Wednesday, May 5, 2021

ఒక్క టీకానూ వృథా కానివ్వని కేరళ - మోదీ ఫిదా


 

 


 

కేరళ ఆరోగ్య కార్యకర్తలు, నర్సులపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. టీకాలు వృథా కాకుండా వారు వ్యవహరించిన తీరు దేశానికి ఆదర్శమన్నారు. తమ రాష్ట్రంలో ఆరోగ్య సిబ్బంది పనితీరు అద్భుతమని సీఎం పినరయి విజయన్ చేసిన ట్వీట్​కు మోదీ ఈ విధంగా బదులిచ్చారు.

 

 కేంద్రం నుంచి కేరళకు 73,38,806 టీకా డోసులు రాగా.. తమ ఆరోగ్య సిబ్బంది 74,26,164 డోసులను పంపిణీ చేశారని విజయన్​ మంగళవారం ట్వీట్ చేశారు. వృథాను దృష్టిలో ఉంచుకుని ఒక్కో వయల్​లో​ ఇచ్చే అదనపు డోసులను కూడా చక్కగా వినియోగించుకున్నట్లు తెలిపారు. తమ ఆరోగ్య కార్యకర్తలు, ప్రత్యేకించి నర్సులు అద్భుతంగా పని చేశారని కితాబిచ్చారు.

 


 

దీనిపై మోదీ బుధవారం స్పందించారు. కేరళ ఆరోగ్య సిబ్బంది దేశానికి ఉదాహరణగా నిలిచారని, కరోనాపై చేస్తున్న పోరాటాన్ని బలోపేతం చేసేందుకు టీకాలను వృథా చేయకుండా వినియోగించడం అత్యంత కీలకమని ట్వీట్ చేశారు.

కరోనాపై సీఎంలతో సమీక్ష నిర్వహించిన ప్రతిసారీ మోదీ ఈ విషయాన్ని నొక్కి చెబుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో టీకాల వృథా శాతం ఎక్కువగా ఉందనే విషయాన్ని ప్రస్తావించారు.