Friday, August 19, 2016

ఈ-మెయిల్ ఐడి... ఓ గంట కోసం!







ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు ఒక్కోసారి కొన్ని వెబ్ సైట్లు మన పేరు, చిరునామా, ఈ-మెయిల్ ఐడి అడుగుతుంటాయి. పేరు, చిరునామా పర్వాలేదు కానీ.. ముక్కూ మొహం తెలియని వెబ్ సైట్లకు మన ఈ-మెయిల్ ఐడి ఇవ్వడం సురక్షితమేనా? ఇలాంటి అనుమానం మీకు కలిగినప్పుడు డిస్పోజబుల్ (యూజ్ అండ్ త్రో) ఈ-మెయిల్ ఐడితో మీ పని ముగించవచ్చు. అరె.. డిస్పోజబుల్ ఈ-మెయిల్ ఐడి కూడా ఉంటుందా? అని ఆశ్చర్యపోతున్నారా? అయితే చదవండి మరి!
కొన్ని కోట్ల వెబ్ సైట్లు, లక్షల బ్లాగ్ లతో ఇప్పుడు ఇంటర్నెట్ ఒక మహాసముద్రం అయిపోయింది. ఆన్ లైన్లోకి అడుగుపెట్టడమంటే.. ఈత రాని వ్యక్తి ఓ చిన్న పడవలో సముద్రంలోకి బయలుదేరడమే. వెబ్ బ్రౌజింగ్ సమయంలో కొన్నిసార్లు ఆన్ లైన్ అప్లికేషన్లు భర్తీ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. మన పేరు, చిరునామా, ఉపయోగంలో ఉన్న ఈ-మెయిల్ ఐడి సహా బోలెడు వివరాలు సమర్పించుకోవాల్సి ఉంటుంది.
పేరు, చిరునామా ఇవ్వడం వల్ల పెద్ద సమస్యలు తలెత్తవుకానీ, ఎటొచ్చీ ఈ-మెయిల్ ఐడి ఇవ్వాల్సిరావడమే తలనొప్పి. ఒక్కోసారి మీ ఈ-మెయిల్ ఐడి దుర్వినియోగం అయ్యే ప్రమాదమూ లేకపోలేదు. ఒకవేళ ఈ-మెయిల్ ఐడి లేనివారయితే తప్పనిసరిగా ఏదో ఒక ఈ-మెయిల్ సర్వీస్ ప్రొవైడర్ ను ఆశ్రయించి అప్పటికప్పుడు ఈ-మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవలసి వస్తుంది. అయితే నెటిజన్లను ఈ ఆపద నుంచి గట్టెక్కించడానికి ఇంటర్నెట్ లో కొన్ని డిస్పోజబుల్ ఈ-మెయిల్ సర్వీసులు కూడా లభిస్తాయి. వీటిలో చెప్పుకోదగ్గది గొ రిల్లా మెయిల్ (Guerrilla Mail ). ఒక్క ఇంగ్లీషులోనే కాక డచ్, జర్మన్, ఇటాలియన్, నార్వేజియన్, పోలిష్, స్పానిష్ వంటి భాషల్లో సైతం ఈ తాత్కాలిక ఈ-మెయిల్ సౌకర్యం లభిస్తుంది. క్రియేట్ చేసుకున్న తర్వాత కేవలం గంట సేపు మాత్రమే ఈ ఈ-మెయిల్ ఐడి ఉంటుంది. ఆ తర్వాత దానంతట అదే మాయమైపోతుంది. అందుకే దీనిని డిస్పోజబుల్ ఈ-మెయిల్ అని, యూజ్ అండ్ త్రో ఈ-మెయిల్ అని పిలుస్తారు. ఆ గంట సేపూ యాహూ, రెడిఫ్, జీమెయిల్ వంటి రెగ్యులర్ ఈ-మెయిల్ సర్వీస్ ల మాదిరిగానే ఈ 'గొరిల్లా మెయిల్ కూడా పనిచేస్తుంది. ఇందులో ఈ-మెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్న తరువాత మీరు ఎవరికైనా మెయిల్ పంపుకోవచ్చు. ఒకవేళ అవతలి వాళ్ళు కూడా మీకు తిరిగి వాళ్ళ ఈ-మెయిల్ ఐడి నుంచి రిప్లై మెయిల్ ఇస్తే దాన్ని మీరు చదువుకోవచ్చు కూడా. కాకపొతే ఇదంతా సరిగ్గా 60 నిమిషాలు.. అంటే గంటలోనే పూర్తి కావాలి. ఆ తర్వాత మీరు ఎంత వెతికినా మీ ఈ-మెయిల్ ఐడి మీకే కాదు, ఎవరికీ కనబడదు.
బాగుంది కదూ? ఈసారి ఎప్పుడైనా ఆన్ లైన్ లో ఎవరికైనా మీ శాశ్వత ఈ-మెయిల్ ఐడి ఇవ్వాల్సిన పరిస్థితే వస్తే, అది ఇవ్వడం మీకు ఇష్టం లేకపోతే.. మీరు నిరభ్యంతరంగా ఈ 'గొరిల్లా మెయిల్' సర్వీసును ఉపయోగించుకోవచ్చు.
