ఇంటర్‌నెట్ సమానత్వ వేదికగా ఉండాలంటూ లక్షలాది మంది నెటిజన్లు టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయి)కి తమ అభిప్రాయాలు వెల్లడించడం ప్రజల్లో పెల్లుబికిన చైతన్యానికి సూచన. ఇప్పటి వరకు ఇంటర్‌నెట్ ఎటువంటి అడ్డు లేకుం డా సమాచారాన్ని గ్రహించడానికి ఉపయోగపడుతున్నది. ఏ సైట్, ఎవరు యూజ ర్, ఏ సమాచారం అనే దానితో సంబంధం లేదు. చిరు వ్యాపారం చెట్టంత ఎదగడానికి, సృజనాత్మకత వెల్లివిరియడానికి ఇంటర్‌నెట్ వేదికయింది. గూగుల్, ఫేస్‌బుక్ వంటి సంస్థలు చిన్నగా మొదలై, భారీ సంస్థలుగా ఎదగడానికి ఈ పరిస్థితులే కారణం. కానీ ఇంటర్‌నెట్‌లో ఇటీవల ఒక వికృత పోకడ చోటు చేసుకోబోయింది. దీనివల్ల డబ్బు చెల్లించే బడా సంస్థల వెబ్ సైట్లను మాత్రమే వేగంగా అందుకునే అవకాశం ఉంటుంది. ఉచితంగా లభించే కొన్ని సాంకేతిక ప్రక్రియలు (అప్లికేషన్లు) డబ్బు చెల్లిస్తే తప్ప లభించవు. క్రమంగా విలువైన సమాచార గనులకు ఇంటర్‌నెట్ సర్వీసు ప్రొవైడర్ (ఐఎస్‌పీ)లు కాపలాదారులుగా మారిపోతాయి. ఇట్లా ఐఎస్‌పీ లు ఇంటర్‌నెట్‌లో అంతరాలు సృష్టించకుండా చిలీ ప్రభుత్వం ఇప్పటికే చట్టం చేసింది. అమెరికాలోనూ ప్రజల ఆందోళన మూలంగా ఒక చట్టం అమలులోకి వచ్చింది. యూరప్‌లో గతంలో చేసిన చట్టాన్ని సమీక్షిస్తున్నారు. మన దేశంలో ఎటువంటి విధానం అమలు చేయాలనే విషయమై ట్రాయి ఇటీవలే ప్రజల అభిప్రాయాలు కోరింది. దీంతో నెట్‌లో అంతరాలు లేకుండా సమానత్వం (నెట్ న్యూట్రాలిటీ) పాటించాలని లక్షలాది మంది తమ అభిప్రాయాలు వెల్లడించడం విశేషం. ఇంటర్‌నెట్‌లో సమానత్వం పాటించాలనే విషయమై దేశంలోని నెటిజన్లు భారీ ఎత్తున స్పందించడం హర్షణీయ పరిణామం. అయితే ఇప్పుడు తొలగిపోయింది చిన్న ప్రమాదం మాత్రమే. డిజిటల్ సమాచారాన్ని నియంత్రిం చే, డిజిటల్ విజ్ఞానం ద్వారా సమాజాన్ని నియంత్రించే అసలు ముప్పు ఇంకా పొంచి ఉన్నది. దీనిపై ఈ దశలోనే నెట్‌ను ఉపయోగిస్తున్న విద్యావంతులు అప్రమత్తం కావలసి ఉన్నది. ఈ కాగితాల కాలం ఎక్కువ రోజులు ఉండదు. ఇప్పటికే సమాచారమంతా డిజిటల్ రూపంలో నిక్షిప్తమవుతున్నది. భవిష్యత్తులో సమాచారం సేకరించాలన్నా, విజ్ఞానం సంపాదించాలన్నా, పరిశోధన చేయాలన్నా డిజిటల్ రూపంలోని సమాచారమే ఆధారమవుతుంది. ఈ డిజిటల్ లైబ్రరీలను కొన్ని సంస్థలు తమ పిడికిట బిగించి పెట్టుకుంటే పేద వారికి విజ్ఞానం అందుబాటులో ఉండదు. ధనవంతుల చేతిలో విజ్ఞానం బందీ అవుతుంది. ఇదే విధంగా డిజిటల్ సాధనాలతో