియర్ చెప్పారు. మాజీ సోవియట్ యూనియన్‌లోని ఇతర దేశాలను సంఘటితం చేయడమే ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రకు కీలకమైన ప్రేరణ అని ఆయన వ్యాఖ్యానించారు.
‘‘ఉక్రెయిన్ నుంచి ఊహించిన దానికంటే ఎక్కువ ప్రతిఘటన.. సంఘర్షణ ప్రారంభ దశలో సాపేక్షంగా అధిక నష్టం వాటిల్లినప్పటికీ జెలెన్‌స్కీ ప్రభుత్వం తన దారికి వచ్చేవరకూ మరింత ప్రమాదకర ఆయుధాలను ఉపయోగించి ముందుకు సాగాలని మాస్కో నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది’’ అని ఆయన అన్నారు.