ఇవి కూడా ట్రై చేయవచ్చు..
ఇంటర్నెట్ లో తాత్కాలికంగా ఈ-మెయిల్ సర్వీసులు అందిస్తున్నది ఒక్క 'గొరిల్లా మెయిల్' మాత్రమే కాదు. ఇంకా ఇలాంటి డిస్పోజబుల్ ఈ-మెయిల్ సర్వీసులు చాలా ఉన్నాయి. వాటిలో చెప్పుకోదగినవి.. 10 మినిట్ మెయిల్.కాం, మెయిలినేటర్.కాం, యోప్ మెయిల్.కాం, మింట్ ఈమెయిల్.కాం, మెయిల్ డ్రాప్.సిసి, జేటేబుల్.ఆర్గ్ వంటివి కూడా గొరిల్లా మెయిల్ మాదిరిగానే టెంపరరీగా ఈ-మెయిల్ సర్వీస్ అందిస్తాయి.
వీటిలో 10 మినిట్ మెయిల్.కాం అందించే మెయిల్ సర్వీసు కేవలం పదంటే పది నిమిషాలు మాత్రమే పనిచేస్తుంది. ఒకవేళ మీరు కావాలనుకుంటే ఒక ట్యాబ్ పై క్లిక్ చేయడం ద్వారా గడువును మరో పది నిమిషాలు పెంచుకోవచ్చు. ఇలా ఎన్నిసార్లయినా గడువును పెంచుకోవచ్చుగానీ, ఆ పది నిమిషాల గడువు తీరక మునుపే గడువును పెంచుకుంటూ ఉండాలి.
ఇక మెయిలినేటర్.కాం విషయానికొస్తే.. ఇది కూడా గొరిల్లా మెయిల్ మాదిరిగానే ఒక గంట సేపు మాత్రమే పనిచేస్తుందికానీ ఇందులో ఒక సౌలభ్యం ఉంది. అదేమిటంటే.. ఒక్కసారి మీరు ఈ-మెయిల్ ఐడి క్రియేట్ చేసుకుంటే ఇక దానిని తర్వాతెప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. అయితే ప్రతిసారీ అదే ఈ-మెయిల్ ఐడిని ఉపయోగించి వెబ్ సైట్ లోకి సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. అంటే సైన్ ఇన్ అయిన ప్రతిసారీ ఓ గంటలోగా మీ మెయిల్ ఐడి ద్వారా మెయిల్ సర్వీస్ పొందవచ్చు. కానీ ఇందులో ఉన్నఒక అసౌకర్యం ఏమిటంటే.. భద్రత లేకపోవడం. అంటే.. మీ ఈ-మెయిల్ ఐడి తెలిసిన ఎవరైనా అదే ఐడిని ఉపయోగించి ఎవరికైనా ఈ-మెయిల్ పంపవచ్చు. ఇది మీకు ఏమాత్రం శ్రేయస్కరం కాదు.
మింట్ మెయిల్.కాం కూడా 10 మినిట్ మెయిల్.కాం మాదిరిగానే 10 నిమిషాలపాటే పనిచేస్తుంది. అయితే 10 నిమిషాల గడువు ఆటోమాటిక్ గా పొడిగింపబడటం ఇందులో ఉన్న ప్రత్యేకత. అంటే.. మీ మెయిల్ ఇన్ బాక్స్ లోనికి ఏదైనా మెయిల్ వచ్చినప్పుడల్లా మీ ఐడి గడువు పొడిగింపబడుతూ ఉంటుందన్నమాట.
ఇక జెటేబుల్.ఆర్గ్ విషయానికొస్తే.. ఇతర అన్ని తాత్కాలిక ఈ-మెయిల్ సర్వీసుల కంటే కూడా అధునాతన, యాంటీ స్పామ్ టెక్నాలజీ కలిగినటువంటి సర్వీస్ ఇది. కొన్ని వెబ్ సైట్లు ఈ టెంపరరీ డిస్పోజబుల్ ఈ-మెయిల్ ఐడిలను స్పామ్ కింద పరిగణిస్తాయి. అలాంటి సమయంలో ఈ జెటేబుల్ మెయిల్ ఐడి అక్కరకొస్తుంది. ఇది మొదట మీ ఒరిజినల్ శాశ్వత ఈ-మెయిల్ ఐడిని గుర్తుంచుకుంటుంది. ఆ తర్వాత మీరు క్రియేట్ చేసుకున్న జెటేబుల్ మెయిల్ ఐడికి వచ్చే ఇన్ కమింగ్ మెయిల్స్ అన్నిటినీ మీ ఒరిజినల్ శాశ్వత ఈ-మెయిల్ ఐడికి చేరవేస్తూ ఉంటుంది. మీరు పెట్టుకున్న గడువు తీరిపోగానే మీ జెటేబుల్ మెయిల్ ఐడి ఎవరికీ కనిపించదు.
మొత్తానికి ఈ డిస్పోజబుల్ ఈ-మెయిల్ ఐడిల కథా కమామిషు బాగుంది కదూ?!


Tags: mail Tips, Mails Tool, Gmail Tool, New Mail, Create Mail, How To Create New Mail in Telugu,