డీఎస్సీ నియామకాలు చేపట్టేదాకా పాఠశాలల్లో చదువులకు ఇబ్బంది కలగకుండా  ఉండటానికిగాను విద్యా వాలంటీర్ల మాదిరిగా అర్హులైన వారిని బోధకులుగా  నియమించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. వీరిని విద్యా బోధకులు  (అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్స్) అని పిలుస్తారు. సుమారు 5 నుంచి 10 వేల దాకా ఈ  సంఖ్య ఉండొచ్చని ప్రాథమిక అంచనా! పూర్తి సమాచారం వచ్చాక ఈ సంఖ్య నిర్ధారణ  అవుతుంది. వీరికి చెల్లించే వేతనాలకు సంబంధించిన బడ్జెట్ అవకాశాలను కూడా  పరిశీలిస్తున్నారు. ఈ విషయమై పాఠశాల విద్యాశాఖలో కసరత్తు ఆరంభమైంది. వారం  పది రోజుల్లో ఖాళీల సంఖ్య తేలి, కసరత్తు ఓ కొలిక్కి వస్తుందని సమాచారం.  అంతా సవ్యంగా సాగితే.. పదిరోజుల్లో ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందే  అవకాశాలున్నాయి.తెలంగాణలో ఎన్ని ఉపాధ్యాయ ఖాళీలున్నాయనే దానిపై ఇంతదాకా  కచ్చితమైన లెక్కలు లేవు. అన్ని జిల్లాల అధికారుల నుంచి దీనికి సంబంధించిన  వివరాలు సేకరిస్తున్నారు. అంతేకాక డిప్యూటీ ఈవో, ఎంఈవో, జేఎల్, డైట్  కాలేజీ లెక్చరర్ల పదోన్నతుల వ్యవహారం కూడా తేలితే మొత్తం టీచర్ల ఖాళీల  సంఖ్యపై స్పష్టత వస్తుంది. ఈ లెక్కలన్నింటినీ తేల్చి ఏడాది లోగా డీఎస్సీ  నిర్వహిస్తామని రాష్ట్ర                 విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే  విద్యాహక్కు చట్టం ప్రకారం ఖాళీలుంచకూడదు. అందుకోసమని మధ్యేమార్గంగా నిరుడు  అవిభాజ్య రాష్ట్రంలో కూడా దాదాపు పదివేలమందిని విద్యాబోధకులుగా నియమించి  వారికి నెలకు 6 వేల రూపాయల వేతనం చెల్లించారు. ఈసారి కూడా తెలంగాణ  రాష్ట్రంలో బడ్జెట్ కేటాయింపులకున్న అవకాశాల్ని పరిశీలించి బోధకులను  నియమించాలని యోచిస్తున్నారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాక, నియామక  నిబంధనల్ని కూడా రూపొందిస్తారు. ప్రాథమిక నుంచి ఉన్నత పాఠశాల దాకా  అర్హులైన వారిని నియమిస్తారు.రాష్ట్రంలోని వివిధ పాఠశాలల్లో తాత్కాలిక  బోధకులుగా ఆర్ట్, క్రాఫ్ట్, వ్యాయామ ఉపాధ్యాయుల నియమాకాలకు సంబంధించి  తలెత్తిన ప్రతిష్ఠంభన కూడా వారం రోజుల్లో తేల్చేయటానికి అధికారులు కసరత్తు  చేస్తున్నారు. ఈ తాత్కాలిక పోస్టుల నియామకాలు కొద్దిరోజుల కిందట ఆగిపోయాయి.  సర్వశిక్ష అభియాన్ కింద తాత్కాలిక పద్ధతిలో వీరి నియామాకాలకు సంబంధించి  ప్రకటన రావటం.. కొద్దిరోజుల కిందటిదాకా ఎంపికలు కూడా జరిగాయి. 12వ తేదీ  నుంచి వీరిని విధుల్లోకి తీసుకోవాలంటూ జారీ చేసిన ఆదేశాలను ఉన్నట్టుండి  ఆపేశారు. నిరుడు ఆయా పోస్టుల్లో కొనసాగిన ఉపాధ్యాయుల సర్దుబాటులో తలెత్తిన  సమస్యలు జటిలమవటంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు సమాచారం. నిబంధనల ప్రకారం 6  నుంచి 8 తరగతుల్లో 100కు మించి విద్యార్థులున్న పాఠశాలల్లో మాత్రమే ఈ  పోస్టులను నియమించాలని నిర్దేశించారు. ఆ ప్రకారం చూసినప్పుడు ఈసారి కొన్ని  స్కూళ్లలో 100 విద్యార్థుల సంఖ్య కొన్నింట తగ్గగా కొన్నింట పెరిగింది.  దీంతో పోస్టులుండే స్కూళ్లు మారిపోయాయి. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రం  మొత్తంలో 1400 తాత్కాలిక పోస్టులుండగా.. ఈ ఏడాది 1077 మందిని తిరిగి  తీసుకున్నారు. మిగిలిన సుమారు 300 మందిని సర్దుబాటు చేయటానికున్న  అవకాశాల్ని పరిశీలిస్తున్నట్లు తెలిసింది.