Saturday, April 5, 2014

కనీస ఇంగ్లిష్ చాలు ఎన్నో ఉద్యోగావకాశాలు


పేరుకే పరాయి భాష అయిన ఇంగ్లిష్ మన నిత్య కార్యకలాపాల్లో భాగంగా మారిపోయింది. ఇక ప్రైవేట్ జాబ్స్‌కు ఇంగ్లిష్ పరిజ్ఞానం ఎంతో అవసరం అవుతుంది. అయితే ఆ పరిజ్ఞానం ఏ మేరకు, ఏ విధంగా సంపాదించుకోవాలో తెలుసుకుందాం. 'ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడగలగాలి'.... ఉద్యోగ ప్రకటనల్లో తరచూ ఇది కనిపించేదే. ఏ స్థాయిలో ఉద్యోగాలు తీసుకున్నా, ఆంగ్లంలో బాగా మాట్లాడడం తప్పని సరి అయింది. అయితే చాలా మందికి, చేయాలనుకున్న ఉద్యోగం, అలాగే ఏ స్థాయిలో ఆంగ్లం రావాలన్న అంశంపై కనీసం అవగాహన ఉండటం లేదు. గ్రామర్ పూర్తిగా నేర్చుకుంటే, ఆంగ్లం వస్తుందన్న అపోహ చాలా మందిలో ఉంది. నిజానికి గ్రామర్‌కు పాఠశాల స్థాయిలో నేర్చుకున్న ఆంగ్లం సరిపోతుంది.  ఇంగ్లీష్ బాగా మాట్లాడాలంటే ఎక్కువ సంఖ్యలో పదాలు, సందర్భాని కనుగుణంగా మాట్లాడగలిగే నేర్పు, అవసరం. అయితే ఎంపిక చేసుకున్న ఉద్యోగంలో, తటస్థించే సందర్భాలకు, అవసరమైన మేర పదాలను తెలుసుకుంటే సరిపోతుంది. వాటిని ఉపయోగించే విధానంపై పట్టు సాధిస్తే, కోరుకున్న ఉద్యోగాన్ని సాధించవచ్చు. ఉద్యోగ అవకాశాల్లో భాగంగా, భిన్న రంగాలకు వెళుతున్న వారెందరో ఉంటారు. వారు ఏ ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నారో, దానికి సంబంధించిన ఆంగ్ల పరిజ్ఞానం పెంచుకుంటే సరిపోతుంది. సేల్స్ రంగం సేల్స్ రంగంలోకి వెళ్లాలనుకున్న వారికి, అనర్గళంగా మాట్లాడే నేర్పు తప్పదు. కేవలం ఇంగ్లీషే కాదు, తెలుగు లేదా మరే భాష అయినా సరే, ఈ ఉద్యోగాలను కోరుకునే వారు పదాల కోసం వెతుక్కోకూడదు. ఎదుటి మనిషిని కట్టిపడేసేలా మాటలను చెప్తూ ముందుకు వెళ్లాలి. అయితే పెద్ద సంస్థలు, లేదా వైద్య రంగానికి సంబంధించిన సంస్థలు ఆంగ్లం బాగా మాట్లాడగలిగే వారికి ప్రాధాన్యం ఇస్తాయి. ఈ రంగంలోకి వచ్చే వాళ్లు, హాజరవుతున్న సంస్థ కార్యకలాపాలకు సంబంధించి పదాలను ఉపయోగించాల్సి వస్తుంది. ఉదాహరణకు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన సంస్థల్లోకి వెళితే.. 'బూమ్', డీడ్, వెంచర్... ఇలా అవసరం అయిన పదాల మేరకు తెలుసుకోవాలి. అదే మెడికల్ రిప్రెజెంటేటివ్‌గా వెళ్లాలనుకుంటే, వైద్య పరిభాషకు సంబంధించిన పదాలను తెలుసుకోవాలి. అంటే 'క్లాసిఫైడ్' వొకబులరీకి సంబంధించి పదాలను తెలుసుకోవాలి. సేల్స్ రంగలోనే, కొంతమంది, మార్కెటింగ్ కోసం బయ టకు వెళ్లకుండా షోరూంలోనే ఉంటారు. ఇలాంటి ఉద్యోగాలు చేస్తున్న వారు, అలాగే రిసెప్షనిస్ట్‌లు, ఆంగ్ల పదజాలంలో, మర్యాద పూర్వక పదాలను, ఇతరులను 