Thursday, April 3, 2014

ఇష్టపడి చదవడంవల్లే గేట్‌లో ఫస్ట్



జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గేట్ నగాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్-2014) పరీక్షా ఫలితాల్లో మైనింగ్ ఇంజినీరింగ్ విభాగంలో 988 మార్కులు సాధించి ప్రథమ ర్యాంకు సాధించాడు గోపు భరత్‌రెడ్డి. ఈ సందర్భంగా కరీంనగర్ నివాసి అయిన భరత్‌రెడ్డిని ఫోనులో టీమీడియా ఇంటర్వ్యూ చేసింది. ఆయన మాటల్లో... ప్రస్తుతం నేను జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్‌బాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైనింగ్‌లో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాను. మరో మూడు నెలల్లో ఇంజినీరింగ్ కోర్సు పూర్తవుతుంది. వెంటనే ప్రభుత్వ ఉద్యోగం చేస్తాను. ఉద్యోగం చేస్తూనే ఉన్నత చదువులు చదువాలన్నది నా కోరిక. ఇప్పుడే విదేశాలకు వెళ్లాలని లేదు. నేను సీనియర్ల సలహాలు, సూచనల మేరకు గేట్ పరీక్షకు సిద్ధమయ్యాను. రెండు మూడు నెలలు అంకుఠిత దీక్షతో ఇష్టపడి చదివాను. ప్రథమర్యాంకు వస్తుందని ఊహించలేదు. నా కష్టానికి ఫలితం దక్కింది. తాతయ్య రాజారెడ్డి (విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు, తండ్రి ఇంద్రాసేనారెడ్డిల స్ఫూర్తితోనే చదువంటే ఇష్టం కలిగింది. ఇల్లంతకుంట మండలం ఓగులాపూర్‌కు మాది. మా అమ్మానాన్నలు లక్ష్మీ, గోపు ఇంద్రాసేనారెడ్డి. వారు ప్రస్తుతం కరీంనగర్ మంకమ్మతోటలోని నివాసముంటున్నారు. నేను ప్రాథమిక విద్యను కరీంనగర్‌లోని సప్తగిరి కాలనీ లారెల్ స్కూల్‌లో, 6 నుంచి 10వ తరగతి వరకు డాన్‌బాస్కో స్కూల్‌లో చదివాను. పదిలో (2006-07)లో 552 మార్కులు సాధించాను. అనంతరం ఇంటర్ నారాయణ జూనియర్ కళాశాలలో చదివాను. ఐఐటీ అంటే ఇష్టముండటం వల్లనే ఎంట్రెన్స్‌లో ఆల్‌ఇండియా లెవెల్ ఓపెన్ కెటగిరిలో 5900 ర్యాంకు సాధించాను. జార్ఖండ్‌లో సీట్ వచ్చింది. పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే వారికి నేను చెప్పేదొక్కటే ఇష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చు. - జి. రాజేంద్రప్రసాద్, కరీంనగర్ ఎడ్యుకేషన్ రిపోర్టర్