Saturday, March 21, 2015

ప్రాణహితకు జాతీయ హోదా ఇవ్వాలి


రాజ్యసభలో తెలంగాణ ఎంపీల డిమాండ్ న్యూఢిల్లీ, నమస్తే తెలంగాణ:ప్రాణహిత- చేవెళ్ల సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని రాష్ట్ర ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుల సంఖ్యను 50 నుంచి 58కి పెంచడానికి ఉద్దేశించిన బిల్లుపై రాజ్యసభలో శుక్రవారం చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ ఈ అంశాన్ని లేవనెత్తారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలను నెరవేర్చటంతోపాటు కృష్ణా, గోదావరి జలాల పంపకాలపై కూడా కేంద్రం సత్వర చర్యలు తీసుకోవాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయడంతో ఆ ప్రాంత ఉద్యోగుల ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చి వీరికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఏపీ శాసనమండలి సభ్యుల సంఖ్యను పెంచడంతోపాటు తెలంగాణ, ఏపీ శాసనసభ సభ్యుల సంఖ్యను కూడా పెంచాలని కోరారు. ఎంకే ఖాన్ మాట్లాడుతూ రెండు రాష్ర్టాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. వీ హనుమంతరావు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకు సత్వరం జాతీయ హోదా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు విషయంలో మాత్రం తాత్సారం చేస్తున్నదని విమర్శించారు. హైకోర్టు విభజన, ప్రాణహిత-చేవెళ్ళకు జాతీయ హోదా, గిరిజన, ఉద్యానవన విశ్వవిద్యాలయాలు వంటి హామీలేవీ నోచుకోలేదన్నారు. రేణుకాచౌదరి మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ఎంపీలు, రాజకీయ పార్టీలు, రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రులు తెలుగు రాష్ర్టాల అభివృద్ధి, సంక్షేమం కోసం పని చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో అనేక లోపాలున్నాయని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీడీపీ ఎంపీ సీఎం రమేశ్, కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం నిధులివ్వాలని సుబ్బిరామిరెడ్డి కోరారు. విభజన బిల్లులో తీవ్రమైన లోపాలేమీ లేవని కాంగ్రెస్ సభ్యుడు జేడీ శీలం అన్నారు. నాడు సమర్థించిన బీజేపీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అమలుచేయడంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నదని ప్రశ్నించారు. విభజన చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సవరణలను ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు రాజ్యసభ శుక్రవారం ఆమోదం తెలిపింది. నాలుగు రోజుల క్రితమే లోక్‌సభ ఈ బిల్లును ఆమోదించిం ది. ఈ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో సభ్యుల సంఖ్యను 50 నుంచి 58కి పెంచడానికి ఉద్దేశించిన ఈ బిల్లును సభలో ఎవ్వరూ వ్యతిరేకించలేదు. దీంతో బిల్లును సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది.