గోవా కొత్త ముఖ్యమంత్రిగా లక్ష్మీకాంత్ పర్సేకర్ ఎంపికయ్యారు. ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుడు రాజీవ్ ప్రతాప్ రూడీ వెల్లడించారు. లక్ష్మీకాంత్ పర్సేకర్ శనివారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. గోవా ముఖ్యమంత్రిగా ఇప్పటి వరకూ బాధ్యతలు నిర్వర్తించిన మనోహర్ పారికర్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించాల్సిందిగా నరేంద్రమోడీ కోరిన నేపథ్యంలో మనోహర్ పారికర్ రాజీనామా చేశారు. ఆయన ఆదివారం నాడు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పారికర్ రాజీనామాతో గోవా కొత్త ముఖ్యమంత్రి ఎవరన్న విషయంలో భారీ స్థాయిలో పోటీ ఏర్పడింది. లక్ష్మీకాంత్ పర్సేకర్ ముఖ్యమంత్రి పదవికి అర్హుడని అందరూ భావిస్తున్నప్పటికీ మరో ముగ్గురు సీనియర్ నాయకులు కూడా ఈ పదవికి పోటీ పడటంతో సస్పెన్స్ నెలకొంది. అయితే బీజేపీ జాతీయ కార్యవర్గం శనివారం ఉదయం సమావేశమై లక్ష్మీకాంత్ పర్సేకర్‌నే గోవా ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోపెట్టాలని నిర్ణయించింది.