Monday, October 10, 2016

మాతృ మూర్తి కి క్రొత్త నిర్వచనం..



కడుపుతో ...ఆమె
..................................
తాళికట్టిన మరునిముషంలోనే
కట్టిన తాళితో అమె మీద..
సర్వ హక్కులూ..నాకు వచ్చేశాయి.
ఆమె నా భార్య
పెళ్ళి పేరుతోనో..ప్రేమ పేరుతోనో..
ఆమె మీద..
పగబట్టిన నేను...
పూర్తి మగజంతువుగా మారిపోయి
చీకటిలో.. నాలుగు గోడల మధ్య చేసిన..
రహస్య యుద్ధ జ్వాల
పరుగెత్తుకుంటూ వెళ్ళి..ఆమె లోపలెక్కడో దాగున్న
మాత్రుబిందువును..తాకగానే..
ఆమె ఓ కొత్త రక్త చరిత్రగా..ఆమె ఓ కొత్త స్రుస్టి ధరిత్రిగా మారిపోతుంది.
నన్ను.. స్పర్శించిన చేతులు అవే..
నన్ను.. ప్రేమించిన స్పర్శ అదే..
కానీ ఆమె నన్ను తాకగానే ..
అమె కాక కొత్త గా మరెవ్వరో నన్ను
తాకుతున్న అనుభూతి మొదలవుతుంది.
ఆమె వయిపు నేను చూడగానే
ఆమెలో దాక్కుని
నన్నెవ్వరో కొత్త గా
చూస్తున్న అనుభూతి కలుగుతుంది..
స్రుష్టి అనేది దిగ్బ్రాంతంగా..విభ్రాంతంగా
నా కళ్ళ ఎదుటే
ఓ రూపాన్ని సంతరించుకుంటూంది
మనిషి రూపంలో..ఓ దీపాన్ని వెలిగించటానికి
మరో మనిషి ..స్త్రీ మూర్తి.. దీపంలా
నిలువునా కాలుతుండటాన్ని
నా ఎదురుగానే..నేను చూస్తాను..
కర్తను నేనయినా..
క్రియ మొత్తం ఆమెదే..
కత్తిని నేనయినా
గాయం మాత్రం ఆమెదే
2
కస్టానికి..సుఖానికి మధ్య
ఎండిపోయిన ఓ చెలమ బావిని తవ్వి..
అందులో చిరునవ్వుతో స్నానం చేస్తున్నట్లు
ఆమె కస్టాన్ని అనుభవిస్తూనే
సుఖాన్ని అనుభూతిస్తున్నట్లు
చుట్టూ ప్రపంచాన్ని ఎంతగా భ్రాంతీకరిస్తుందో..
సుఖం పేరుతో ఆమె కష్టాన్ని తలకెత్తుకున్న విషయాన్ని
ఆమే కాదు.. చుట్టూఎవరూ కూడా గ్రహింఛరు
ఓ అసంకల్పిత మరణమో..ఓ సంకల్పిత కొత్త జీవమో తెలీకుండా
ఆమె ఓ నవ్వుకో ..ఓ దుహ్ఖానికో అంతిమ ద్వారంగా
నిల్చుందన్న విషయాన్ని కూడా ఎవరూ గ్రహించరు.
గుక్కెడు నీళ్ళు కూడా కడుపులో ఇమడవు
తీరని దాహంతో పైకి నవ్వుతూ
లోపల్లోపల విలవిలాడుతూ ఉండాలి.
పిడికెడు మెతుకులు కూడా కడుపులో ఆగవు.
తీరని ఆకలితో పైకి నవ్వుతూ
లోపల్లోపల గిలగిల లాడుతూ ఉండాలి.
సుఖించటమంటే... దుహ్ఖించటానికే అన్న
మాటలకు కొత్త రెక్కలొస్తాయి.
ఎడారి బావిలో ఎక్కడో నీళ్ళూరుతున్నట్లు
ఆమె సరీరం లో మరో శరీరం ఏదగటం
స్పస్టంగా పైకే తెలుస్తూనే ఉంటుంది
తనకు తానుగా ఓ దైవరూపంగా
మారిన ఆ స్త్రీ దివ్యత్వంలో ఇమిడిపోయిన
ప్రాణ ప్రవాహాన్ని స్పర్శించటానికి ..ఎంతటి మహాయోధుడయినా
తనకు తానుగా..ఓ నక్షత్ర హారతిలా మారి
ఆమె ముందు సాస్టాంగ పడ వలసిందే.
