Wednesday, July 22, 2015

హైకోర్టు విభజన కుదరదు..


రాష్ట్ర విడిపోయిన తరువాత తెలంగాణ ప్రభుత్వానికి, ఆంధ్రా ప్రభుత్వానికి ఏదో విషయంపైన వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ లో అన్ని శాఖలలో దాదాపు విభజన జరిగిన కొన్ని అంశాలమీద ఇంకా ఇరు రాష్ట్రాలు గొడవ పడుతూనే ఉన్నారు. ఇందులో ముఖ్యంగా హైకోర్టు విభజన వివాదం. ఇటు తెలంగాణ రాష్ట్రానికి, అటు ఆంధ్రా రాష్టానికి ఉమ్మడిగా హైకోర్టు విభజనపై ఎప్పటినుంచో మల్లగుల్లాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం కూడా హైకోర్టును విభజించి తీరాల్సిందే అని పట్టుబడుతుంది. దీనికి అప్పట్లో హైకోర్టు కూడా తెలంగాణ వాదులకు ఘాటుగానే సమాధానమిచ్చింది. ఏపీలో హైకోర్టు ఏర్పాటయ్యేంత వరకు విభజించేది లేదని.. ఈ హైకోర్టు బాధ్యతను కేంద్రం పై పెడుతూ.. హైకోర్టు నిర్మాణానికి కావలసిన అనువైన స్థలాన్ని కేంద్రమే చూడాలని.. దానికి అయ్యే వ్యయాన్ని కూడా కేంద్రమే పెట్టుకోవాలని ఆదేశించింది. అయితే ఇప్పుడు మళ్లీ ఈ విషయంపై ఉమ్మడి హైకోర్టులో వాదనలు జరిగాయి. రాష్ట్ర విభజన జరిగి సంవత్సరం గడిచినా న్యాయస్థాన విభజన ఇంకా జరగలేదని.. కింది స్థాయి న్యాయాధికారులను, కోర్టు సిబ్బందిని విభజించాలని కోరుతూ పిటిషన్ దాఖలైన నేపథ్యంలో దానిపై విచారణ జరిపిన హైకోర్టు ఇరు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న హైకోర్టును విభజించడం ఇప్పుడు కుదరదు చెప్పింది. 'ఉమ్మడి హైకోర్టును విభజించడం కాదు... ఆంధ్రప్రదేశ్‌కు హైకోర్టు ఏర్పాటు చేయాలి' అని తేల్చిచెప్పింది. హైకోర్టు విభజన జరగకుండా కింది స్థాయి న్యాయాధికారులను విభజించడం సరికాదని.. ముందు చట్ట ప్రకారం హైకోర్టు విభజన జరగాలని.. ఆ తరువాత న్యాయాధికారులను విభజించడం జరుగుతుందని సూచించారు. ముఖ్యంగా ఏపీ హైకోర్టు నిర్మాణంపై కేంద్రం చొరవ తీసుకోవాలని.. గతంలో సూచించినట్టు ఏపీ హైకోర్టు భవన నిర్మాణానికి ఇంతవరకు ఎన్ని నిధులు కేటాయించారు, ఎప్పుడు కేటాయించారో చెప్పాలని.. దీనికి సంబంధించి కౌంటర్ ను ఈ నెల 30లోగా దాఖలు చేయాలని ఆదేశించింది