Friday, March 20, 2015

43 ఏళ్లు మగవాడిలా....


43 ellu magavaadila....


కన్న కూతురును పెంచి పెద్ద చేయడం కోసం 43 ఏళ్లపాటు ముమ్మూర్తులా మగవాడిలా బతికిన ఆ మాతృమూర్తి గొప్పతనాన్ని ఏ అవార్డులతో తూచగలం? అయినా లగ్జర్ సోషల్ సాలిడారిటీ డైరెక్టరేట్ తనవంతు కర్తవ్యంగా మంగళవారం ఆమెను *ఏ విమన్ బ్రెడ్ విన్నర్* అవార్డుతో సత్కరించి 'కైరో ఆదర్శ మాతృమూర్తి'గా కీర్తించింది. 64 ఏళ్ల ఆ మాతృమూర్తి పేరు సిసా అబూ దాహ్. కైరోకు 635 కిలోమీటర్ల దూరంలో ఉన్న లగ్జర్ గవర్నేట్ రాజధాని నగరమైన లగ్జర్‌లోనే ఆమె జీవితమంతా గడిచింది. తన 21వ ఏట కన్న కూతురు కడుపులో ఉండగానే కట్టుకున్న భర్త కన్నుమూశాడు. అప్పటికి ఆస్తిపాస్తులు అసలే లేవు. నా అనే వాళ్లు అంతకన్నా లేరు. వారి కమ్యూనిటీలో స్త్రీలు బయటకెళ్లి కూలి పనిచేయడం నేరం. బిచ్చమెత్తుకొని జీవించడం ఆమెకు ఇష్టం లేదు. అలాంటి పరిస్థితుల్లో పురుషుడి అవతారం ఎత్తక తప్పలేదు. ఎక్కడా స్త్రీత్వం ఆనవాళ్లు కూడా కనిపించకుండా జుట్టు కత్తిరించుకొని వదులుగా ఉండే మగవాడి దుస్తులేసుకొని కూలి పనులకు వెళ్లడం ప్రారంభించింది. మగవాడిలానే మాట్లాడడం అలవాటు చేసుకొంది. భవన నిర్మాణ పనుల్లో ఇటుకలు మోసింది. సిమెంటు బస్తాలు భుజాన వేసుకొంది. ఖాళీ సమయాల్లో షూ పాలిష్ చేసింది. అలా వచ్చిన సంపాదనతో కూతురును పెంచి పెద్ద చేయడమే కాకుండా పెళ్లి కూడా చేసింది. కష్ట పడేవారికే కష్టాలు కాచుకు కూర్చుంటాయన్నట్టుగా అనారోగ్యం వల్ల అల్లుడు మంచం పట్టాడు. మళ్లీ కుటుంబపోషణ భారమంతా తనపైనే పడింది. పరిస్థితులకు ఎదురీదక తప్పలేదు. వయస్సు మీద పడటంతో ఈసారి మాత్రం బరువు పనుల జోలికి వెళ్లకుండా బూటు పాలిష్‌ను వృత్తిగా చేసుకొంది. లగ్జర్ నగర వీధుల్లో నేటికి కనిపించే సీసా అబూను ఎవరూ మహిళ అనుకోరు. దాదాపు 43 ఏళ్ల పాటు మగవారితో కలిసి పనిచేసినా, వారి వెంట తిరిగినా ఎవరు తనను స్త్రీ అని ఇంతవరకు గుర్తించలేదని ఆమే తెలిపారు. అందువల్ల మగవారి వేధింపులను కూడా తాను ఎన్నడూ ఎదుర్కోలేదని చెప్పారు. ఆ ఆదర్శ మాతృమూర్తికి హాట్సాప్!