'రిసీవ్' చేసుకునేందుకు అనువైన పదాలను, వాటి వాడకాన్ని తెలుసుకోవాలి. ఉదాహరణకు షోరూంలో సేల్స్ విభాగంలో పని చేస్తున్న ఉద్యోగి, వినియోగ దారులతో మాట్లాడుతున్న సందర్భంలో, కొత్తగా మరో వినియోగదారుడు వచ్చాడని భావిద్దాం, అయితే అప్పటికే వచ్చి ఉన్న వినియోగదారుడు వెళ్లక ముందే, కొత్తగా వచ్చిన వారిని మర్యాద పూర్వకంగా పిలిచి, వారిని కూర్చోబెట్టాలి, మంచి పదాలను ఉపయోగిస్తూ వాళ్లను కన్విన్స్ చేయాలి. 'sir/Madam, Could you please wait for a moment' ఇలా, వారికి నచ్చేలా మాట్లాడితే వినియోగదారుల నుంచి సానుకూలత వస్తుంది. దీంతో యాజమాన్యం కూడా హర్షిస్తుంది. ముఖ్యంగా ఈ రంగంలోకి వెళ్లాలనుకునే వారు, 'మర్యాద పూర్వకంగా' పదాలను ఎలా వాడాలో తెలుసుకోవాలి. ఇంగ్లీష్‌లోని మోడల్ వర్బ్స్ (can, could, may, might.... etc) ఉపయోగించే తీరుపై పూర్తి స్థాయిలో పట్టు ఉండాలి. సేల్స్‌రంగంలో పనిచేసేవారు ఎదుటివారిని ఆకట్టుకునేలా తడుముకోకుండా మాట్లాడగలగాలి. రిసెప్షనిస్ట్‌లు, తాము చేస్తున్న సంస్థలకు సంబంధించి అవసరం అయిన పదాలను తెలుసుకోవాలి. ఉదాహరణకు విద్యా రంగంలోని సంస్థలో పని చేస్తున్న రిసెప్షనిస్ట్, ఆ సంస్థలో అందిస్తున్న కోర్సుల వివరాలను, క్లుప్తంగా, స్పష్టంగా చెప్పే పదాలను ఎంపిక చేసుకోవాలి. Duration, Mode of fee payment...etc తదితర పదాలు తెలుసుకోవడం, ఆయా సందర్భాల ను వివరించగలగడం చేయాల్సి ఉంటుంది. ఇదే సాఫ్ట్‌వేర్ రంగంలో రిసెప్షనిస్ట్‌గా ఉంటే, ఆ సంస్థల్లో ఉపయోగించే పదాలు వేరుగా ఉంటాయి. వేల సంఖ్యలో ఉద్యోగులు, వాళ్ల కోసం వచ్చే పెద్ద స్థాయి మనుషులు, లేదా విదేశాల నుంచి వచ్చే క్లయింట్‌లు, లేదా వివిధ అవసరాల నిమిత్తం విదేశాల నుంచి ఫోన్ చేసే క్లయింట్‌లు ఉంటారు. వీరి భాషను అర్థం చేసుకొనే సామర్ధ్యం ఉండాలి. అలాగే విదేశీ కస్టమర్లతో మాట్లాడేప్పుడు, భారతీయ వినియోగదారులతో మాట్లాడినట్లు కాకుండా, భిన్నంగా మాట్లా డాల్సి ఉంటుంది. అందుకే సాఫ్ట్‌వేర్ రంగంలోకి వెళ్లే వాళ్లు 'యాక్సెంట్'పై కూడా పట్టు పెంచుకోవాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ మాట్లాడడంలో భాగంగా ఉండే, ఫొనెటిక్స్‌ను కూడా నేర్చు కోవాలి. ఇంచుమించుగా, ఇలాంటి తరహా ఆంగ్ల భాష పరిజ్ఞానం టెలీకాలర్స్ ఉద్యోగాలు ఆశిస్తున్న వారికి కూడా అవసరమే. ఈ ఉద్యోగులు, నేరుగా వినియోగదారులను చూడరు. కేవలం వారితో ఫోన్‌లోనే మాట్లాడుతారు. అందుకే టెలీకాలర్స్ ఉద్యోగా ల్లోని వారు, మరింత మెరుగైన పదాలను ఎంచుకోవాలి. ఎందు కంటే, మంచి పదాలు విన్నప్పుడే, వినియోగ దారుడు వినేందుకు సిద్ధం అవుతాడు. కేవలం తొలి నాలుగు లేదా అయిదు పదాల ద్వారానే వారిని కట్టి పడేసేలా టెలీకాలర్స్ మాట్లాడగలగాలి. ఆ తరహా ఇంగ్లీష్ పదాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. 