పాకిస్థాన్‌లో ఓ ప్రయివేటు బస్సులో బాంబు పేలి ఇద్దరు చిన్నారులతో సహ 11 మంది దుర్మరణం చెందారు. 22 మందికి తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉందని పోలీసు అధికారులు తెలిపారు. పాకిస్థాన్‌లోని బెలూచిస్థాన్ లోని ప్రావెన్స్ లో సోమవారం అర్దరాత్రి ఈ దారుణ సంఘటన జరిగింది. బెలూచిస్థాన్ ప్రావెన్స్ పోలీసు ఉన్నతాధికారి అల్మీష్ ఖాన్ కథనం మేరకు వివరాలు ఆ విధంగా ఉన్నాయి. దినసరి కూలీలు వారివారి స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రతి రోజు అర్దరాత్రి ఓ ప్రయివేటు బస్సు బస్ స్టాండ్ లో ఉంటుంది. ఎప్పటిలాగే సోమవారం అర్దరాత్రి ఆ బస్సు బస్ స్టాండ్ లో ఉంది. దినసరి కూలీలు బస్సులో ఎక్కారు. బస్సు బస్ స్టాండ్ నుంచి బయలుదేరడానికి చిన్నగా కదులుతున్నది. ఆ సమయంలో బస్ స్టాండ్ లోనే ఒక్క సారిగా బస్సు మీద అమర్చిన శక్తివంతమైన బాంబు పేలిపోయింది. 11 మంది సంఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆసుపత్రికి తరలించారు. అయితే శక్తివంతమైన బాంబు అమర్చింది ఎవరనేది ఇంకా తెలియడం లేదని మంగళవారం పోలీసు అధికారి అల్మీష్ ఖాన్ చెప్పారు. ఉగ్రవాదులు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. Source: telugu.oneindia.com