Tuesday, June 16, 2015

ఆ కాలమ్ ఎందుకు చేర్చలేదు?


యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల్లో థర్డ జెండర్ కాలమ్ ను చేర్చకపోవడంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై మంగళవారం జస్టిస్ ముక్త గుప్తా, పీఎస్ తేజీలతో కూడిన న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వం, యూపీఎస్ ఈలకు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై సుప్రీం స్పష్టమైన తీర్పు ఉన్నప్పటికీ తగిన చర్యలు తీసుకోకపోవడంపై కోర్టు మండి పడింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ట్రాన్స్ జెండర్ల పట్ల వివక్ష తగదని కోర్టు పేర్కొంది. జెండర్ కారణంగా ట్రాన్స్ జెండర్స్ ను ఎలా అడ్డుకుంటారని కోర్టు ప్రశ్నించింది. కాగా ఆగస్టు 23 న జరిగే ఈ పరీక్షకోసం ఇచ్చిన ప్రకటనలో్ థర్డ్ జెండర్ కాలమ్ లేకపోవడంపై దాఖలైన పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. దీనిపై జూన్ 17 లోపు దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని యూపీఎస్ సీని ఆదేశించింది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు జూన్ 19తో ముగియనుంది కనుక ఈ లోపుగానే వివరణ ఇవ్వాలని కోర్టు కోరింది. కాగా ట్రాన్స్ జెండర్ లను మనుషులుగా గుర్తించాలని, విద్యా, ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పించాలని దాఖలైన పిటిషన్ పై ఏప్రిల్ 15, 2014 సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పును వెలువరించింది. సామాజికంగా,ఆర్థికంగా వెనుకబడిన వారిని వెనుబడిన తరగతులవారికి వర్తించే అన్ని రిజర్వేషన్స్ వర్తింప చేయాలని, వారికోసం ప్రత్యేకంగా థర్డ్ జెండర్ కాలమ్ ను చేర్చాలని కేంద్రం ప్రభుత్వం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కొన్ని సంస్థలు స్పందించిన ఈ ఆదేశాలను అమలు చేస్తున్నాయి కూడా.