Friday, September 29, 2017

ఎస్‌.ఆర్‌.రంగనాథన్‌ - జాతీయ గ్రంథపాలకుల దినోత్సవం



జాతీయ గ్రంథపాలకుల దినోత్సవం

‘మానవ జాతి మౌలికావసరాల జాబితాలో గాలి, నీరు, ఆహారం, వసతి తరవాత విజ్ఞానం అత్యంత కీలకమైంది’ విఖ్యాత మేధావి డీఏ కెంప్‌ చేసిన వ్యాఖ్య ఇది. మానవాళి వేల సంవత్సరాల అనుభవ సారంగా పోగుబడిన విజ్ఞాన సంపదను పదిలంగా కాపాడటం, పదిమందికీ దానిని పంచిపెట్టడమే సామాజిక వికాసానికి మూలాధారం. నాగరికత పరిణామ క్రమంలో ఒక్కో దశను దాటే కొద్దీ మనిషి తన చుట్టూ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోవడానికి సంబంధించి ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నాడు. ఎప్పటికప్పుడు కొత్తగా దఖలుపడుతున్న విజ్ఞానాన్ని తరవాతి తరాలకోసం జాగ్రత్తపరచేందుకు రకరకాల విధానాలు అందిపుచ్చుకున్నాడు. వివిధ దశల్లో తాను సంపాదించిన విజ్ఞానాన్ని మట్టి పలకలు, జంతుచర్మాలు, చెట్ల బెరడులు, తాళపత్రాలు, కాగితాలు, ఎలక్ట్రానిక్‌ మాధ్యమాల్లో నిక్షిప్తం చేస్తూ ముందుకు కదులుతున్నాడు. ఈ అనంత విజ్ఞాన భాండాగారాన్ని సమాచార కేంద్రాలు, గ్రంథాలయాల ద్వారా విశ్వపరివ్యాప్తం చేస్తున్నాడు. సామాజికాభివృద్ధిలో గ్రంథాలయ నిర్వాహకుల పాత్ర ఎనలేనిది. దురదృష్టవశాత్తూ గ్రంథపాలకుల కృషికి నేడు సరైన గౌరవమే లభించడం లేదు. గ్రంథాలయ శాస్త్రానికి సహేతుక ప్రాతిపదికలు నిర్ధారించి, ఆధునిక లైబ్రరీకి రూపకల్పన చేసిన ఎస్‌.ఆర్‌.రంగనాథన్‌ జయంతిని పురస్కరించుకొని ఏటా ఆగస్టు 12న జాతీయ గ్రంథాలయ పాలకుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. గ్రంథాలయ శాస్త్ర పితామహుడిగా పేరెన్నికగన్న రంగనాథన్‌ సేవలను ఈ సందర్భంగా తరచిచూడటం ఎంతో అవసరం.

గణాంక శాస్త్రవేత్తగా ప్రస్థానం ప్రారంభించిన డాక్టర్‌ శియాలీ రామామృత రంగనాథన్‌ 1924లో తన 32వ ఏట మద్రాసు విశ్వవిద్యాలయంలో గ్రంథ పాలకుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. గ్రంథాలయ నిర్వహణకు సంబంధించి దేశంలో అంతంతమాత్రంగా ఉన్న విధానాలను సమూలంగా సంస్కరించి, శాస్త్రీయ భూమికను ఏర్పరచడంకోసం ఆయన యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌కు వెళ్ళి పాశ్చాత్య పద్ధతులనూ ఔపోసన పట్టారు. గ్రంథాలయ శాస్త్రానికి తనవైన అయిదు సూత్రీకరణలు చేయడం ద్వారా లైబ్రరీ విద్యను ఆయన కొత్త పుంతలు తొక్కించారు. పుస్తకాలను పాఠకులకు అందుబాటులో ఉంచాలని, వారి అభిరుచులను గౌరవిస్తూ గ్రంథాలను సమీకరించాలని, ప్రతి ఒక్కరి అవసరాలకూ విడిగా పుస్తకాలు అందుబాటులో ఉంచాలని, లైబ్రరీల్లో పాఠకులు తమకు అవసరమైన పుస్తకాలను చిటికెలో వెదికిపట్టుకోగల వీలుండాలని, కాలానుగుణ అవసరాలకు అనుగుణంగా గ్రంథాలయం ఎప్పటికప్పుడు కొత్త హంగులు సంతరించుకోవాలని రంగనాథన్‌ అయిదు కీలక సూత్రాలు ప్రతిపాదించారు. పుస్తక విజ్ఞానాన్ని సామాజిక ఆస్తిగా తీర్మానించిన రంగనాథన్‌ సిద్ధాంతం ఈ సూత్రీకరణల్లో అడుగడుగునా ప్రతిఫలిస్తోంది.