'Sir/Madam.. would you lend 2 or 3 minutes, for me లేదా Sir/Madam would you allow me to speak for 5 minutes.. etc... ఈ తరహా పదాలను తెలుసుకోవడం ద్వారా వినాలన్న ఉత్సాహం ఫోన్ రిసీవ్ చేసుకున్న వారిలో కలుగుతుంది. సాధారణ పదాలనే వాడడం వల్ల, పెద్దగా స్పందన ఉండదు. క్రమంగా మార్కెట్ తగ్గుతుంది. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసేవారు ఇంగ్లీష్ యాక్సెంట్‌పై పట్టు పెంచుకోవాలి. టీం లీడర్లు సాధారణంగా టీం లీడర్లు, వాక్‌చాతుర్యాన్ని కలిగి ఉండాలి. అలాగే బృందంలో స్ఫూర్తి నింపగలగాలి. అంటే వారిని ఆ స్థాయిలో మెప్పించే పదాలను తెలుసుకోవాలి. 'You could achieve', unbelievable achievement... etc... ఇలా బృంద సభ్యులను ముందుకు తీసుకు వెళ్లగలిగే సామర్ధ్యాన్ని కలిగి ఉండాలి. అలాగే టీం లీడర్లు, సంస్థ యాజమాన్యంతో కూడా సంబంధాన్ని కలిగి ఉంటారు. యాజమాన్యం మెచ్చే స్థాయిలో ఇంగ్లీష్ నేర్చుకోవాలి. అలాగే యాజమాన్యంలో ఉన్నత చదువు లు చదివిన వాళ్లే సాధారణంగా ఉంటారు. ఉన్నత విద్యాలయాల్లో లేదా విదేశాల్లో చదివి వచ్చిన వాళ్లు కూడా ఉండొచ్చు. వీరు పదాలు పలికే విధానం కూడా అత్యున్నత స్థాయిలో ఉండొచ్చు. ఆ మేరకు పరిజ్ఞానం పెంచుకోవాలి. గుర్తుంచుకోండి... -ఎంచుకున్న ఉద్యోగం, అలాగే ఆ ఉద్యోగంతో, ఏ వర్గాలను చేరుతామో ముందే తెలుసుకోవాలి. వారికి అనుగుణంగా ఉండే భాషా పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి. ఉదాహరణకు మెడికల్ రిప్రెజంటేటివ్ ఉద్యోగాన్ని ఎంచుకుంటే, ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా డాక్టర్లను కలవాల్సి ఉంటుంది. సాధారణంగా వైద్యులకు భాషపై మంచి పట్టు ఉంటుంది. కాబట్టి, మంచి పదాలతో పాటు, మెడికల్ టెర్మినాలజీ తెలుసుకోవాలి. -100% గ్రామర్ నేర్చుకున్నంత మాత్రాన, భాషపై పట్టు వస్తుందనుకోవడం పొరపాటే. -కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే చాలా మంది ఇంగ్లిష్ అనే భావిస్తారు. ఇది సరైంది కాదు. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏ భాషలో అయినా సరే ఎదుటివారికి అర్థమయ్యేలా మాట్లాడగలిగే నేర్పు, ఇది ఏ భాషలో అయినా ప్రాక్టీస్ ద్వారానే మెరుగవుతుంది. -భాష నేర్చుకుంటున్న వాళ్లు, ఆంగ్ల చానెల్స్ చూడడం ద్వారా, మంచి ఫలితాలు సాధించవచ్చు. అలాగే నేర్చుకుంటున్న సమయంలోనే నిత్యం ఎవరితోనైనా ఇంగ్లీష్‌లో మాట్లాడాలి. ఆంగ్ల సాహిత్యం చదవాలి.