Thursday, July 18, 2013

DIET CET 2013 Counselling


టీచర్ పోస్టుల భర్తీలో డీఎడ్ అభ్యర్థులకు ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో ఈ కోర్సుకు బాగా డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్(డీఎడ్) కోర్సులో ప్రవేశాల కోసం లక్షల మంది నిరీక్షిస్తున్నారు. అయితే డీఎడ్‌లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (డైట్‌సెట్-2013) ఫలితాలను ప్రకటించి నెల రోజులు కావస్తున్నా ఇంతవరకు ప్రవేశాల కౌన్సెలింగ్‌కు మోక్షం లభించలేదు. అసలు ఇప్పటివరకు డీఎడ్ కాలేజీలకు అనుమతులే రాలేదు. ఈనెల 10వ తేదీ నుంచే విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చుకునేలా చర్యలు చేపడతామని గత నెల 18న డైట్‌సెట్ ఫలితాల విడుదల సందర్భంగా తాత్కాలిక షెడ్యూలును ప్రకటించిన విద్యాశాఖ ఆచరణలో విఫలమైంది. జిల్లాల్లోని జిల్లా విద్యా శిక్షణ సంస్థలతోపాటు(డైట్) 700 వరకు ఉన్న ప్రైవేట్ డీఎడ్ కాలేజీల్లో వేటికి అనుమతి ఇచ్చారు? ఏయే కాలేజీల్లో ప్రవేశాలు చేపట్టాలి? ఎన్ని సీట్లు అందుబాటులో ఉంచాలి? అనే వివరాలేవీ ప్రభుత్వం నుంచి డైట్‌సెట్ విభాగానికి అందలేదు. దీంతో కౌన్సెలింగ్‌లో జాప్యం జరుగుతోంది. ఫలితంగా డైట్‌సెట్‌లో అర్హత సాధించిన 2,71,533 మందికి ఎదురు చూపులు తప్పడం లేదు.


కాలేజీలకు అనుమతులు ఇవ్వడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గతేడాది జూలైలో చేపట్టాల్సిన డీఎడ్ ప్రవేశాలను విద్యాశాఖ ఈ ఏడాది ఫిబ్రవరిలో పూర్తి చేసింది. దీంతో డీఎడ్ ప్రథమ ఏడాది వార్షిక పరీక్షల్లో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. ఈ విద్యార్థులు మరో 2 నెలల తరువాతగాని పరీక్షలు రాయలేని పరిస్థితి నెలకొంది. ఒక విద్యా సంవత్సరం పూర్తి కావాలంటే 222 రోజుల పాటు కాలేజీలు పని చేయాలి.


డీఎడ్ కాలేజీలకు ఇంకా అనుమతులు లభించకపోవటంతో విద్యాశాఖ ప్రకటించిన తాత్కాలిక షెడ్యూలు అమలు కాలేదు. డైట్‌సెట్ ఫలితాల సందర్భంగా విద్యాశాఖ పేర్కొన్న తాత్కాలిక షెడ్యూలు ప్రకారం జూన్ 30వ తేదీ నాటికి డీఎడ్ కాలేజీల జాబితాను ఖరాారు చేయాలి. కాలేజీల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో వెబ్ ఆప్షన్ల ప్రక్రియను ఈనెల 10వతేదీ నుంచే ప్రారంభించాలి. 18న సీట్లను కేటాయిస్తామని పేర్కొంది. ఈనెల 20, 21వ తేదీల్లో ప్రభుత్వ డైట్‌లలో మొదటి దశ కౌన్సెలింగ్ నిర్వహించి ప్రవేశాలు చేపడతామని వెల్లడించింది. ఆగస్టు 1వ తేదీ నుంచి తరగతులను ప్రారంభిస్తామని ప్రకటించింది. అయితే కాలేజీలకు ఇంతవరకూ అనుమతులు లభించకపోవడంతో ఆ షెడ్యూలు అమలుకు నోచుకోలేదు.


ప్రైవేట్ డీఎడ్ కాలేజీల్లో వేటిల్లో తగిన వసతులు ఉన్నాయి? ఫ్యాకల్టీ సరిపడ ఉన్నారా? నిబంధనల ప్రకారం కాలేజీలు పనిచేస్తున్నాయా? అనే విషయాలన్నీ విద్యాశాఖ అధికారులకు తెలుసు. అయినా ఏటా తనిఖీల పేరుతో ప్రవేశాల ప్రక్రియను జాప్యం చేస్తున్నారు. పోనీ నిబంధనల ప్రకారం నడుచుకోని కాలేజీలపై చర్యలు చేపడుతున్నారా? అంటే అదీ లేదు! తనిఖీల పేరుతో కాలేజీల వద్దకు వెళ్లిన అధికారులు, రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ(ఎస్‌సీఈఆర్‌టీ)లోని కొందరు సిబ్బంది భారీగా ముడుపులు దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మంత్రుల పేరుతో వారి అనుచరులు దళారుల అవతారం ఎత్తి ఒక్కో కాలేజీ నుంచి రూ. లక్ష నుంచి లక్షన్నర వరకు వసూలు చేసినట్లు గతంలోనే ఆరోపణలు వచ్చాయి. గత ఏడాదైతే తనిఖీలు జరిగిన కాలేజీల్లో సరిగ్గా జరగలేదని ఫిర్యాదులు వచ్చాయనే సాకుతో మళ్లీ తనిఖీలకు ఆదేశించి భారీగా ముడుపుల దందాకు తెరతీసినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. డీఎడ్ సీటు కోసం ఎదురుచూస్తూ డి గ్రీలో చేరకపోవటంతో విద్యా సంవత్సరాన్ని కోల్పోయిన విద్యార్థులు కూడా ఉన్నారు.


Tags:DIET CET 2013 DIET CET 2013 Counseling  DIET CET 2013 Counseling , DIET CET 2013 Counselling, DIET CET 2013 Counselling, DIET CET 2013 Counselling