ప్రధాని నరేంద్ర మోదీ తన విదేశీ పర్యటనకు ముందు కేంద్ర కేబినెట్ ను విస్తరించే అవకాశాలున్నాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి. గోవా సీఎం మనోహర్ పారికర్ ను రక్షణ మంత్రిగా నియమించే అవకాశముందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అదనంగా రక్షణ శాఖను నిర్వహిస్తున్నారు. అనారోగ్యం కారణంగా రక్షణ శాఖను మరొకరికి కేటాయించాలని ఆయన కోరుతున్నారు. ఈనేపథ్యంలో పారికర్ ను రక్షణ మంత్రిగా నియమించాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా కుమారుడు జయంత్ సిన్హా, చంద్రపూర్ బీజేపీ ఎంపీ హన్స్ రాజ్ అహిర్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, రాజీవ్ ప్రతాప్ రూడీలకు విస్తరణలో మంత్రి పదవులు దక్కే అవకాశముంది. సహాయ మంత్రులుగా ఉన్న ప్రకాశ్ జవదేకర్, నిర్మలా సీతారామన్ లకు కేబినెట్ ర్యాంకుకు ప్రమోషన్ దక్కే అవకాశముందని విశ్వసనీయ వర్గాల సమాచారం. నవంబర్ 12న మోదీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. నవంబర్ 9-12 మధ్య కేబినెట్ విస్తరణ ఉండే అవకాశముందని అంటున్నారు.