గ్రంథాలయ నిర్వాహకుడిగా ఆయన కనబరచిన నిబద్ధత ఆశ్చర్యం కలిగిస్తుంది. తనకు వివాహమైన రోజున మధ్యాహ్నం సమయానికంతా లైబ్రరీ విధులకు ఆయన ఠంచనుగా హాజరుకావడం పుస్తకమే ప్రాణంగా ఆయన బతికిన తీరును వెల్లడిస్తుంది. మద్రాసు విశ్వవిద్యాలయ గ్రంథపాలకుడిగా ఎప్పుడూ సెలవు తీసుకోకుండా 20 ఏళ్లపాటు వారమంతటా రోజూ 13గంటలపాటు నిర్విరామ బాధ్యతలు నిర్వహించారాయన. గ్రంథాలయంతో ముడివడిన అన్ని విభాగాల్లోనూ పనిచేసిన రంగనాథన్‌- ఎన్నో పుస్తకాలూ రచించారు. గ్రంథాలయ వర్గీకరణ, పుస్తక జాబితా రూపకల్పన, సూచికా సేవలు, పాలన నిర్వహణ, గ్రంథపాలన తత్వం వంటి వివిధ అంశాలపై ఆయన లోతైన విశ్లేషణ చేస్తూ పుస్తకాలు వెలువరించారు. ఈనాటికీ అవి ప్రామాణిక గ్రంథాలుగా ఉన్నాయి. కేవలం పుస్తకాలు రాయడంతో సరిపెట్టలేదాయన. రాసిన ప్రతి విషయాన్నీ స్వయంగా ఆచరించి చూపారు. లైబరీల్లో పుస్తక వర్గీకరణ, జాబితా రూపకల్పనలకు సంబంధించి శాస్త్రీయ పద్ధతులు ప్రవేశపెట్టారు. ‘కోలన్‌’ పద్ధతిని ఉపయోగించి గ్రంథాల వర్గీకరణ, పుస్తక జాబితాకు సంబంధించిన ప్రత్యేక విధానం, గ్రంథాలను అంకెలవారీగా అమర్చడం వంటి శాస్త్రీయ పద్ధతులకు ఆయన ప్రాణప్రతిష్ఠ చేశారు. ఆదర్శ ప్రజా గ్రంథాలయ బిల్లునూ రూపొందించారాయన.

తమిళనాడులోని తంజావూరులో 1892 ఆగస్టులో జన్మించిన రంగనాథన్‌- అనితరసాధ్య నిబద్ధతను కనబరచి గ్రంథాలయ నిర్వహణ తీరుతెన్నులను గుణాత్మకంగా మార్చివేశారు. లైబ్రరీ నిర్వహణకు శాస్త్రం స్థాయి కల్పించారాయన. తొలి దశలో మద్రాసు విశ్వవిద్యాలయంలో లైబ్రేరియన్‌గా బాధ్యతలు నిర్వహించిన రంగనాథన్‌- 1945-’47 మధ్యకాలంలో బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలోనూ, ఆ తరవాత 1947-’55లోనూ గ్రంథాలయ శాస్త్ర ఆచార్యుడిగా పనిచేశారు. ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ లైబ్రేరియన్‌షిప్‌కి తొలి డైరెక్టర్‌గా ఉండి ఎందరో విద్యార్థులకు గ్రంథాలయ శాస్త్రంలో పట్టాలను బహూకరించారు. 1944-’53 మధ్యకాలంలో భారత గ్రంథాలయ సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. అంతర్జాతీయ సమాచార, డాక్యుమెంటేషన్‌ (ఎఫ్‌ఐడీ) సంస్థ గౌరవ సభ్యుడిగా 1957లో ఎంపికైన ఆయన- ఆ తరవాత గ్రేట్‌ బ్రిటన్‌ గ్రంథాలయ సంస్థకు జీవితకాల ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. బెంగళూరులోని భారత గణాంక సంస్థలో 1962లో డాక్యుమెంటేషన్‌ పరిశోధన, శిక్షణ కేంద్రం ఏర్పాటుకు రం