ఉద్యోగుల తాత్కాలిక విభజన ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చింది. శుక్రవారం జరిగిన కమల్‌నాథన్ కమిటీ భేటీలో పలు అంశాలపై క్లారిటీ వచ్చింది. 4 శాఖలు మినహా మిగతా అన్ని శాఖల్లోనూ... ఉద్యోగుల విభజన దాదాపుగా పూర్తయింది. ఈ నెలాఖరులోపు 90 శాతం వరకు ఉద్యోగుల పంపిణీ పూర్తవుతుంది. ఇవాళ మరోసారి కమలనాథన్ కమిటీ భేటీ కానుంది. పలు శాఖలపై ఏకాభిప్రాయం.. ఉద్యోగుల తాత్కాలిక విభజనపై కమల్‌నాథన్ కమిటీ కసరత్తులు చేసింది. తెలంగాణ సచివాలయంలో ఇరు రాష్ట్రాల సీఎస్‌లు... కమిటీతో శాఖల వారీగా ఉద్యోగుల విభజనపై చర్చించారు. మొత్తం పదిశాఖల విభజనపై ఏకాభిప్రాయం కుదరింది. హోం, అగ్రికల్చర్, ప్లానింగ్, మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్, రెయిన్ షాడో ఏరియా డెవలప్‌మెంట్ , వికలాంకుల సంక్షేమం, కుటుంబ సంక్షేమశాఖ, భూగర్భజల, గ్రామీణ నీటిపారుదల శాఖల్లో ఉద్యోగుల విభజనపై ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. మరో 16 శాఖలపై రానున్న క్లారిటీ.. ఈ రోజు జరిగే భేటీలో మరో 16 శాఖల ఉద్యోగుల విభజనపై క్లారిటీ ఇవ్వనుంది. సంక్షేమశాఖ, పాఠశాల విద్య, పంచాయతీరాజ్, విద్యుత్, దేవాదాయ, ఉద్యానవనశాఖ, ఢిల్లీలోని ఏపీభవన్ వంటి కీలక శాఖల గురించి సీఎస్‌లు చర్చించనున్నారు. ఇది పూర్తైతే 60 శాఖల ఉద్యోగుల విభజన పూర్తైనట్లే. ఐతే ఉద్యోగుల సంఖ్య తేలని పోలీసు, టాస్క్‌ఫోర్స్, మెడికల్ అండ్ హెల్త్, ప్రొటోకాల్ శాఖల్లో మాత్రం ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరటం లేదు. దీంతో ఆయా శాఖల విభజన మరింత ఆలస్యమయ్యే అవకాశముంది. ఐతే ఉద్యోగుల సంఖ్యను తేల్చేందుకు ఈ నెల 12న కమల్‌నాధన్ కమిటీ ప్రత్యేకంగా భేటీ కానుంది. జూన్ చివరికల్లా పూర్తికానున్న తాత్కాలిక విభజన.. ఈ నాలుగు శాఖలు మినహా అందరు ఉద్యోగుల విభజనను జూన్ చివరికల్లా పూర్తి చేయనుంది. ఈ నాలుగు శాఖల్లో జిల్లాల వరకు ఏ సమస్యా రాకున్నా హైదరాబాద్‌లో పనిచేసే ఉద్యోగుల్లో మాత్రం సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఆయా శాఖలను రాష్ట్రపతి ఉత్తర్వుల్లో రాష్ట్రస్థాయి శాఖలుగా పరిగణించాల్సి ఉంది. కాని విభజన చట్టంలోని 18జీ, 18ఎఫ్‌లలో మాత్రం ఎక్కడి ఉద్యోగులు అక్కడే పనిచేయాలని పేర్కొన్నారు. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య అంగీకారం కుదిరితే తప్ప విభజన ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చేలా లేదు. సూపర్ న్యూమరి పోస్టులపై క్లారిటీ కరువు.. అంతేగాక సూపర్ న్యూమరీ పోస్టులపై కూడా ఇరురాష్ట్రాలు క్లారిటీ ఇవ్వటం లేదు. మొదట్లో ఇద్దరు సీఎంలు ఒక అవగాహనకు వచ్చినా.. కమిటి భేటీలో మాత్రం భిన్న వాదనలు వినిపిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఉత్పన్నమైన ఖాళీల్లో... ప్రస్తుతం ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగులను భర్తీ చేసేందుకు తెలంగాణ సర్కార్ ఓకే చెప్పింది. కాని అందుకు ఏపీ ప్రభుత్వం మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ వివాదంపై కమల్‌నాథన్ కమిటీ తదుపరి సమావేశాల్లో చర్చించనుంది. జులైలో అభ్యంతరాల స్వీకరణ.. ఇక ఉద్యోగుల విభజనపై జులైలో అభ్యంతరాలను స్వీకరిస్తామని కమిటీ స్పష్టం చేసింది. మొత్తానికి ఎన్నో చర్చలు, మరెన్నో గందరగోళాల మధ్య.... ఉద్యోగుల విభనన తుదిదశకు చేరుకుది. ఐతే తాత్కాలిక విభజనకే ఏడాది సమయం పడితే...శాశ్వత విభజనకు, కోర్టు వివాదాల పరిష్కారానికి మరెంత కాలం పడుతుందోనని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.