Sunday, November 2, 2014

వ్యభిచారం చట్టబద్దమైన వృత్తి చేయాలన్న డిమాండ్లు



మన దేశంలో వ్యభిచారం నేరం. కానీ చాలా దేశాల్లో ఇది ఓ వృత్తి. అందులోనూ చట్టబద్దమైన వృత్తి. ఇప్పుడు మనదేశంలోనూ వ్యభిచారాన్ని చట్టబద్దం చేయాలన్న డిమాండ్లు వస్తున్నాయి. అవి.. కూడా ఎక్కడి నుంచో కాదు.. సాక్షాత్తూ.. జాతీయ మహిళా కమిషన్ నుంచే. వ్యభిచారంలో ఉన్న మహిళల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు సుప్రీంకోర్టు నియమించిన కమిటీకి జాతీయ మహిళా కమిషన్.. ప్రొస్టిస్టూషన్ ను చట్టబద్దం చేయమని సిఫారసు చేయాలని భావిస్తోందట. దేశంలో వ్యభిచారాన్ని చట్టబద్ధం చేయడం ద్వారా సెక్స్ వర్కర్లకు.. ఇప్పటి కంటే.. మంచి జీవితాన్ని అందించవచ్చునని మహిళా కమిషన్ కమిటీకి చెబుతుందట. వ్యభిచార వృత్తిలో కొనసాగుతున్న వారికి పునరావాసం కల్పించాలని కోరుతూ మూడేళ్ల క్రితం ఓ వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యభిచార వృ‌త్తిలో ఉన్న మహిళల వివరాలను అందజేయాలని సుప్రీం కోర్టు కోరింది. ఈ వృత్తిలో కొనసాగాడానికి ఇష్టపడుతున్న మహిళల వివరాలను కమిటీకి అందిస్తామని మహిళా కమిషన్ ఛైర్మన్ కుమారమంగళం తెలిపారు. నవంబర్ 8 నాటికి సుప్రీంకోర్టు నియమించిన కమిటీకి జాతీయ మహిళా కమిషన్ తన నివేదికను అందజేయాల్సి ఉంది. చట్టబద్దం చేసే అంశంలో ఎలాంటి విషయాలను పరిగణలోకి తీసుకోవాలో కమిటీకి వివరిస్తామని కూడా కుమారమంగళం చెప్పారు. ఇదే తరహా నివేదిక సుప్రీంకోర్టుకు అందితే.. అది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించకమానదు. సంప్రదాయవాదులు దీన్ని పెద్దఎత్తున వ్యతిరేకించే అవకాశం ఉంది. కానీ వాస్తవికంగా ఆలోచిస్తే.. కొన్ని నిబంధనలు, నియంత్రణలు రూపొందించి వ్యభిచారాన్ని చట్టబద్దం చేయడమే మేలంటున్నారు ఈ వృత్తిలోని మహిళల సాధక బాధకాలు తెలిసిన నిపుణలు.