మనిషిని పసిగట్టి అసమ్మతిని అణచివేసే రాజకీయ విధానాలు రాకుండా కూడా అడ్డుకోవడం అవసరం. నాడు పారిశ్రామి విప్లవమైనా, నేడు డిజిటల్ విప్లవమైనా- విజ్ఞాన శాస్త్ర అభివృద్ధిని హర్షించవలసిందే. అదే సమయంలో ఈ విజ్ఞానం ఎవరి ప్రయోజనాలను నెరవేరుస్తున్నదనే ప్రశ్న కూడా విస్మరించలేనిది. డిజిటల్ ప్రపంచంలో ఈ గుత్తాధిపత్య పోకడను ముందే పసిగట్టి ఎదిరించిన అమెరికా మేధావి, నెట్ కార్యకర్త ఆరాన్ స్వార్‌ట్జ్ బలిదానం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలె. ఆరాన్ స్వార్‌ట్జ్‌కు బాల మేధావిగా గుర్తింపు ఉన్నది. ఆరెస్సెస్ వెబ్ ఫీడ్ ఫార్మాట్, మార్క్‌డౌన్ పబ్లిషింగ్ ఫార్మాట్, రెడిట్ సోషల్ న్యూస్ సైట్ రూపకల్పనలో ఆయన భాగస్వామ్యం ఉన్నది. అయితే అంతకు మించి నెట్‌ను రాజకీయ దుర్మార్గాన్ని వెంటాడడానికి ఉపయోగించుకోవడం ద్వారా పోరాట యోధుడయ్యాడు. కోర్టు దస్తావేజులను మూల్యం చెల్లిస్తే తప్ప చూడలేని వ్యాపార కుట్రను కనిపెట్టి, ఆన్‌లైన్ ద్వారా వాటిని బహిర్గతం చేశాడు. ఇంటర్‌నెట్ సెన్సార్‌షిప్ చట్టానికి (సోపా) వ్యతిరేకంగా పోరాడి దానిని నిలిపివేయించడంలో కీలక పాత్ర పోషించాడు. పరిశోధనా పత్రాలను గోప్యంగా పెట్టి ధనవంతులకే అందుబాటులో పెట్టడాన్ని ప్రశ్నించాడు. ఈ క్రమంలో మందుల కంపెనీలకు, పరిశోధనలకు గల అక్రమ బంధాన్ని బయటకు లాగాడు. పరిశోధనా పత్రాలు అందరికీ అందుబాటులో ఉండాలనే తన ఉద్యమంలో భాగంగా- ఒక సంస్థ వెబ్ సైట్ నుంచి పరిశోధన జర్నల్స్ భారీ ఎత్తున డౌన్‌లోడ్ చేసుకున్నాడు. ఈ కారణాన్ని చూపి ప్రభుత్వం ఆయనపై ఉక్కు పాదం మోపింది. భారీ జరిమానాతో పాటు ముఫ్ఫై ఏండ్ల ఖైదు చేయడానికి అభియోగం సిద్ధం చేసింది. ఓపెన్ లైబ్రరీ ఉద్యమాన్ని నడిపి, క్రియేటివ్ కామన్స్ వేదికను సృష్టించిన ఈ 26 ఏండ్ల ఉద్యమకారుడు వేధింపులను, భారీ శిక్ష తప్పించుకోవడానికి ఆత్మహత్య చేసుకున్నాడు. విజ్ఞానానికి సంకెళ్ళు వేయడం మాత్రమే కాదు, డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా- చాటింగ్, షాపింగ్ మొదలుకొని మనిషి ప్రతి కదలికను నమోదు చేసి నిరంతర నిఘా వేసేందుకు అమెరికాలో రంగం సిద్ధమవుతున్నది. ఈ ప్రయోగం ఇవాళ కాకుంటే రేపు ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు అమలు చేస్తాయనడంలో సందేహం లేదు. నెట్ సమానత్వాన్ని కోరడంతో సరిపోదు. నెట్ ద్వారా నిరంకుశ రాజ్య స్థాపన జరగకుండా అడ్డుకోవడానికి కూడా ప్రజలు సంసిద్ధులు కావాలె.