Tuesday, February 10, 2015

రాజ్యాంగ పీఠికపై వివాదం

 



సెక్యులర్, సోషలిస్ట్ పదాల తొలగింపు వాదనపై వెల్లువెత్తిన విమర్శలు
చెన్నై/పాట్నా: రాజ్యాంగ పీఠిక నుంచి సోషలిస్ట్, సెక్యులర్ పదాలను తొలగించాలన్న మిత్రపక్షం శివసేన డిమాండ్‌పై చర్చకు సిద్ధమని ఎన్డీయే సర్కారు పేర్కొనడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఆ పదాలు లేని పాత రాజ్యాంగ పీఠిక చిత్రాన్ని ప్రచురించి ఓ ప్రకటన విడుదల చేయడం కూడా వివాదాస్పదమైంది. ఈ అంశంపై ప్రతిపక్షాలతోపాటు మిత్రపక్షం పీఎంకే కూడా కేంద్ర ప్రభుత్వంపై మండిపడింది. పలు ఇతర వర్గాలు కూడా కేంద్రం వైఖరిపై ఆందోళన వ్యక్తం చేశాయి. విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో  కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పందిస్తూ తమకు ఆ పదాలను తొలగించే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. రాజ్యాంగం నుంచి సోషలిస్ట్, సెక్యులర్ పదాలను తొలగించాలని శివసేన డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

  ఈ అంశంపై చర్చ జరగాలని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ సూచించడంపై షాక్‌కు గురైనట్లు పీఎంకే పేర్కొంది. అభివృదే ్ధ ఎజెండాగా అధికారంలోకి వచ్చిన ఎన్డీయే సర్కారు దానికే కట్టుబడి ఉండాలని ఆ పార్టీ నేత ఎస్.రాందాస్ హితవు పలికారు. దీనిపై కాంగ్రెస్ స్పందిస్తూ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. మోదీ సర్కారు అజెండాకు ఇది నిదర్శనమని, సమగ్రత విషయంలో బీజేపీపై ఇప్పటికే అనుమానాలు ఉన్నాయని వ్యాఖ్యానించింది.