దేవాలయాల సంప్రదాయం భారతదేశంలో ఎప్పుడు, ఎక్కడ మొదలయిందో తెలుసుకునే దిశగా విశ్వసించదగిన పరిశోధన జరగలేదు. మహాభారతంలో దేవాలయాల ప్రస్తావన లేదు. అందులో పురోహితులే తప్ప పూజారులు కనిపించరు. భాగవతంలో రుక్మిణీ కల్యాణం సందర్భంగా ‘అంబికాలయం’ ఉన్నట్టు చెప్పబడింది. ఇటు అయోధ్యలోనూ, అటు లంకలోనూ అనేక దేవాలయాలు ఉన్నట్టు రామాయణంలో కనిపిస్తుంది.
ఒకవైపు ఇంత భారీ సమ్మేళనం జరుగుతున్నా, మెసొపొటేమియాకు తూర్పు దిశగా ఉండే సింధూ నాగరికత మాత్రం దేవాలయాల సంప్రదాయాన్ని స్వీకరించలేదు. తవ్వకాల్లో బయటపడిన ప్రాచీన సింధూనాగరికతలో దేవాలయం ఆనవాళ్ళు లేవు. వాళ్ళ లిపిని ‘డిసెఫర్’ చేసే ఉపాయం ఇంతవరకు దొరక్కపోవడంతో, ఆ నాగరికుల విశ్వాసాలను గురించి ఊహాగానాలే తప్ప, నిర్ధారణకు వీలు కలగడం లేదు. బహుశా, వాటిల్లో కొన్ని ఆ తర్వాత వచ్చిన ఆర్యుల సంప్రదాయాలతో కలిసిపోయి ఉండవచ్చు. పూర్వకాలం ఆర్యుల్లో యజ్ఞయాగాది వైదిక కర్మలే గాని, విగ్రహారాధన లేదు. పై రెండు సంస్కృతుల సమ్మేళనంగా సింధూనది నుండి తూర్పుకు విస్తరించిన ‘హిందూ’ నాగరికతలో క్రీ.శ. 4వ శతాబ్దం దాకా కూడా ఉత్తర భారతదేశంలో దేవాలయం జాడే కనిపించదు. (దేవాలయాలు లేవంటే అసలు శిల్పమే లేదని కాదు; మౌర్యుల కాలం నాటికే శిల్పకళ బాగా అభివృద్ధి చెందిన దశకు చేరుకుంది.) ఆ తదుపరి ఉత్తరభారతదేశంలో ప్రవేశించిన జైన, బౌద్ధ మతాలకు విగ్రహారాధన లేకపోవడంతో, మెసొపొటేమియా, ఈజిప్టుల్లో దేవాలయాల నిర్మాణం ప్రారంభమైన కాలం నుండి కనీసం 4000 సంవత్సరాల దాకా ఉత్తర భారతదేశానికి ఆ సంప్రదాయం విస్తరించలేదు.
దేవాలయాల సంప్రదాయం భారతదేశంలో ఎప్పుడు, ఎక్కడ మొదలయిందో తెలుసుకునే దిశగా విశ్వసించదగిన పరిశోధన జరగలేదు. మహాభారతంలో దేవాలయాల ప్రస్తావన లేదు. అందులో పురోహితులే తప్ప పూజారులు కనిపించరు. భాగవతంలో రుక్మిణీ కల్యాణం సందర్భంగా ‘అంబికాలయం’ ఉన్నట్టు చెప్పబడింది. ఇటు అయోధ్యలోనూ, అటు లంకలోనూ అనేక దేవాలయాలు ఉన్నట్టు రామాయణంలో కనిపిస్తుంది. అయితే, భాగవత రామాయణాల రచనా కాలానికి సంబంధించిన ఆధారాలు అందుబాటు కాలేదు. శ్రీరాముని విషయం మహాభారతం అరణ్యపర్వంలో ఉటంకించడాన్ని బట్టి, ఆ వృత్తాంతం భారత రచనాకాలానికే ప్రాచుర్యంలో ఉందనడానికి సందేహం లేదు. రామాయణ కావ్యం ఉపోద్ఘాతంలో వాల్మీకి తన రచనను ‘ఆదికావ్యం’గా తనకు తానే చెప్పుకోవడంతో, అది భారతానికంటే ముందు రచనగా విశ్వాసం పాతుకుపోయింది.
మహాభారతం ఒక కావ్యంగా కాక, ఇతిహాసంగానూ పంచమ వేదంగానూ పరిగణించడం వల్ల, ఒక కావ్యంగా తనది మొదటిది అన్నాడో, లేక ఇతివృత్తాలతో సాగిన రచనల్లో తనది మొదటిదిగా వాల్మీకి భావించాడో చెప్పలేం. కొనామొదలు మహాభారతంలో తారసపడే వందలాది మహర్షుల జాబితాలో వాల్మీకి పేరు ఎక్కడా కనిపించదు. అరణ్యపర్వంలో రాముని కథ క్లుప్తంగా వివరించే సందర్భంలోనూ ఆ గాథ గ్రంథస్థమైన సూచన కనిపించదు. పైగా, భారతంలోని పాత్రలు వ్యాసునికి సమకాలికులైనా, వాళ్ళ వ్యవహారాలు జ్ఞాపకాల మీదా, మౌఖిక వర్తమానాల మీద నడిచాయే తప్ప లిఖితరూపమైన సందేశాలు ఎక్కడా కనిపించవు. ఇంతేకాక, భాషలోనూ, సామాజిక వ్యవస్థకు సంబంధించిన పలు అంశాల్లోనూ కనిపించే వ్యత్యాసం వల్ల రామాయణ రచనాకాలం భారతం కంటే ముందుందని చెప్పటానికి ప్రబలమైన విశ్వాసం మినహా మరో ఆధారం దొరకదు.
భారత, భాగవతాలు రెండూ వ్యాస విరచితాలేనని ప్రతీతి. ఆ రెండు రచనల మధ్య వ్యవధి ఎంతుందో తెలీదుగానీ, సారాంశంలో మాత్రం విపరీతమైన వ్యత్యాసం కనిపిస్తుంది. కథ రూపంలో వైదిక కర్మకాండను ప్రోత్సహించేది మహాభారతం. కానీ, క్రీ.పూ. 600 ప్రాంతంలో వైదిక కర్మల పట్ల నిరసనలు ప్రారంభమయ్యాయి. ప్రముఖంగా ‘చార్వాకులు’ అనబడే ఒక వర్గం వాటికి వ్యతిరేకమైన తర్కాన్ని ప్రజల్లో ప్రవేశపెట్టింది. యజ్ఞయాగాదుల్లో జరిగే జంతుబలిని నిరసించే ధోరణి అప్పటికే ప్రబలిందని మహాభారతం అశ్వమేథ పర్వం వివరించే ‘ముంగిస కథ’ మూలంగా వెల్లడౌతుంది. చార్వాకుల హింసావ్యతిరేక సిద్ధాంతంలో పుట్టిన ‘అహింసావాదం’ బౌద్ధానికీ జైనానికీ ప్రాణం పోసింది.