3
స్త్రీ కడుపుతో ఉండటమంటే
నిముష నిముషానికి రూపాన్ని మార్చుకునే
మండుతున్న నిప్పురవ్వని రహస్యంగా
సమూహంలో కడుపులో దాచుకోని..
మంత్రించిన మంత్రజలాన్ని తాగినట్టు
కొత్త జీవితానికి..నాందీ వాక్యంగా మారటమే.
ఆమె జీవితంలో పగళ్ళన్నీ మండిపొతున్న
మంచుముక్కలవుతాయి.
ఆమె జీవితంలో రాత్రుళ్ళన్నీ మేల్కోని మండుతున్న
చలిమంటలుగా మిగులుతాయి.
తన శరీరం బరువుకి తనే కుంగిపోతుంటే
నిలువెత్తు అద్దంలో ..తన ప్రతిబింబమే తనకు
భయంగొల్పేలా మారిపోయి ....
ఆమె అద్దాన్ని చూసుకోవటాన్ని మర్చిపోయినప్పుడు
అయ్యో అంటూ ఆ..పుణ్యం నాదే అనిపిస్తుంది..
అయ్యో అంటూ ఆ.. పాపం కూడా నాదే అనిపిస్తుంది.
అది కామమో ..అది మోహమో ..
మొగవాడి మూడు నిముషాల పోరాటానికి
తన శరీరాన్ని స్వరాలుగా మార్చుకున్నందుకు
కనిపించకుండా సహస్ర జననాలు ఒక్కచోటే అయినట్టు
రహస్యంగా సహస్ర మరణాలు ఒక్క చోట పోగుపడ్డట్టు
ఊపిరికి ..ఊపిరికి కిమధ్య
ఒక్క చోటే...సత్యాన్ని..అసత్యాన్ని చూసినట్లు..
ఆమె శరీరం మొత్తం గగుర్పాట్లతో
ఆమె శరీరం మొత్తం అదిరిపాట్లతో..
ఎప్పుడూ లేని కొత్త ఉలికిపాట్లకు లోనవుతూ ఉంటుంది
4
ఓ హత్యానంతర ద్రుశ్యాన్ని..
హత్యకు ముందుగానే చూస్తూ..చూపిస్తూ
దేహంతో మొదలయిన ప్రయాణం
తొమ్మిది నెలలతో దేహంతోనే అంత్యాంకానికి జేరుతుంది
అది జననమో.. మరణమో...తెలీని
అవ్యక్త నిరామయ అయోమయంలో నమ్రతగా నిలబడినచోట
ప్రతినిముషం కళ్ళముందు ఏవో దెయ్యాలు తిరుగుతున్నట్టనిపిస్తుంది.
తను బతుకుతుందో ..తను చచ్చిపోతుందో తెలీని సందిగ్ధంలో
అమానుష ఏకాంతంలో ఆమెనే ముణిగిపొతూ ఉంటుంది
కడుపులో ఉన్న శిశువు అటూ ఇటూ తిరిగినఫ్ఫుడు
కాల్లతో లోపల్నించే తన్నినప్పుడు ..
కళ్ళవెంట తెలియకుండానే నీళ్ళు తిరుగుతుంటాయి.,
నెలలు నిండిన అమెని చూసినప్పుడు
ఎలుగెత్తి మరీ ""నన్ను క్షమించు""అని ఆమెకి చెప్పాలనిపిస్తుంది.
ఏదో తెలియని పస్చాత్తాపం
నన్ను నిలువునా కోస్తున్నట్టనిపిస్తుంది.
గుంభనంగా దాచుకున్నదాచుకున్న భయం
బయటకు తన్నుకొస్తూండగా ..బేలగా ..జాలిగా నా వైపు చూస్తూ
ఆమె ఆసుపత్రి లోపలకు వెళ్ళిపోతుంది.
తన రక్తాన్ని తన ప్రాణాలని ధారబోసి
పురుడు అవగానే ఆమె నా వైపు చూసిన చూసిన మొదటిచూపులో
మ్రుత్యువును జయించిన అనుభూతి...
నన్ను స్త్రీత్వం ముందు చేతులు మోడ్చి
శిలగా మిగిల్చిన నిజత్వంలో..నన్ను తండ్రిగా మిగిల్చిన
ఆమె కరుణత్వాన్ని తల్లిపేరుతో కొలవాలా
భార్య పేరుతో నిర్వచించాలా..?
................................................
త్వరలో విడుదల అవుతున్న
""మీరొకప్పుడు బ్రతికుండే వారు""
కొత్త కవితాసంపుటి లోనుంచి
.................................. కొనకంచి లక్ష్మి నరసింహా రావు: facebook link